యువకవికి లేఖలు [Letters to a young poet ] అనువాదం – మైథిలి అబ్బరాజు

ప్రారంభం

1902 వ సంవత్సరం. అవి శరత్కాలపు చివరి రోజులు. వియెనర్ న్యూస్ టాట్ సైనిక పాఠశాల తోటలో , పురాతనమైన చెస్ట్ నట్ వృక్షాల కింద కూర్చుని పుస్తకం  చదువుకుంటున్నాను ఆ రోజు. ఎంతగా లీనమైపోయి ఉన్నానంటే అక్కడికి హొరాసెక్ గారు రావటాన్ని నేను గమనించుకోనేలేదు. మా అధ్యాపకులలో- సైనికాధికారి కానిది  ఆయన ఒక్కరే .  బాగా చదువుకున్నవారు. సత్పురుషులు. మా పాఠశాల లో మత సంబంధమైన కార్యక్రమాలను నిర్వహిస్తుండేవారు. ఆయన నా చేతిలో ఉండిన పుస్తకాన్ని తీసుకుని , అట్ట మీద రాసి ఉన్నదాన్ని చదివి తల పంకించారు. ” రైనర్ మేరియా రిల్కి  పద్యాలు  ? ” – సాలోచనగా అడిగారు. పుటలను తిరగేస్తూ  అక్కడా అక్కడా కొన్ని పద్యాలని పైపైన చదివారు. కాసేపు ఆయన చూపు ఎక్కడో దూరాన నిలిచింది. ఎట్టకేలకి – సమ్మతిస్తూ  తలాడించారు . ” అయితే , మా విద్యార్థి రెనె రిల్కి కవి అయాడన్న మాట ! ”
దాదాపు పదిహేళ్ళ కిందట –  సెయింట్ పాల్టెన్ సైనిక పాఠశాల లో కింది తరగతులలో చేరిన ఆ అబ్బాయి గురించి విన్నాను అప్పుడు. సన్నగా , పాలిపోయి ఉండేవాడట. అతను సైనికాధికారి కావాలని తలిదండ్రుల ఆకాంక్ష అట. అప్పట్లో హొరాసెక్ అక్కడ పనిచేస్తుండేవారు. తన పూర్వ విద్యార్థిని ఆయన ఇంకా మరచిపోలేదు. ముభావం గా, గంభీరం గా ఉండే ఆ ఆ ప్రజ్ఞాశాలి గురించి ఆయన నాకు చెప్పారు.  సైనిక పాఠశాల క్రమశిక్షణ,  నిబంధనలు – సహజం గా కఠినం గానే ఉండేవి. ఏకాంతాన్ని కోరుకునే తన ప్రవృత్తికి అవి భిన్నం గా ఉన్నా కూడా,  సహనం గా వాటికి తల ఒగ్గి – ఉండేవాడు.  నాలుగో ఏడాది గడిచాక  ఇక ఆరోగ్యం సహకరించక  Linz ఉన్నత పాఠశాలలో చేరాడు. కాని అక్కడ ఉండగలగటమూ అతనికి శక్తి కి మించినపనయిపోయింది. అందువల్ల అతన్ని ప్రేగ్ నగరానికి తీసుకువెళ్ళిపోయారు. ఆ తర్వాత  చదువు ఇంటిదగ్గరే కొనసాగింది. ఆ తర్వాత అతని జీవితగమనం ఎటు మళ్ళిందో హొరాసెక్ గారికి అప్పటివరకూ తెలియదు.
కొత్తగా కవిత్వం రాస్తుండిన నా ప్రయత్నాలను రైనర్ మేరియా రిల్కి కి పంపించి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోవాలని అప్పటికప్పుడే నేను నిర్ణయించేసుకున్నాను. నాకింకా ఇరవై ఏళ్ళు నిండలేదు. నా స్వభావానికి పూర్తి విరుద్ధమైన వృత్తి ని ఎంచుకోవలసి వస్తూన్న అప్పుడు – నన్ను రిల్కి తప్పించి ఇంకెవరూ అర్థం చేసుకోలేరని నాకు తోచింది. ఆ పుస్తకం పేరు To Celebrate Myself  . నా పద్యాలనూ వాటితో బాటుగా ఒక లేఖ నూ ఆయనకు పంపించాను. అనుకోకుండానే నన్ను నేను ఆ ఉత్తరం లో సంపూర్ణం గా వ్యక్తం చేసుకున్నాను. అంతకు ముందు గానీ ఆ తర్వాత గానీ మరెవరి తోనూ నా మనసును అంతగా విప్పనేలేదు.
జవాబు రావటానికి చాలా వారాలే పట్టాయి. ఉత్తరం మీద నీలి రంగు ముద్ర.  పారిస్ తపాలా బిళ్ళలు అంటించి ఉన్నాయి. చేతిలో బరువుగా ఉంది. లోపలి వాక్యాలలో  మొదటి నుంచీ చివరి దాకా ఏ స్పష్టతా ఏ సౌందర్యమూ ఏ అభయమూ దర్శనమిచ్చాయో సరిగ్గా అవే – చిరునామా రాసిన చేతివ్రాత లో కూడా ఉట్టిపడినాయి.  ఆ విధం గా మొదలైన మా ఉత్తర ప్రత్యుత్తరాలు 1908 వరకూ కొనసాగాయి.ఆ తర్వాత మెల్లిగా తగ్గిపోయాయి.  ఆ కవి నా పట్ల చూపించిన అక్కర, మార్దవం, అపేక్ష – జీవితపు ఏ పరిధుల నుంచీ నన్ను రక్షించాలనుకున్నాయో ఆ హద్దుల్లోకే నేను ఇమడవలసి రావటం అందుకు కారణం.
అయితే ఆ విషయం ముఖ్యం కాదు. నాకు అందిన ఆ పది ఉత్తరాలూ చాలా ముఖ్యం. రైనర్ మేరియా రిల్కి జీవించిన, పని చేసిన – ప్రపంచం పట్ల ఆయన ప్రదర్శించిన లోచూపు ముఖ్యం. వర్తమానం లోనూ భవిష్యత్తు లోనూ ఎదుగుతూ మారుతూ ఉండవలసి వచ్చే ఎంతో మంది మనుషులకోసం ముఖ్యం.. సాటిలేని మనిషి అయిన ఆ గొప్పవాడొకడు మాట్లాడుతున్నప్పుడు మనం నిశ్శబ్దం గా వినటం ముఖ్యం .
– ఫ్రాంజ్ జేవియర్ కపూస్
బెర్లిన్, జూన్ 1929.

[ ఇంకా ఉంది ]

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s