బాబాయ్ – అబ్బాయ్ 2.0 – స్వాప్నిక్ చీమలమర్రి

“బాబాయ్ తినేసా, ఇంక చెప్పు”

 

“ఏంట్రా ఇంత త్వరగా వచ్చేసావు, సరిగ్గా తిన్నావా లేదా”

 

“అబ్బా, తిన్నా బాబాయ్, ఇంక చెప్పు నువ్వు. ఆ  కిడ్నాప్ ఏంటి, ఆ కథ కమామిషు ఏంటి.”

 

“సరే, ఎక్కడిదాకా వచ్చాం, నువ్వు రాత్రి సినిమా నుండి వస్తుంటే, రోడ్ మీద దెబ్బలతో ఒకడు పడున్నాడు, తీరాచూస్తే వాడు నీ ఫ్రెండ్. వెంటనే నీ కార్ ఎక్కించుకున్నావు, హాస్పిటల్ కి తీసుకువెళ్లే దారిలో వాడు నీకు గన్ చూపించి కిడ్నాప్ చేసాడు. అసలు వాడి గోల ఏంటో నీకిప్పుడు తెలియాలి.”

 

“అదే..”

 

“సరే, దీన్ని మనం ఎలా చూడచ్చు, కిడ్నాప్ అయిన నీకు ఏమనిపిస్తోంది అనేది మనకి చాలా ముఖ్యం. నువ్వు ఎలాంటి పరిస్థితులలో ఎలా మసలుకుంటావో, మనకి అంటే, రాసేవాడికి, తీసేవాడికి, క్షుణ్ణంగా తెలియాలి. దీన్ని పాత్రచిత్రీకరణ (characterisation) అంటారు.”

 

“అదేంటి, కిడ్నాప్ చేస్తే ఎవరైనా భయపడాల్సిందేగా, మళ్ళీ ఎలా మసలుకోవడం ఏంటి?”

 

“జనాలకి కావాల్సింది ఏంటి?”

 

“..”

 

“సరే, నువ్వు ఎందుకు కిడ్నాప్ అయ్యావో, నీకు తెలియయటం అవసరం, జనాలకి అవసరమా?”

 

“అదేంటి, నేను హీరో కదా, నా గురించి ఆలోచించాలిగా”

 

“అవునుకదా! హీరో కోసం జనం బాధపడితే/ ఆలోచిస్తేనే అది మంచి పాత్ర అవుతుంది. దీన్నే సహానుభూతి (Empathy) అంటారు. అది లేకపోతే పాత్రలు ఏమైపోయినా, ఎలా తయారైపోయినా, మనకి సంబంధం ఉండదు.”

 

“ ఓహో.. మరి ఇప్పుడు కథలో నేను కిడ్నాప్ అయ్యాను కదా. నా మీద జాలి కలగాలంటే?”

 

“నీ మీద జాలి కలగాలంటే నువ్వు ఎవరో, ఇప్పుడేంటో, ఇదివరకు ఏంటో, అన్నీ తెలియాలి కదా!”

 

“అవును బాబాయ్, నిజమే!”

 

“అది ఇంకాస్త వివరంగా చెప్పడానికి ప్రయత్నం చెయ్యాలన్నమాట.. నీకొక కోరిక (outer desire) మొదలవ్వాలి. నువ్వు తప్పించుకోవాలి అనేది ఇప్పుడు నీ మనసులో ఉన్న కోరిక. దానికీ, కథలోని నీ ప్రయాణానికి సంబంధం లేదు.”

“ఇంకొంచెం క్లియర్ గా చెప్పు బాబాయ్!”

 

“ఈ outer desire నీకు ఇప్పటి లక్ష్యం అంతే. ఇక్కడ జనాలకి నువ్వు మంచివాడివని చెప్పాలి, అనవసరంగా కిడ్నాప్ అయ్యావని చెప్పాలి, నువ్వు తప్పించుకోవాలి. అప్పుడే నీ మీద జాలి కలిగేది. అంతేనా”

 

“అంటే ఇక్కడ మన కథతో పాటు, నా పాత కథ నడవాలి, అంతేనా బాబాయ్?”

 

“అంతే! కానీ జనాలని ఇంతసేపు కూర్చోపెట్టడం అంటే మాటలు కాదు. డ్రామా అంటేనే విరోధం. ఒక ముఖ్యపాత్రకి గొప్ప విరోధి లేనప్పుడు కథలు ఒక చోటే ఆగిపోతాయి.”

 

“మరి

 

“ఒక కథ రాయటం అంటే, నువ్వే రెండు పక్కల చెస్ ఆడటం లాంటిది. ఈ పక్క నువ్వు వేసిన ప్రతి ఎత్తు, వేరేపక్క ఆడేప్పుడు నీకు కొత్తగా కనిపించాలి. ఆశ్చర్యంగా ఉండాలి.. ”

 

“భలే ఉంది బాబాయ్.. రెండు పక్కలా నేనే ఆడాలి, కానీ ఆట కొనసాగాలి.”

 

“హీరో అనేవాడు ఎంత బాగా ఎమోషన్స్ ని పలికించాడన్నది కాదు, ఎంత బాగా ఆ ఎమోషన్స్ ని దాచాడనేది ముఖ్యం. అప్పుడే మనం జనాలని మభ్యపెట్టి, ఇంకా ఏదో ఉందని చెప్పి కూర్చోపెట్టచ్చు.”

 

“అంటే ఎలా అంటావు?”

 

“ఇప్పుడు ఆ కిడ్నాప్ చేసినవాడు ఉన్నాడు, వాడు ఎందుకు కిడ్నాప్ చెయ్యవలసి వచ్చిందో ఒక బలమైన కారణం చెప్తే? వాడికి నిన్ను కిడ్నాప్ చెయ్యటం కన్నా వేరే అవకాశం లేదని చెప్తే?”

 

“అప్పుడు జనాలు వాడిమీద జాలి పడిపోతే మరి?”

 

“హహ, మరది జరగకుండా చూసుకోవాలంటే ఏం చెయ్యాలి?”

 

“సినిమా అంతా అయిపోయాక చెప్తే పోలేదు.. అంటే పోలీసులు వచ్చే సమయానికనమాట.”

 

“కరెక్ట్, అది మన వాళ్ళు చేసేదే, చేస్తున్నదే. అప్పటిదాకా విలన్ చేత నానా వెధవ వేషాలు వేయించి, చివరికి నాలుగు మంచి మాటలు చెప్పిస్తేనో, ఇంక మారేలాలేడని వాడిని ఏదోలాగ అంతం చేస్తేనో కానీ  జనాలకి తృప్తి ఉండదు. కథ ఒక స్థాయికి వెళ్ళదు.”

 

“ఆ..”

 

“విలన్ మీద ముందే జాలి కలిగిందనుకో, జనాలకి ఎవరితో Empathise అవ్వాలో తెలియక, గందరగోళంపడి సగం సినిమాలోనుంచి బయటికి వెళ్ళిపోతారు.”

 

“నిజమే.”

 

“అందుకని సహానుభూతి అనేది చాలా చర్చ చెయ్యవలసిన విషయం అనమాట.”

 

“సరే.”

 

“ఇప్పుడు ఎక్కడిదాకా వచ్చాము? ఆ.. ఇప్పుడు నీ పాత కథ అంతా తెలుసుకున్నాక, నీకు, అంటే హీరోకి నువ్వేమి తప్పులు చేసావో, ముందు ఏమి చెయ్యాలో స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ నీ గోల్ మారుతుందన్నమాట. తప్పించుకున్నాక ఏం చెయ్యాలో అర్థం అవుతుందన్నమాట. ఇక నువ్వు ఎలాగోలా తప్పించుకుని పారిపోతావు, నిన్ను కిడ్నాప్ చేసినవాడు వచ్చి ఆశ్చర్యపోతాడు. ఇక్కడిది ప్లాట్ పాయింట్ 2 (Plot  Point 2).”

 

“మరి మన హీరో విలన్ మీద ఎలా పగ తీర్చుకుంటాడనేది?”

 

“ఖచ్చితంగా తీర్చుకోవాల్సిన అవసరం ఉందా? ఇక్కడ ఉంటే చచ్చిపోతాడని  వేరే దేశం పారిపోవచ్చుగా..”

 

“పారిపోతే మరి కథ ఎలాగ?”

 

“కదా!  హీరో పారిపోకూడదని విలన్ కి కూడా ఉంటుందిగా, అందుకని ఎక్కడికి పారిపోకుండా చెయ్యాలంటే?”

 

“హీరోకి ఉన్న ఏదోక సెన్సిటివ్ పాయింట్ తో ఆడుకుంటే?”

 

“ఆ.. అదే చేస్తాడు, హీరోకి ఇంకా వేరే ఆలోచనలు రాకుండా, విలన్ని అంతం చెయ్యడమే ధ్యేయంగా మారే పాయింట్ని The Point of No Return అంటారు. అంటే హీరో ఇప్పటిదాకా ఆడిన ఆట కన్నా, ఒక పెద్ద రిస్క్ చెయ్యడానికి పూనుకుంటాడన్నమాట. ఇక్కడ నుంచి హీరో కోరిక, విలన్ కోరిక ఒకటే. ఒకరిని ఒకరు అంతం చేసుకోవడం. ఇది కరెక్ట్ గా స్క్రీన్ ప్లే కి మధ్య భాగంలో వస్తుంది.”

 

“ఇక్కడ ఇంటర్వెల్.”

 

“అవును. కాస్త బజారెళ్ళే పనుంది. వచ్చాక మాట్లాడుకుందాంరా “

 

 

 

1 Comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s