అయిదుగురు పిల్లలూ అదీనూ – మూడో భాగం ఇ. నెస్ బిట్ – మైథిలి అబ్బరాజు

అంతులేని  నిధి  కి అధికారులయి ఉండి  కూడా , నిజంగా పనికొచ్చేదాన్నీ సంతోషం ఇచ్చేదాన్నీ దేన్నీ కొనుక్కోలేకపోయారు పిల్లలు. ఒక జత నూలు గ్లవ్స్, ఒక మొసలి చర్మం పర్స్,  పెన్నీకి ఒకటి వచ్చే బన్ లు పన్నెండు, గుర్రం బండి లో విహారం – అంతే. ఆ మర్నాడు పొద్దున లేస్తూనే ఏమంత ఉత్సాహం గా లేదు వాళ్ళకి. శామీడ్ కనిపించటం గొప్ప అదృష్టమనీ ఆ రోజు కోరికని ముందే ఆలోచించి పెట్టుకోవాలనీ – ఆవాళ అనిపించలేదసలు.  అద్భుతమైన అందం, అనంతమైన సంపద – ఏదీ వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వలేదు. కాకపోతే , ఏమీ జరగకుండా ఉండటం కన్నా ఏదో ఒకటి జరుగుతూ ఉండటం సరదానే. ఉత్తినే తినటం పడుకోవటం విసుగు కదా, అంతకన్న ఏదైనా నయమే.

బ్రేక్ ఫాస్ట్ కి ముందే  కూర్చుని చర్చించుకుందుకు వీల్లేకపోయింది – ఎందుకంటే ఒళ్ళు తెలియకుండా నిద్దర్లు పోయి పొద్దెక్కి లేచారు అందరూ – ముందు రోజు బొత్తిగా అలిసిపోయిఉండి. పోనీ అప్పుడైనా మాట్లాడుకుందామంటే పాపాయి ఆ పూట మహా కంగాళీ గా ఉంది. మార్తా కి బోలెడు పని ఉందని పాపాయిని పిల్లలకి అప్పజెప్పింది. దానికి తినిపించటానికి అందరికీ తలప్రాణం తోకకొచ్చింది. దానికి ఎత్తు కుర్చీ వేసి కూర్చోబెడతారు – అందులోంచి జారిపోయి తలకిందులు గా వేలాడి ఉక్కిరిబిక్కిరి అయింది. తర్వాత ఉన్నట్లుండి ఇంత లావు గరిట ని దొరకబుచ్చుకుని సిరిల్ నెత్తి మీద టంగుమని మోదింది. చేతిలోంచి లాగారని కేకలు పెట్టి ఏడ్చింది. తాగాల్సిన పాల గ్లాసులో రెండు చేతులూ ముంచి తపా తపా కొట్టింది . బుజ్జి గొంతేసుకుని పాటలు పాడింది. బల్ల మీద నిలుచుని చిందులేసింది. ” షిక్కా.. పోలా – ” అని బిగ్గరగా ప్రతిపాదించింది. ఆ సందర్భం గా సంభాషణ ఇలా సాగుతుండింది.

” ఇప్పుడూ, ఆ ఇసక యక్షిణీ – అరే, చూడండ్రా పాల జగ్ పట్టేసుకుంది, పారబోస్తుంది ”

పాలు భద్రమైన చోటికి రవాణా అయాయి.

” ఆ- అదే. అరే, బుజ్జీ – ఆ చెంచా ఇచ్చేయమ్మా ”

” అవును ఇవాళా – అయ్యొ. పచ్చడి జాడీ …పాపాయీ నువ్వూ- ”

” ఇవాళేం కోరుకుందామంటే …” దబ్. ఫెళ్. ఇష్టమొచ్చినట్లు గాలిలో కుస్తీపడుతూన్న పాపాయి పిడికిళ్ళు తగిలి  భోజనాల బల్ల మధ్యలో ఉన్న చిన్న ఆక్వేరియం బద్దలైంది. అదీ అందులో ఉండే నీళ్ళూ నాచూ గులకరాళ్ళూ బంగారు చేపలూ అందరి ఒళ్ళలోకీ దొర్లాయి. పాపాయి మొత్తం తడిసిపోయింది. అంతా చిరాగ్గా అరిచారు, పాపాయి ఒక్కతే మౌనం వహించింది. గాల్లో ఊపిరాడక కొట్టుకునే బంగారు చేపలని ఆదరాబాదరా గా సిరిల్ నీళ్ళ జగ్ లో వేశాడు. మార్తా వచ్చి పాపాయిని బట్టలు మార్చ్జేందుకు పట్టుకుపోయింది. పిల్లలంతా కూడా వేరే పొడి బట్టలు వేసుకోవాల్సి వచ్చింది. రోజూ వాడే జేన్ గౌన్ లు మూడే- ఒకటేమో ముందు రోజు చిరిగిపోయింది. ఇంకోటి ఇవాళ తడిసిపోయింది. మూడోది బాగా మాసిపోయిందని మార్తా ఉతకటానికి నానబెట్టింది.   దాపుడు గౌన్ లలోంచి తీసి ఒకటి వేసుకుందమంటే మార్తా ససేమిరా ఒప్పుకోలేదు. చచ్చినట్లు అప్పుడు కూర్చుని గౌన్ కుట్టుకోవాల్సి వచ్చింది. తనని వదిలేసి తక్కినవాళ్ళు ఏం వెళతారు – అక్కడే అంతా కూలబడ్డారు. పాపాయిని మార్తా తీసుకుపోయింది కాబట్టి మాట్లాడుకోవటమైతే కుదిరింది.

 

రాబర్ట్ కీ ఆంథియా కీ శామీడ్ ఒట్టి దగాకోరని అనిపిస్తోంది. వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకుంటారు – పైకి చెప్పరు. సిరిల్ కి చిరాకెత్తింది. ” చెప్పేదేదో అందరికీ చెప్పి ఏడవండి ”

” నన్నడిగితే అసలూ ” – రాబర్ట్ మొదలెట్టాడు.

” నిన్నెవరూ అడగలా ” – జేన్ ముడేసిన దారాన్ని పళ్ళతో కొరికి తెంపింది. అదొక చెత్త అలవాటు జేన్ కి. అమ్మ ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది, ఇవాళ లేదుగా.

” ఎవరడిగారో ఎవరడగలేదో నాకక్ఖర్లేదు. నాకూ ఆంథియా కీ శామీడ్ దంతా మోసం అనిపిస్తోంది. కోరికలు తీర్చినట్లే తీరుస్తోంది, మనమేమో నానా యాతనా పడుతున్నాం. అలా అవుతుందని దానికి ముందే తెలుసులా ఉంది , మనల్ని కావాలనే ఏడిపిస్తోంది. దాని గొడవ వదిలేసి మన పాత ఆటలు మనం ఆడుకుంటే పోదూ ? ”

సిరిల్ కీ జేన్ కీ మాత్రం ఆశ చావలేదు. వాళ్ళకెప్పుడూ అంతే.

” చ. అదేం కావాలని చేసి ఉండదు. అంతంత  డబ్బు కావాలనటం నిజం గా మనదే తప్పు . చిల్లర గా యాభై పౌండ్ లు అడిగి ఉంటే అన్నీ కొనుక్కున్నా ఇంకా మిగిలేది. అందం సంగతైతే – అంటే అన్నానంటారు గానీ అంత బుద్ధి తక్కువ ఉండదు. ఇప్పటికైనా , ఇవాళైనా – ఏమడగాలో సరిగ్గా ఆలోచించుకుందాం ” – సిరిల్.

చేతిలో పనిని పక్కనపెట్టి జేన్ కూడా అందుకుంది.

” నాకూ అలాగే అనిపిస్తోంది. ఎక్కడో కథల పుస్తకాల్లో తప్పించి ఇలాంటి అవకాశం ఎవరికైనా వచ్చినట్లు విన్నామా ? జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి బోలెడుంటాయి మంచి కోరికలు. అన్నీ నిన్నా మొన్నా లాగే చెత్తయిపోవాలనేముంది ? ఇప్పటికే ఆలస్యమైంది- ఇదిగో , ఈ పనైపోగానే బయల్దేరదాం  ”

ఎంత గబగబా చేసినా ఆ పని ఎంతకీ అవలేదు. అందరూ ఆదుర్దాగా  ఏదేదో చెప్పటం మొదలెట్టారు – అవతలివాళ్ళు చెప్పేది పూర్తవకుండానే ఇంకొకళ్ళు. పెద్ద గందరగోళం. ఎవరికీ ఏమీ అర్థం కావట్లేదు. ఆఖరికి – సిరిల్ అన్నట్లు షిల్లింగ్ ల రూపం లో యాభై పౌండ్ ల డబ్బు కోరుకోవాలని నిర్ణయమైంది. ఎట్టకేలకి జేన్ గౌన్ కుట్టటం పూర్తయి అంతా బయటపడేసరికి మార్తా పాపాయిని వాళ్ళతో తీసుకుపొమ్మంది. పిల్లలు వద్దన్నారు.

” వద్దూ ? ఎందుకొద్దేం ? బంగారు తల్లి ఎంత ముద్దొస్తుందో, ఎవరైనా సంతోషం గా ఎత్తుకు తీసుకెళతారు – మీకేమైందట ? అయినా మీ అమ్మగారికి చెప్పారుగా పాపాయి ని రోజూ షికారు తిప్పుతామని ? ”

” అన్నాములే ” – రాబర్ట్ మొహం వేలాడేశాడు. ” ఇదింకొంచెం పెద్దదైతే బావుండేది. ఏమీ అర్థం కాదు, ఎక్కువ దూరం నడవలేదు …”

” అబ్బో , మీరంతా ఒక్కరోజులోనే పెద్దయిపోయారు మరి ! నలుగురున్నారు, మొయ్యటానికేం ? అయినా మధ్య మధ్యలో దింపండి, నడుస్తుందిలే ” – పాపాయిని ఆంథియా చేతుల్లోకి కూలేసి మార్తా కుట్టు పని చేసుకోవటానికి వెళ్ళిపోయింది.

ఆంథియా దాన్ని వీపుమీద ఉప్పు మూట వేసుకుంది. పాపాయి సంతోషం తో కేరింతలు పెట్టింది. ఆక్వేరియం గులకరాళ్ళని గుప్పెట్లో పట్టుకొచ్చుకుంది – వాటిని జేన్ కి తినిపించబోయింది. అందరికీ ముద్దొచ్చింది. దాన్నీ తీసుకెళ్ళాల్సివచ్చినందుకు నస పెట్టుకోవటం మానేశారు.

జేన్ కి మరీ ఎక్కువ ముద్దొచ్చి , కథల్లో దేవకన్యలు ఇచ్చేవరాల్లంటివి పాపాయికోసం అడుగుదామంది. ఏ కోరికా సూర్యాస్తమయం తర్వాత నిలబడదు కనుక ఆ వరాలేవీ పాపాయికి పెద్దయాక ఉపయోగపడవని ఆంథియా గుర్తు చేసింది. సరెలే, ఆ యాభై పౌండ్ లలో రెండో మూడో పెట్టి ఊగే గుర్రం కొనిపెట్టచ్చులే అని జేన్ సర్దుకుంది.

త్వరత్వరగా అడిగేసి, ఆ డబ్బు చేతిలో పడగానే నిన్నట్లాగా రయ్యి మని రోచెస్టర్ వెళ్ళిపోవాలి. ఏమేం కొనుక్కోవాలో ముందే అనేసుకోవాలి. కావస్తే మార్తాని కూడా ఎక్కించుకెళితే కాస్త ధైర్యం గా ఉంటుంది…

కంకర గుంట దగ్గరికి వచ్చేసరికి అందరికీ ఒకే ఘోరమైన విషయం గుర్తొచ్చింది. ముందు రోజున , అంతులేని ధనాన్ని కోరుకున్నప్పుడు శామీడ్ ఆ గుంటనంతా పూర్తిగా బంగారం తో నింపబోతూ వళ్ళని ముందుగా దూరం వెళ్ళమని చెప్పింది. ఆ సందట్లో శామీడ్ ఎక్కడుంటుందో చుట్టూ రాళ్ళు గుర్తు పెట్టుకోవటం మర్చిపోయారు – ఇప్పుడు ఎక్కడని వెతకాలి ??? అందరికీ నీరసం వచ్చింది.

” ఏం పర్వాలేదులే. కనిపిస్తుంది, వెతుకుదాం ” – జేన్ కి అంత తొందరగా నిరాశ రాదు.

అన్నంత తేలిగ్గా అవలేదు. ఎన్ని చోట్ల తవ్వినా శామీడ్ దొరకనేలేదు. పాపాయి కిందకి దిగుతానంది, దాంతోబాటు అందరూ చతికిలబడ్డారు. పాపాయి హుషారు ఇంకా తారస్థాయిలోనే ఉంది. దాన్ని వదిలేసి ఏం ఆలోచించుకోవటానికీ వీలే కాలేదు. గుప్పెడు ఇసక తీసుకుని ఆంథియా మొహం మీదికి విసిరింది పాపాయి. తర్వాత తనూ కింద  పొర్లుతూ ఇసకలో మొహం దూర్చింది. కళ్ళలోకి ఇసక పోయి ఏడుపు లంకించుకుంది. కడగటానికి నీళ్ళు లేవు దగ్గర్లో ఎక్కడా. రాబర్ట్ కి అస్తమానమూ దాహం వేస్తుంటుంది. పంచదారపానకం తెచ్చుకుంటాడు సీసాలో – దాంతో పాపాయి క్ళ్ళు కడిగారు – అది గొల్లుమంది. ఆంథియా నోట్లో పోసుకు చూస్తే అందులో నిమ్మకాయరసం కూడా ఉంది – కళ్ళు మండటానికి. రాబర్ట్ ఒక నిమ్మకాయని తనే వస్తూ వస్తూ అందులో పిండాడు, ఈ గొడవ లో మర్చిపోయాడు !! మెత్తటి చేతిగుడ్డ పెట్టి కళ్ళు తుడిచినా పాపాయి రంకెలు ఆగలేదు. ఎంతో ఓర్పు గా ఉండే రాబర్ట్ కి అప్పుడిక దాన్ని పిచ్చ తిట్లు తిట్టబుద్ధేసింది.

” ఎవరైనా ఎత్తుకుపోతారుట – హు. ఎవ్వరికీ అక్కర్లేదు ఈ చెత్త మొహంది, అసలు మార్తాకే అక్కర్లేదు – అందుకే మనమీదికి తోలింది. ఇది ‘  అందరికీ ‘ కావాలనిపిస్తే బావుండు, అదే నా కోరిక. బతికిపోతాం అందరం ”

పాపాయి అప్పటికి శోకాలు ఆపేసింది. ఆంథియా ఉపాయం గా తన నాలుక చివరతో దాని కళ్ళు శుభ్రం చేసింది, అందుకని. ప్రేమ ఉంటే ఉపాయాలు తడుతుంటాయంతే.

 

అంతా ఒక్కసారి నిశ్శబ్దం గా ఐపోయింది. రాబర్ట్ కి తన మాటలు నచ్చలేదు. తక్కినవాళ్ళకీ అస్సలు నచ్చలేదు. తను అలా అని ఉండకూడదని ఒప్పుకుంటాడని చూస్తున్నారు.

ఆ నిశ్శబ్దం లోంచి చిన్న శబ్దం. అదొక నిట్టూర్పు. పిల్లలంతా కీలుబొమ్మల్లాగా ఒకేసారి తలలు తిప్పారు.

చూస్తే ఏముంది – ఇసక యక్షిణి – పక్కనే కూర్చుని ఉంది. దాని మొహం మీద నవ్వు లాంటిదేదో వికసించి ఉంది.

” గుడ్ మార్నింగ్. తేలిగ్గానే చేసేశా ఈసారి. పాపాయి ‘ అందరికీ ‘ కావాలి ”

” ఏమక్కర్లేదు ” – రాబర్ట్ చిరాకు పడ్డాడు. ఆ చిరాకు సగం తన మీదే . ” అందరికీ ఎందుకూ ఇది ? అయినా ఇక్కడెవరున్నారని ? ”

” కృతఘ్నత ! ” శామీడ్ నిరసనగా అంది. ” అదేం మంచి లక్షణం కాదు ”

” అయ్యో, అది కాదు. మాకు కృతఘ్నతేమీ లేదు. రాబర్ట్ అలా నిజం గా జరగాలనుకోలేదు. దయచేసి ఆ వరాన్ని వెనక్కి తీసుకుని ఇంకోటి ఇస్తావా ? ” – జేన్ బ్రతిమిలాడింది.

” కుదరదు. ఎంతమా- త్రం కుదరదు. అంతా మీ ఇష్టమేనేమిటీ ? అనే ముందర ఆలోచించుకోవాలి. వెనకటికో అబ్బాయి ఉండేవాడు. అల్లరి చేస్తే వాళ్ళ నాన్న తిట్టాడని ఏడ్చుకుంటూ  వచ్చి నా దగ్గర – ‘ నేను చస్తే బాగుండు ‘  అన్నాడు. అంతే. చచ్చిపోయాడు ”

” అయ్యయ్యో- ఘోరం ! ”

” సూర్యాస్తమయం వరకే గా. తర్వాత బతికి ఇంటికి పోయాడులే. అయినా చచ్చిపోవటమన్నా కూడా ఇంకో చోట మెలకువ రావటమేగా- ఏమిటో ” – శామీడ్ వేదాంతం.

పిల్లలకి కంగారు పుట్టింది. శామీడ్ ని భయం భయం గా చూస్తున్నారు. ఈ లోపు పాపాయిని శామీడ్ ఆకర్షించింది. ఒళ్ళంతా బొచ్చుందని – ” మియ్యవ్. మియ్యవ్ ” అని దాన్ని పట్టుకుంది.

శామీడ్ కెవ్వుమంది. పాపాయి చేతుల నిండా తడితడిగా పంచదార పానకం. శామీడ్ ” ఒద్దు.ఒద్దు. బాబోయ్ నా మీసం ” అని అరిచింది. శామీడ్ లకి  తడిస్తే పెద్ద పెద్ద జబ్బులు చేస్తాయని పిల్లలకి తెలుసు.

” ఏయ్ పాపాయ్ అది పిల్లి కాదు. వదులు. ”

వదిలించిన అర క్షణం లో  శామీడ్ ఇసకలోకి మాయమైంది.

 

అది మాయమైన చోటిని రాళ్ళతో గుర్తు పెట్టారు.

” ఇంటికి వెళదాం ఇంక . నాదే చాలా తప్పు- కాని లాభం లేదు గానీ  నష్టం కూడా లేదు ఇవాళ ” – రాబర్ట్ అన్నాడు ” రేపు చోటు గుర్తుంటుందిగా ”

తక్కినవాళ్ళు చాలా ఉదాత్తం గా ప్రవర్తించారు. రాబర్ట్ ని ఎవరూ ఏమీ అనలేదు. సిరిల్ పాపాయిని ఎత్తుకున్నాడు. దాని జోరు కాస్త తగ్గి మామూలైంది. వచ్చినదారినే వెనక్కి నడిచారు. ఆ దారి ఇంటి వైపుకి మలుపు తిరిగే చోట ఇంకొక పెద్ద రహదారి లోకి కలుస్తుంది. అక్కడ , పాపాయిని సిరిల్ వీపు మీంచి రాబర్ట్ వీపు మీదికి మార్చుకుందుకు ఆగారు. సరిగా అప్పుడే చక్కని గుర్రం బండి ఒకటి ఆ వైపుగా వచ్చింది. బండి తోలే అతను కూడా మంచి బట్టలు వేసుకున్నాడు. లోపల ఒకావిడ కూర్చుని ఉంది. తళతళా మెరిసే బట్టలు వేసుకుని మెడలో జిగేలుమనే నెక్లెస్ పెట్టుకుంది. ఒళ్ళో తెల్లటి బొచ్చుకుక్కపిల్ల. ఆవిడ పాపాయిని చూసి నవ్వింది. అదేమంత ఆశ్చర్యం కాదు – పాపాయి నిజం గానే కొత్తవాళ్ళకి ముద్దొస్తుంటుంది. పిల్లలు మర్యాదగా చేతులు ఊపి వెళ్ళిపోబోయారు. ఆవిడ బండి ఆపించి సిరిల్ ని దగ్గరికి పిలిచింది. పాపాయి ని చూసి మురిసిపోతూ ” ఎంత బావుంది ! నేను పెంచుకుంటానీ పాపని. వాళ్ళమ్మ ఒప్పుకుంటుందా ? ” అని అడిగింది.

” ఎంత మాత్రం ఒప్పుకోదు ” – ఆంథియా ఠకీమని అంది.

” కాని నేను పాపని గొప్ప భోగ భాగ్యాలలో పెంచుతాను కదా ? లేడీ చిటెండన్ ని నేను. నా ఫోటోలు పేపర్ లలో చూసే ఉంటారు – చాలాందగత్తెనని అంటారు…అదేం కాదు గానీ – ” అంటూనే చెంగుమని బండి దిగింది. ఆఖరికి ఆవిడ చెప్పులు కూడా మెరుస్తూనే ఉన్నాయి. ” ఒకసారి ఎత్తుకుంటానేం ” అని , ఆ పని అలవాటు లేనిదానిలాగా పాపాయిని అవకతవగ్గా ఎత్తుకుంది. దించకుండా అలాగే వెళ్ళి బండిలో ఎక్కేసి తలుపు మూసి ” పోనీయ్ ” అంది తోలే అతనితో. పాపాయి గొల్లుమంది. బొచ్చుకుక్క మొరగటం మొదలెట్టింది. బండి అతను తటపటాయించాడు.

” పోనీయమన్నానా ? ” – ఈసారి ఆవిడ కేక పెట్టింది. తప్పనిసరై పోనిచ్చాడు అతను. పాపాయి గొంతు చించుకుని ఏడుస్తోంది. దుమ్ము రెపుకుంటూ వెళ్ళే బండి వెనకే దాని అక్కలూ అన్నలూ పరిగెత్తారు. అదృష్టవశాత్తూ గుర్రాలు మరీ అందనంత వేగం గా వెళ్ళటం లేదు. పాపాయి ఏడ్చి ఏడ్చి వెక్కిళ్ళు పెట్టి మెల్లిగా ఆపేసింది. నిద్రపోయి ఉంటుందని పిల్లలకి అర్థమైంది. బండి వెళ్ళి ఒక పెంకుటింటి ముందు ఆగింది. అది పొడవాటి ప్రహరీ గోడని ఆనుకుని ఉంది. లోపలి భవనానికి ఇది కాపలా ఇల్లు కాబోలు.  ఆవిడ దిగింది. నిద్ర పోతున్న పాపాయిని చూసి – ” బంగారాన్ని లేపటమెందుకులే ” అని ఎత్తుకుని వెనకాల తొట్టిలో పడుకోబెట్టి  వెళ్ళింది.  ఆ ఇంట్లో ఆవిడ తో మాట్లాడేందుకని పిలిచింది.

బండివాడు వచ్చి పాపాయిని చూశాడు. ” ఎంత చక్కటి పాప ! నేనే పెంచుకుంటాను, ఆవిడకెందుకూ ? అసలావిడకి పిల్లలంటేనే గిట్టదాయె – ఇక్కడ ఈ పొదలో దాచేసి వాళ్ళ అన్నలూ అక్కలూ ఎత్తుకుపోయారని చెబుతాను, తర్వాతొచ్చి తీసుకుంటాను ”

బండి వెనక పొంచి దాక్కున్న పిల్లలు ఇబ్బందిగా ఒకరిమొహాలొకరు చూసుకున్నారు. ఆ లోపు పెంకుటింట్లోంచి ఆ ఇంటాయన వచ్చి పాపాయిని చూసి అద్భుతపడ్డాడు. అతను పెంచుకుంటాడట. బండి అతనూ ఇంటి అతనూ పాపాయికోసం పోట్లాడుకోవటం మొదలెట్టారు. దెబ్బలాట కి దిగారు.

సిరిల్ మెల్లిగా బండి తలుపు తెరిచి పాపాయిని ఎత్తుకుని ఇవతలికి వచ్చాడు.  పొదల్లోంచి నక్కి నక్కి నడుస్తూ అడ్డదారిని  పిల్లలు

బయటపడ్డారు –  వెనక్కి వెనక్కి చూసుకుంటూ. ఎట్టకేలకి బండి కదిలి వెళ్ళిపోయింది.

” ఆ. అర్థమైంది. పాపాయి ని అందరూ వాళ్ళకే కావాలనుకుంటారు – ఖర్మ. శామీడ్ మహిమ  ” -సిరిల్ కోపం గా పళ్ళుకొరుక్కున్నాడు. ” ఏదోకట్లే. ముందు దీన్ని ఇంటికి చేరిస్తే – ”

 

అడ్డదారి  పెద్ద దారిలోకి కలిసింది. పిల్లల కష్టాలు తీరలేదు. కట్టెల మోపు మోసుకెళుతున్న కుర్రాడొకడు పాపాయిని ఎత్తుకుంటానన్నాడు. ఆంథియా మళ్ళీ మోసపోదలచుకోలేదు. కుర్రాడు వీళ్ళ వెనకాలపడి వస్తున్నాడు. సిరిల్, రాబర్ట్ ఇద్దరూ కలిసి తంతామని బెదిరించాక  గాని వెళ్ళలేదు. ఇంకాస్త దూరం లో కూరలమ్ముకునే అమ్మాయి వెంటపడింది -” బంగారుకొండా – దామ్మా ” అని ముద్దుమాటలతో. అందరి చేతిగుడ్డలూ ముడేసి చెట్టుకి కట్టేస్తామనీ ఎలుగ్గొడ్లొచ్చి కళ్ళు పీకేస్తాయనీ హామీ ఇచ్చాక ఆ పిల్ల ఏడ్చుకుంటూ వెనక్కి పోయింది. ఇంక అక్కడినుంచీ – మనుషులు ఎదురవుతున్నారంటే చాలు, చెట్ల వెనకాల దాక్కోవటం సాగించారు. ఆ విధం గా – ఒక పాలమ్మే ఆయనా, రాళ్ళు కొట్టే ఆయనా  నూనె బండి తోలే ఆయనా – వీళ్ళ యొక్క అసౌకర్యపు ఆపేక్ష నుంచి పాపాయిని రక్షించుకున్నారు. ఇంక నాలుగడుగులేస్తే ఇల్లు చేరతామనగా – అప్పుడు జరిగింది అసలు దరిద్రం.

అక్కడ రెండు వాన్ లూ ఒక గుడారం – వాన్ లకి వేలాడే పేము కుర్చీలూ ఉయ్యాలలూ ఈకల కుంచెలూ. చిన్నపిల్లలు మట్టిలో ఆడుకుంటున్నారు. ఇద్దరు మగవాళ్ళు తీరిగ్గా చుట్ట లు కాలుస్తున్నారు. ఇద్దరు ఆడవాళ్ళు  రేకు డబ్బాలలో బట్టలుతుకుతున్నారు. అది జిప్సీ ల గుంపు. పిల్లలు తప్పించుకునే లోపే ఇంటిల్లిపాదీ పాపాయి చుట్టూ మూగేశారు.

ఇద్దరు ఆడవాళ్ళూ పాపాయిని ఎత్తుకుంటామని ప్రేమగా అడిగారు. ఆంథియా దాన్ని గట్టిగా పట్టుకునిలుచుంది.

ఈలోపు ఒక మగతను ముందుకి దూకాడు – ” అసలిది నా బిడ్డే. పుట్టగానే తప్పిపోయింది. ఎడం చెవి వెనకాల ఇంత పెద్ద మచ్చ ఉండాలి ..లేదా ? ఐతే ఇది ఆర్నెల్లప్పుడు తప్పిపోయిన ఇంకో బిడ్డ …హా హా ” అని దాన్ని లాగేసుకున్నాడు. ఇంకో అతను పాపాయి తన తప్పిపోయిన మేనకోడలని అన్నాడు. ఇద్దరూ వాదించుకుంటున్నారు. జిప్సీలకి పిల్లల్ని ఎత్తుకుపోతారనే పేరుంది. పిల్లలందరికీ గుండెలు గుభేలుమన్నాయి.

సిరిల్ నిబ్బరించుకుని అన్నాడు – ” చూడండి , ఏడుస్తోంది ! మీరు కొత్తవాళ్ళు కదా, అందుకని. మేము మీతోబాటే సూర్యాస్తమయం దాకా ఉంటాం, అప్పటికి మీకు పాప అలవాటవుతుంది. కావాలంటే తీసుకెడుదురుగాని , ఈలోపు మేం దాన్ని ఆడిస్తాం-తర్వాత వెళ్ళిపోతాం  ”

” మాకు పాప కావాల్సిందే. వదిలేది లేదు. ఆడిస్తారా , సరే. పారిపోవాలనుకుంటే మీ అంతు చూస్తా జాగ్రత్త ” – అతను తన కళ్ళూ మొహమూ రక్కిపెడుతూన్న పాపాయిని వదిలించుకుని సిరిల్ చేతికిచ్చాడు.

” సూర్యాస్తమయం ” – సిరిల్ తక్కినవాళ్ళతో గొణిగాడు. అతను అంత సమయస్ఫూర్తి తో వ్యవహరిస్తున్నందుకు అందరూ ఉప్పొంగిపోయారు. ఆకళ్ళేస్తున్నాయి. రాబర్ట్ మెల్లిగా అడిగాడు జిప్సీ అతన్ని – ఇంటికి వెళ్ళి భోజనం తీసుకురావచ్చా అని. అతని ఎత్తు తనకి తెలుసుననీ వెళ్ళి పోలీసులని వెంటబెట్టుకొస్తాడనీ ఒక్కడుగు కదలటానికి లేదనీ జిప్సీ అతను బిగ్గరగా హెచ్చరించాడు. వాళ్ళ భోజనమే వీళ్ళకీ పెడతామన్నారు.

” సొర్యాస్తమయానికి మామూలైపోతాడులే ” – జేన్  చిన్నగా అంది. ” వాళ్ళకి ఒళ్ళు తెలిసేసరికి కోపం వస్తుందేమో ? మనల్ని కొడతారేమో ? ” – ఆంథియా అనుమానం. ” లేదు. వాళ్ళేం చెడ్డవాళ్ళు కాదు, లేకపోతే మనకి భోజనం పెడతామంటారా ? ”

” వాళ్ళ తిండి – చీ. నేను తిననే తినను ” – రాబర్ట్.

కానీ ఆ భోజనం తయారయేసరికి ఒకరికన్నా ఇంకొకరికి ఆకలేసేసింది. ఆవురావురున తినేశారు. అదేదో వింత రుచితో, బావుంది కూడా. పాపాయికి ప్రత్యేకం గా రొట్టె ని పాలలో నానేసి తేనె వేసి పెట్టారు. అదీ ఇష్టం గా తినేసింది.

ఎంతకీ సూర్యాస్తమయం అవదు.

ఆలోపు పాపాయి జిప్సీ లకి అలవాటైంది. దానికొచ్చిన విద్యలన్నీ వాళ్ళదగ్గర ప్రదర్శించింది. వాళ్ళ పిల్లలతో ఆడుకుంది. జిప్సీ లంతా ఆనందం తో తలమునకలైపోయారు.

నీడలు పొడుగవుతున్నాయి. ఇంకా పొద్దుకుంకదు.

” ఇంక మీరు ఇళ్ళకి పొండి. పాపాయి మాకు అలవాటైందిగా, మేం చూసుకుంటాం లే ” అనటం మొదలెట్టారు జిప్సీలు. దాన్ని ఎత్తుకుని అవతలికి తీసుకుపోయారు- అది గగ్గోలు పెట్టింది. ఆంథియా వెళ్ళి తీసుకుంది.

ఇంకా సూర్యుడు కనిపిస్తూనే ఉన్నాడు.

దాన్ని పెంచటం ఎలాగో, ఎలా నీళ్ళుపోయాలో, ఏం తినిపించాలో వివరిస్తూ ఆంథియా కాలక్షేపం చేసింది.

సూర్యాస్తమయం అయింది. కాని పిల్లలకి కదలటానికి భయం. ఆంథియా తటపటాయిస్తూ వెళ్ళి జిప్సీ అతనికి పాపాయిని ఇవ్వబోయింది.

” వద్దులేమ్మా. నా బిడ్డ కాదనిపిస్తోంది ”

ఇంకో అతను – ” ఎండకి గీరెక్కిందో ఏమో. నాకెందుకీ బిడ్డ ”

ఒకామె – ” నాకు గంపెడు మంది ఉన్నారు- ఈ బిడ్డ దేనికీ ”

ఇంకొకామె మొహం లో మాత్రమే ఇంకా పాపాయి మీద ప్రేమ కనిపిస్తోంది. పిల్లలతోబాటు ఆమె కొంత దూరం నడిచింది – ” మాకందరికీ ఎందుకు ఈ బిడ్డని తీసుకోవాలనిపించిందో – ఏదో మాయ. మేమెవరమూ పిల్లల్ని ఎత్తుకుపోమమ్మా, ఆ మాటలు నమ్మకండి. ఒక్కసారి ముద్దుపెట్టుకోనా ? నా బిడ్డలెవరూ బతకలేదు ”

కన్నీళ్ళు తిరుగుతూన్న ఆమె  మొహాన్ని పాపాయి తదేకం గా చూసింది. ” పాపం. పాపం ” – బుజ్జి చేత్తో ఆమె చెంపని నిమిరింది. ముద్దుపెట్టుకోనిచ్చింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే తనూ ఆమెని ముద్దుపెట్టుకుంది. ఆమె ఏదో గొణుగుతూ , తన చూపుడు వేలితో పాపాయి తల మీదానుదుటి మీదా, గుండెల మీదా బుజాల మీదా పొట్ట మీదా రాసింది.

” తెలివి గా ఉంటుంది. ధైర్యం గా ఉంటుంది.  బలం గా ఉంటుంది. గుండె నిండా ప్రేమ ఉంటుంది. పెద్దయి ఇంకా మంచి బిడ్డలని కంటుంది . వెళ్ళొస్తానమ్మా . ” – దీవించి వెళ్ళిపోయింది.

” ఇదేమిటిదీ ? పొద్దుకుంకినా ఈవిడ బుర్ర సరవలేదే ? ” – రాబర్ట్ ఆశ్చర్యం.

” మర్యాదస్తురాలు ” – సిరిల్.

” మర్యాదేమిటీ , మంచావిడ ” – జేన్.

” వరాలూ మహిమలకన్నా గొప్పది ” – ఆంథియా.

ఇంటికి చేరారు. పొద్దుపోయింది. అలిసిపోయారు – అయితేనేం, పాపాయి క్షేమం.

” మనందరికీ కూడా పాపాయి కావాలనే అనిపించింది. కాకపోతే సూర్యాస్తమయం తర్వాత కూడా అనిపిస్తోంది ”

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s