ఫార్వర్డ్ థింకింగ్ – స్వాప్నిక్ చీమలమర్రి

Disclaimer: మీరు పుట్టిన దగ్గర నుంచి 2017 వరకు మీ ఇష్టం వచ్చినట్టు చేసారు. కనీసం 2018 నుంచైనా మనం కొన్ని వాటిమీద బలంగా నుంచోకపోతే కష్టం. (అందరం ఒకేసారి నుంచోవద్దు, విరిగిపోతే మళ్ళీ మనకే నష్టం). ఈ కింద రాయబడిన దానికి ఈ వాక్యాలకి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ ఉందని మీకు అనిపిస్తే. ఇంకా కూర్చున్నారే! నుంచోండి.

*****

పొద్దునే లేవగానే ఫోన్లో కుప్పలుగా వాట్సాప్ మెసేజిలు (500+) అందులో మధ్యాహ్నం వరకు ఏరితే, ఎక్కడో ఒక మూల, రెండు ఫార్వర్డ్ మెసేజిల మధ్యలో, ఇరుక్కుపోయి శ్వాస అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఒక ఇంపార్టెంట్ మెసేజ్. ఏంటి సార్ ఇది. అసాధారణంగా సాధారణంగా మారిపోయిన జీవిత చక్రానికి కొన్ని ఫార్వర్డ్ మెసేజిలు తమవంతు తాము గాలి కొడదాం అని చూస్తుంటాయి. నిజమే తప్పులేదు. నేను ఒప్పుకుంటాను కూడా.  కానీ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అన్నీ స్టీవ్ జాబ్స్ లాగో, లియోనార్డో లాగో జీనియస్లు కావు, కొన్ని డోనాల్డ్ ట్రంప్ లాంటి ఆవరేజ్ మెసేజిలు కూడా పుడుతుంటాయి. దీన్నే ఎవల్యూషన్ అంటారు. అనుకుంటా.

 

కిందకి వెళ్లే ముందు ఒక్క చిన్న వన్ లైనర్ – “అవసరం అనేది అందరిదీ, కానీ అందరికి అన్నీ అవసరం లేదు.” ఏంటి! సినిమాల్లో వాడుకుంటారా! కేసు పెడతా జాగర్త !

 

అసలు కొన్ని మెసేజిలతో ఇబ్బంది లేదండి. చాలా ఆరోగ్యకరంగా, సౌమ్యంగా (Benign), “గుడ్ మార్నింగ్ లు” “గుడ్ ఈవెనింగ్ లు” ఇలా ఉంటాయి, కానీ కొన్ని ఉంటాయి చూసారు, మనకి జీవితంలో అస్సలు అవసరంలేని జ్ఞానాన్ని మీద పడేసి రుద్దేలా “దృతరాష్టుడికి నాలుగో భార్య ఉండేదని మీకు తెలుసా?” ఉంది? అయినా అయన పర్సనల్ అఫైర్స్లో తలా దూర్చడానికి మనకేంటి హక్కు? అని చాలామంది అనుకుంటారు.  “ఆవిడ ఇప్పటికీ బ్రతికే ఉందని మీకు తెలుసా?” – ఇక్కడికొచ్చేప్పటికి కక్కుర్తి పడిపోతారు.   ఇంకొన్ని అస్సలు మనకి సంబంధం లేనివి వస్తుంటాయి,  “బొహేమియాలో కృత యుగం నాటి రాగి నాణెం దొరికింది. ప్లీజ్ ఫార్వర్డ్.” ఇలాంటివి అన్నమాట. “దొరికితే దొరికింది, అది నాది కాదుగా” అనుకుని రిలాక్స్ అవుతారని, ఆ పంపించిన అయన మెసేజితో పటు మనకి ఒక బాధ్యతని అప్పజెప్పాడు – ఆ చివర్లో “ప్లీజ్ ఫార్వర్డ్.” అని కనపడుతుంది  చూసారా, అది.  అంటే అర్థం ఏంటంటే, అది ఎవరు పారేసుకున్నారో వారికీ చేరేవరకు మనం దీన్ని పక్కవాళ్ళకి తోస్తే, వాళ్ళు చివరికి పోలీస్ స్టేషన్లో ఆధార్  కార్డు చూపించి తీసుకుంటారన్నమాట.కొన్ని మనం ఇప్పటిదాకా నిజమని నమ్మే విషయాలని “అది నిజమనుకుంటున్నారా? అయితే మీ అంత వెధవలు ఇంకొకరు ఉండరు” అని చెప్తుంటాయి, ఆలా చెప్తేనేగా కదా ఆ లింక్ నొక్కి రష్యాలో తిండిలేక దొంగతనాలకి దిగిన హ్యాకర్స్ కిి డబ్బు సాయం చేయగలిగేది. పాపం వాళ్ళకి సంసారాలు ఉండవా!

 

ఏంటి! బటన్ నొక్కితే డబ్బులు ఎలా పోతాయా! మంచి ప్రశ్న.

 

*****

 

ఎందుకో ఆ రోజు మీకు భలే సంతోషంగా ఉంటుంది. ఇడ్లీలో చట్నీ బాగా కుదురుతుంది, ఎప్పుడు లేనిది న్యూస్ పేపర్ తడవకుండా పొడిగా ఉంటుంది. అదే టైంకి మీ ఫోన్ టింగ్ మంటుంది. పరంధామయ్య వాట్సాప్ మెసేజ్.  “మీరు తినే నారింజ పండులో విషం ఉందా?” తెల్సుకోవాలనే కుతూహలంలో నొక్కేస్తారు.  ఆలోచనలో పడతారు, లింక్ లోడ్ అయ్యేలోపు, వివిధ పెర్ముటేషన్స్ ఆలోచిస్తారు,  నిజమే ఉండే ఉంటుంది, లేకపోతే నిన్న కొట్టువాడు డిస్కౌంట్లో అన్నేసి నారింజ పండ్లు ఎందుకు పెడతాడు. బావున్నాయ్ పట్టుకెళ్లండి సార్ అన్న కొట్టువాడి నవ్వు మొహం వెలుగుతుంది. వాడికి మనం చేసిన ద్రోహాలన్నీ గుర్తుతెచ్చుకుంటాము, ఇంకా లింక్ లోడ్ అవ్వదు, పూర్వ జన్మలో చేసిన పాపాలని ఒక్కసారి నెమరేసుకుంటారు . ఇంకా లోడ్ అవ్వదు, “A watched link never opens” అనే సామెత గుర్తొచ్చి కాసేపు పక్కకి తిరుగుతారు. తిరిగి చూసేసరికి లింక్ లోడ్ అయ్యి ఉంటుంది, విషం ఉండదు, నారింజ కాయ ఉండదు, “Your android phone is infected with virus. Please click this to delete it.” అనే పేజీ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఇదేంటిరా బాబు, ముందు అభంశుభం ఎరుగని నారింజలో విషం అన్నారు, ఇప్పుడు పాపం పుణ్యం ఎరుగని ఫోన్లో వైరస్ అంటున్నారు, శని ప్రభావం మొదలైందా అనుకుంటూ డెలీట్ బటన్ నొక్కేస్తారు. హమ్మయ్య ఒక పని అయిపోయింది. శని ప్రభావం మొదలైంది.

 

“హుష్! ఏవోయ్ కాఫీ పట్రా, ఫోన్లో వైరస్ క్లీన్ చేశాను, కాస్త నీరసంగా ఉంది.”  ఇలా ఏదో అంటారు.

 

“ఇప్పుడు కాఫీ ఏంటండీ, నారింజ జ్యూస్ తీసాను తెస్తా ఉండండి” అని వినిపిస్తుంది.

 

ఈలోపు ఆ వైరస్ పేజీ పోయి, “మీ భార్య మిమ్మల్ని చంపాలని చూస్తోందా” అనే పేజీ ఓపెన్ అవుతుంది. మీకు టెన్షన్ మొదలు. ఇదేమి గొడవరా బాబు అనుకుంటుండగా,  “టంగ్, టంగ్” మని మెసేజిలు.  ఆ పరంధామయ్యగాడేమో, వాడి రక్తం కళ్ళచూద్దామని ఎమోజిలలో కత్తిని రెడీ చేసుకుంటారు.  ఓపెన్ చేస్తే, మెసేజిలు, మీ బ్యాంకు నుంచే, మీ అకౌంట్లో నుంచి మూడు సార్లుగా నలభై వేలు లాగేసినట్టు. “వామ్మో” అనుకునే లోపు, కనపడకుండానే జ్యూస్ మీ టేబుల్ మీదకి వస్తుంది. ఆ గ్లాస్ తీసి కింద కొడతారు. మీ తప్పేమి లేదు. మరి నలభై వేలు అంటే మాటలా! రుసరుసలాడుతూ బ్యాంకులో కనుక్కోటానికి వెళ్ళిపోతారు. ఆ సాయంత్రం మీ ఆవిడ మటుకు పక్కింటి పిన్నిగారితో, ఈ మధ్యన మీకు కోపం ఎక్కువైపోతోందని పిన్నిగారికి చెప్తుంది, “పొద్దున్నే జ్యూస్ గ్లాస్ నా మొహాన విసిరికొట్టారు తెలుసా” అని కాస్త డ్రామా చేరుస్తుంది. (నిజమే కింద కొడితే పెంకులు ఉంటాయి కానీ డ్రామా ఉండదుగా.) ఆ కాస్తకే మిమ్మల్ని పిచ్చివాడిగా నిర్ధారిస్తారు పిన్నిగారు. మీ అమాయకపు భార్య అది నిజమని నమ్మేసి, ఆవిడా దగ్గర పోపుల డబ్బాలో రెండు వేలకి తాయత్తు కొంటుంది.  ఒక్కరోజులో, 42000 పిండేసి, కొసరుగా  మిమ్మల్ని పిచ్చివాడిగా చేసింది ఆ మెసేజ్ . అవమానం తట్టుకోలేక ఆ రాత్రికి నిజంగానే చచ్చిపోదామని ఫ్రిజ్ లో ఉన్న ఆ నారింజ జ్యూస్ గటగటా తాగేస్తుంటారు. లైట్ వేసుకోవడం మర్చిపోతారు. (పోయేటప్పుడు కూడా కరెంటు ఎందుకు దండగ).  లీలగా రెపరెపలాడుతున్న ఆ  ఫ్రిడ్జ్ లైట్లో మీ ఆవిడ మిమ్మల్ని చూసి భయపడుతుంది. కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆవిడని లేపబోయి, కింద ఒలికిపోయిన జ్యూస్ మీద కాలేసి కాలుజారీ పడిపోతారు, నడుము విరిగిందేమో అని అనుమానపడతారు. డాక్టర్స్ ద్రువీకరిస్తారు. చూసారా ఒక్క దరిద్రగొట్టు నారింజ కాయ ఎంత పని చేసిందో అనుకునేలోపు, కాదు! ఇదంతా చేసింది ఆ దిక్కుమాలిన మెసేజి అని పెయిన్ కిలర్స్ బారిన పడిన మీ బుర్ర గుర్తుచేస్తుంది. మీరు తల పట్టుకుంటారు.

 

ఇలా ఎన్ని ఇళ్ళు కూలిపోతున్నాయో మీకేం తెలుసు. మళ్ళీ డబ్బులు ఎలా పోతాయి అనే ప్రశ్నలు. తెలియక అడగడం ఏంటి సార్. ఊరుకోండి ఇంక!

 

*****

 

ఇక కుర్రాళ్ళని ఆకట్టుకోడానికి ఎన్ని ప్లాన్స్ సార్! మీ తెలివి ..నా తల అనిస్తున్నా! “సల్మాన్ ఖాన్ కి నిజంగా పెళ్లి కాలేదా?” అని పంపిస్తారు. ఎంత క్రూరులు సార్ మీరు. నొక్కని మనిషి ఎవడైనా ఉంటాడా! తెలుసుకోవాలని నొక్కగానే పాపం ఆ పెద్దాయన కి పట్టిన గతే కుర్రాడికి.

 

ఏంటి మీకు తెలీదా! చెప్పండి, ఆ లింక్ నొక్కకుండానే ఫార్వర్డ్ చేస్తున్నారా? గుండెమీద చెయ్యి వేసుకొండి. ఎడం చెయ్యి కాదు, కుడి చెయ్యి. అంటే నా! నటించకండి సార్!

 

“సర్ మీరు అన్నిటికి ఇలా పెడగా ఆలోచిస్తే కష్టం.”

“నేను ఆలోచించడం ఏంటండీ. పోనీ మీకు అవసరమా.”

“లేదనుకోండి.”

“మరి ఇంకేంటి.”

 

*****

 

సరే కదాని సద్దుకుని అలాటి మెసేజీలకి దూరంగా  కృష్ణా రామా అని కాలం గడుపుతూ ఉంటే, ప్రపంచంలో ఉన్న శివలింగాల (మీ వీధి చివరి గుడితో సహా) లిస్టులు పంపడం. కృష్ణా రామ అంటున్నాంగానీ శివుడిని ప్రార్థించలేదు అనే guilt లో ఆ లింక్ నొక్కించేస్తారు. మళ్ళీ దేవుడు ఒక్కడే అని పాటలు, కీర్తనలు మొదలెడతారు. మీలో మీకే ఒక స్పష్టత లేకపోతే ఎలా సార్? దేవుడు ఒక్కడే అయినప్పుడు 2160 పేజీల పీడీఎఫ్ పంపడం ఎందుకు? ఆ నెల ఆ ఒక్క పీడీఫ్ డౌన్లోడ్ చేసి, ఇంటర్నెట్ డేటా కి ఎక్స్ట్రా డబ్బులు కట్టేలా చేస్తారు.. ఎందుకు సార్! వెధవ డేటా పోతే పోయింది, శివార్పణమ్ అనుకుంటే, ఆ పిడిఎఫ్ల్ లో  తప్పులున్నాయి అని మీలో మీరే కొట్టుకోవడం. సార్, 2160 పేజీలు సార్. 100 సంవత్సరాల జీవితంలోనే ఎన్నో తప్పులు చేస్తాం, అన్ని పేజీలు సార్ ఆ మాత్రం ఒకటి రెండు ఉండవా?” మళ్ళీ 108*20 = 2160 దేవుడు ఉన్నాడనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఉందా అని అరుపులు, కేకలు.

 

“ఇదిగో నేరేటర్ గారు, ఇలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం..”

 

“వచ్చేసారా! రండి రండి. కూర్చోండి. కాఫీ తాగుతారా? అయ్యో వద్దనకండి. కొట్టుకుచావడానికి శక్తి కావద్దూ. ఉండండి ఇప్పుడే వస్తా. ఈలోపు మీరు ఈ టీవీ చూడండి. భక్తి ఛానల్ పెట్టనా? వద్దా.. మరి!  స్టార్ మూవీస్ ఆహ్? ఒకే. అయ్యో మీరు అడగాలా, HD నే పెడుతున్నా.”

 

ఆల్రెడీ విరిగిన నడుముని మళ్ళీ విరగొట్టిపోతారు. ఎలారా భగవంతుడా! నా నడుము అదే మీ నడుము అమ్మా! అనుకుంటూ ఉండంగా వస్తుంది, మాతృత్వం పొంగిపొర్లే మెసేజి. అమ్మ ఎలాంటిదో తెలుసా. అసలు అమ్మ మనల్ని ఎలా పెంచిందో తెలుసా. అసలు ‘అసలు’ అనే పదానికి ‘అమ్మ’ అనే పదానికి మొదటి అక్షరం ‘అ’ అని మీకు తెలుసా! అని. అమ్మని తలుచుకోగానే అమ్మ గురించి మెసేజ్ వచ్చిందని కాసేపు ఆనందంగా ఆనందబాష్పాలు కార్చేలోపు, పంటికింద నారింజ కాయిలా చీమతలకాయంత అక్షరాలు. మరీ పెద్దవి అయితే కళ్ళు అవాయిడ్ చేసేయ్యవూ – అన్ని తెలుసు సార్ మీకు! ఛా మాట్లాడకండి!  ఈ మెసేజిని 10 నిమిషాల్లోపు ఇంకో పదిమందికి పంపకపోతే, మీ ఇంటికి అరిష్టం పడుతుంది. మెసేజీ ఎప్పుడొచ్చిందో చూస్తారు, 11 నిమిషాల క్రితం. అమ్మ గురించి తలుచుకుని, మీరు పొందిన ఆనందం విలువ, మీ ఇంటి అరిష్టం.

 

ఆ నా మొహం –  ఇలాంటివి నమ్ముతామా అని కాస్త భయంగానే అనుకుంటారు. అటుగా వెళ్తున్న మీ ఆవిడ ధైర్యం చెప్తుందేమో అని ఈ సంగతి మొత్తం చెప్తారు. ఆవిడ, ఎంతపని చేసారండి. పంపిస్తే పీడాపోయేది కదా! సరే నేను కూరగాయల వరకు వెళ్ళొస్తా అని, చక్కాపోతుంది. మీకు అనుమానం మొదలు మళ్ళీ. గాబరాగా అనిపిస్తుంది, అది నిన్న అతిగా తాగిన జ్యూస్ వల్లనో మెసేజి వల్లనో తెలుసుకోలేక వెంటనే ఆ మెసేజీ పంపిన ఆయనికి ఫోన్ కొడతారు. మీ బాధని చెప్పుకుంటారు. అయన చాలా నిదానంగా, అవును రాసుంది! అంటాడు. నిజమేనంటావా? నేను పంపించలేదు ఇపుడు ఎలా? అని అడుగుతారు. రాసి ఉంటే జరగక తప్పదుగా అంటాడాయన? మీకు కంగారు రెట్టింపు అవుతుంది. ఫోన్ పెట్టేసేలోపు మీకొక అనుమానం వస్తుంది, రాసి ఉండడం అంటే, నుదిటిమీద రాసి ఉండడమా?. మెసేజీ కింద రాసుండడమా, ఇదే విషయం అడుగుతారు. అంత రిస్క్ చేయగలవా అంటాడాయన. మీరు అంత రిస్క్ చేసే వాళ్ళే అయితే ఇక్కడిదాకా వస్తుందా? మీరు టీవీలో మౌంటెన్ డ్యూ యాడ్ కూడా చూసి ఎరుగరు ఇప్పటిదాకా. ఫోన్ పెట్టేయంగానే, “టంగ్” పరంధామయ్య మెసేజి, “అన్ని ఇంటి అరిష్టాలకి ఒక్కటే కిటుకు.” నొక్కేస్తారు, నాకు తెలుసు, మీ భయం అలాంటిది. అది ఒక టెలిబ్రాండ్స్ సైట్లోకి మిమ్మల్ని ముద్దుగా లాక్కెళుతుంది. అరిష్టాలకి విరుగుడు మొత్తం ఒక్క చిన్న యంత్రంలో ఉందని అది దృతరాష్టుడు తపస్సు చేసి సంపాదించి అతని నాలుగో భార్యకి బహుమానంగా ఇచ్చాడని చెప్తారు, ఏ విషయమైనా నంబర్లతో చెప్తే నమ్మి తీరాలని, అర్ణబ్ గోస్వామి అప్పటికే మిమ్మల్ని నమ్మించేసాడుగా. మీరు నమ్మేస్తారు. వాళ్ళకి అర్జెంటు పని ఉందని వెళ్ళిపోతారు, వాళ్ళు మరి సాయంకాలాలు ఐసిస్ తీవ్రవాదులకి జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అని నమ్మించే కార్యక్రమాలకి వెళ్తుంటారు. మీరు పేమెంట్ గేట్వేలో ఒంటరిగా ఉంటారు. మీ అమ్మ గుర్తొస్తుంది. మీ ఇల్లు కాలిపోతున్నట్టు కలకంటారు. మీరు 9999 పెట్టి ఆ యంత్రాన్ని కొంటారు. కరెక్టుగా గేట్వే పేజీలో OTP కొట్టాక అది ఎర్రగా ఎర్రర్ కక్కుకుని చచ్చిపోతుంది. “404 పేజీ నాట్ ఫౌండ్.” ఇంకేముంది అరిష్టం మొదలైందని ఫిక్స్ అయిపోతారు. కొన్నాళ్ళు గడుస్తాయి, ఒకరోజు అరిష్టానికి మీ ఇంట్లో బోర్ కొట్టి తనంతటి తానే మిమ్మల్ని నిద్రలేపకుండా, మీరు పడుకున్నప్పుడు, కాళ్ళకి దణ్ణం పెట్టి రజనీకాంత్ లాగా వెళ్ళిపోతుంది. ఆ వెంటనే మీకు బజాజ్ ఫైనాన్స్ లాటరీలో వెండి మొలతాడు తగులుతుంది. మీ ఆవిడ, ఆ మొలతాడు మీరే కట్టుకుంటానంటే, మీకు సోకులెందుకని మీకు తెలియకుండా మనవడికి ఇచ్చేస్తుంది.

 

అసలు ఇలా ఎంత లాస్ తెలుసా! టైం, మనీ, పరువు, మొలతాడు. నాన్సెన్స్. వీటన్నిటికీ కారణం ఎవరు? ప్లీజ్ సార్! అన్నిటికి నరేంద్ర మోడీ అనకండి. ఈ విషయంలో మటుకు నేను నమ్మను గురుగారు. ఏంటి! ముఖేష్ అంబానీనా? ఎందుకుట? ఓహో jio పెట్టాడనా.. ఇలాంటి లాజిక్కులకి తక్కువ లేదు. ఏంటి! వినపడట్లేదు. కొంచెం గట్టిగా. ఫోన్ చూడాలా? సైలెంట్లో ఉంది. అబ్బా ఇప్పుడేంటండీ. అబ్బబ్బా చంపేస్తున్నారు, ఒక్క నిమిషం ఉండండి చూస్తున్నా. ఈలోపు దీనికి కారణం ఎవరో ఒక కాయితం మీద రాస్తూండండి.

 

మీరు ఫోన్ తెరిచి చూస్తారు, “అసలు ఫార్వర్డ్ మెసేజిలకి కారణం ఎవరో తెలుసుకోవాలంటే ఈ లింక్ నొక్కండి”  అని మెసేజ్.

 

1 Comment

  1. “ఫోన్ పెట్టేసేలోపు మీకొక అనుమానం వస్తుంది, రాసి ఉండడం అంటే, నుదిటిమీద రాసి ఉండడమా?. మెసేజీ కింద రాసుండడమా, ఇదే విషయం అడుగుతారు…….తమ్ముడూ! ఇలా నవ్వించావు అంటే ఎప్పుడో నవ్వుతూ , నవ్వుతూ ప్రాణం పోగొట్టుకుని, నవ్వుతూ పోయాడు అదృష్టవంతుడనిపించుకోవాలేమో నేను అని నా డౌటనుమానం. చాలా బాగుంది , ఇట్లాగే సాగించు.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s