నెయ్యపు కినుక [కథ] – మైథిలి అబ్బరాజు

రాత్రి రెండవ జాము. మసక వెన్నెలలు ముదురుతున్నాయి. అంతవరకూ కారు నలుపు గా  అనిపించిన సముద్రం అంచుల్లో తెల్లబడుతూ ఉంది. ఆ మీదినుంచి రివ్వుమని  గాలి . గుమ్మం దాటకుండా అక్కడక్కడే తచ్చాడుతోంది. పిల్లల ధోరణులు నచ్చని వృద్ధురాలి  లాగా పంచ లో నిలబడి గొణుక్కుంటోంది. పసుపు పచ్చ పట్టు గుడారపు తెర రెపా రెపా కొట్టుకుంటోంది.

లోపల  వాతావరణం  చిత్తరువు లాగ స్తంభించి ఉంది. అక్కడ ఒక విశాలపు శయ్య. కాసింత దూరాన చిన్నది ఒకటి. రెండింటి పైనా ఎవరూ – నిద్రైతే పోవటం లేదు. తలపులు  అలలంత ఎత్తున లేచి పడుతూ.

” అమ్మా ” – అవతలి నుంచి ఎవరో.

ఆవిడ లేచి వెళ్ళింది.

” సరమా దేవి పంపారమ్మా. ఇప్పటికి గాని పువ్వులు విడలేదట , ఆలస్యమైనందుకు మన్నించమని విన్నవించుకున్నారు ”

 

రెండు చేతులా  లోపలికి చేరాయి – అచ్చ బంగారపు పళ్ళెరం లో ఒత్తొత్తుగా నల్ల కలువలు. స్ఫటికం తో మలచిన దానిలో అంచు దాకా ఎర్ర కలువలు. పువ్వులే  కదా, విచ్చుకున్నాయి . తియ్య తియ్యగా పరిమళిస్తూ కూడా.

” ఏదీ, ఇలా తీసుకురా ”

ఆవిడకళ్ళెత్తనేలేదు. ఆయన అడిగే చెంగలువలను  కాక , కావాలనే , ఇందీవరాల పళ్ళెం ఆ పక్కన  పెట్టబోయింది. ఆయన చేత్తో అందుకోబోయినాడు. అతి జాగ్రత్త గా, వేళ్ళు తగలకుండా , ఇవతలికి వచ్చేసి తన సెజ్జ పైన తాను.

ఇటువంటి రాత్రి ఎన్నడైనా గడిచిందా ? ఎంత పోట్లాడుకున్నా  పలకరించుకోని ఒక్క గడియ ? అసలెన్నెన్ని మాటలు తమ ఇద్దరి మధ్యనా ! అడవి లో – మెల్ల మెల్లని గాలుల మధ్య , ఒకరికి కునుకు పట్టబోతుంటే మరొకరు లేపి ముచ్చట్లు మొదలెట్టేవారు. చూస్తూ చూస్తూండగానే తెల్లారిపోతుండేది. ఇంకా చెప్పుకోవలసినవి మిగిలిపోతూనే ఉండేవి. పగటివేళల కొంత భాగం ఎవరి విధులలో వాళ్ళుండాలి – ఆ కరువు తీరవద్దా ? పెళ్ళయేదాకా  కొన్నేళ్ళు వేర్వేరు చోట్ల ఉన్నారు కాదా – ఆ వెలితి పూడవద్దా ? ఎవరికి వారే నేర్చిన చదువూ విన్న గాథలూ – కలిపి ఒక్కటి చేసుకోవద్దా ?

ఈనాటికి ఇలాగ.

చెక్కిలి పైన మెత్తగా ఏదో తగిలింది. ” ఆ – అంత సాహసమే ? ” ఊహూ. ఆయన చేయి కాదు – నీలోత్పలం . చూపుకీ స్పర్శ కీ రెంటికీ పెద్ద భేదం లేదు.

తెరచుకున్న ఎర్ర కలువ కళ్ళను చూసి బెదిరాడు .

” ఏం లేదు. మంచినీళ్ళు ఎక్కడా అనీ – ”

లేచి తెచ్చిపెట్టింది. తిరిగి ముకుళించిన నయనాల చివరల  నుంచి ధారలు గా కన్నీళ్ళు. అభిమానపడి అటువైపు తిరిగిపోయింది.

 

* * * * *

 

అసలాయన తనంత తానై  వనం లో తన దగ్గరికి రానప్పుడే అనుమానం తట్టింది. బంటు తో కబురు పెట్టాడు – ఇన్నిరోజుల వివరాలూ చెప్పిరమ్మని. ఎవరికి కావాలవన్నీ ? పండితుడు కదా ఆ బంటు.  ఆవిడ అనాసక్తి గమనించి చెబుతూన్నది ఆపేసి-  అమ్మా, ఏమిటి సెలవన్నాడు .

ఏమిటా ? అడగాలా ? చెప్పాలి కాబోలు.

” ప్రభువును చూడాలనుకుంటున్నాను ”

ఆ వెనకే కొత్త రాజు గారు వచ్చాడు.చీర ధూళి దులుపుకొని జుట్టు దూముడి వేసుకొని  ఉన్నది ఉన్నట్లుగా బయల్దేరబోయింది. కాదట. స్నానం, అలంకారం, ఆభరణాలు – ఎవరికి పడతాయట ? తనకా ఆయనకా ? ఒక్క నవ్వుతో తోసేయబోయింది.

అంతటి రాజుగారూ జడిసి ఉన్నాడెందుకనో – ” నా మాట వినమ్మా. కోపాలొస్తాయేమో , చిత్రమైనవాడాయన ”

అవును. మహా చిత్రమైన మనిషే. కొత్తా ఆ సంగతి…కాని కోపమెందుకని అసలు ?

నగలన్నీ విడిచిపెట్టి ఎన్ని నెలలో అయిపోయాయి.  ఇదివరకు పెట్టుకుని ఉండిన చోట్ల  మెత్తని ఒడలు కాయకాసిన గుర్తులబట్టి – ఒక్కొక్క నగా తాల్చింది. చీరమట్టుకు మార్చలేదు. నిలువెత్తు రత్నదీపం పల్లకిలో ఒదిగి కూర్చుంది.

చేరింది.

పెద్ద కోలాహలం. ఆ మధ్యలోంచి ఆయన గొంతు. ఉరుముతూన్న మబ్బులాగ.

”  అందరినీ ఉండనివ్వండి. అందరికీ ఆవిడను చూడాలనే ఉంటుంది ”

దిగింది.

ఆయనకి ఉన్నట్లే లేదు – చూసుకోవాలని. కళ్ళెత్తడే ???

” పౌరుష ధర్మం గా చేయవలసినది చేశాను , నీకోసమని అనుకోకు. నన్ను చూడాలని ఉందన్నావని రమ్మన్నాను. చూశావు గా- ఇక నీ ఇష్టం. నీ దారి నీదీ నా దారి నాదీ. నీకు స్వాతంత్ర్యం ఇస్తున్నానిదిగో – నీ ఇష్టం వచ్చిన చోటికి, ఇష్టం వచ్చినవారితో – ” మరిక వినబడలేదు. రెండుచెవులనిండా మహాసముద్రాలు.  పక్కని ఆ సముద్రం లో తరంగాలు ఆగినాయి. అతి ఘోరమైన నిశ్శబ్దం.

” ఇంకొక మాట చెప్పాలి నీకు. అది బంగారపుజింక కాదు. రాక్షసుడు. లక్ష్మణుడు నిజం చెప్పాడు. నీ సంగతి మా కన్నా ఆ ఇద్దరికే బాగా తెలుసల్లే ఉంది. నా చేత అక్కడ చచ్చిన దొకడు, ఇక్కడ చచ్చినదొకడు ”

అన్నాళ్ళనుంచీకడుపులో పెట్టుకుకూర్చున్నాడు కాబోలు.  మాటల మధ్యలోంచి అననివీ వినబడినాయి.

అందుకా ? లక్ష్మణుడిని అంతమాట అన్నందుకా ఆగ్రహం ?పోనీ –  ఇన్నాళ్ళైపోయిందే, బెంగ కూడా పడనే లేదా ? సమాధానం తట్టింది వెంటనే – అంతా ఇంతటి బెంగా అది ?  అందుకు కూడా. యుద్ధం చేయాల్సి వచ్చినందుకూ తమ్ముడిని ఇంచుమించు గా పోగొట్టుకున్నందుకూ నమ్మి శరణన్నవారిని అంతమందిని చంపుకున్నందుకు – అందుకు. తానే కోరకపోతే ఏ ఒకటీ జరగదుగా.

అవును, జరగదు.  పాలకడలిలో పాదాలు ఒత్తించుకుంటూ కడుపులో చల్లకదలకుండా అక్కడే కూర్చోకపోయినాడా , జన్మెందుకు ఎత్తినట్లు ?  అంతేలే. ప్రవృత్తి.  స్థితి ఆయన లక్షణమది. క్రియాశక్తి తాను కద.

ఆహా, మర్త్య  లక్షణాలు !!  మొదటిసారిగా పూర్తి స్థాయిలో దిగివచ్చినవాడు కనుక, లోకం తో సంబంధం ఇదివరలో సరాసరి లేనివాడు కనుక – అనుభవపు లేమితో అక్కరకు మించి ఎక్కువే అవలంబిస్తున్నట్లుంది.అంతొద్దయ్యా స్వామీ అని చెప్పేందుకు దేవతలు దిగిరావలసి వచ్చెను- అంతా అయినాక.

తనకేమి – ప్రకృతి. తాను కానిది లేదు. జన్మ ఎత్తినదే లేదు. శిశువై కొంత కాలం, ఇలాగ తరుణి గా మరి ఒకింత – ఆకృతి పూని ఉన్నది అంతే.

ఆ దశకంఠుడు తక్కువవాడు కాదు- రజస్తమో గుణాల విజృంభణకు చిట్టచివరి  పరిమితి ఎంతో అంతవరకూ ఎదిగినవాడు. . మహాతపస్వి- తనను ప్రాణాలుపెట్టి పిలిచాడు. రావలసి వచ్చింది , తప్పదు. మూడు గుణాలకూ తానే అధినేత్రి – వచ్చి , సత్త్వగుణాన్ని వాడిలో పెంచుదామనే ప్రయత్నించింది. వాడి ప్రారబ్దమది కాదాయె –  వాడు అలాగే ఉంటే అందరికీ  చేటాయె…

అంత మాటనకపోతే లక్ష్మణుడు వెళ్ళడు, తానిక్కడికింత దూరం రాదు .  ఊరక ఒకరి జోలికి పోని సాత్వికుడు –  ఆయన అసలే రాడు.

ఎంతకాదన్నా – ఇప్పుడున్నది మానవోపాధి .క్రోధం రాకపోలేదు. అంతకన్నా , విడలేనితనపు దుఃఖం ఎక్కువగా. ఇద్దరూ ఒకటే అయిన పెద్దవెలుగు నుంచి విడివడి కొత్తకొత్తగా కలుసుకుంటూన్న  ఖేలలో – ఆ  ఆనందం అలవాటయిపోయి. అఖ్కర్లేదులే , వెళ్ళిపోదాం ఇప్పటికి.. తర్వాతెప్పటికో రాకపోతాడా , వెంబడి …

కట్టెలు పేర్చమన్నది లక్ష్మణుడినే.   – తన అప్పటి దుడుకుమాట ఎప్పుడో గాలితోబాటు జీర్ణమైపోయి ఉంటుందని తెలుసును. ఆక్రోశశేషాన్ని ఇప్పటిదాకా మోసుకుంటూ  ఉంటాడా ఆదిశేషుడు ?   అన్నగారి అనుజ్ఞ అడగకనే ఆ పని చేసిపెట్టాడు. భూమిలోపలికే వచ్చినదారిని వెళ్ళచ్చు …కాని , పోనీలే పాపమని – బయటికి రాగల వీలు  ఉంటే ఉంటుంది లెమ్మని. కాదూ – శ్వేత ద్వీపానికి  ? ఒక్కతే అక్కడ చేసేది లేదు…

నేరుగా మణిద్వీపానికే.

ఆగలేక అనేసింది వెర్రి మానవుడిని – ” నన్ను వదిలితే రాజ్యం ఎలా గ్రహిస్తావు – రెండిందాలా చెడుతున్నావే ” అని. చలిస్తేనా !!

ఇంకోమాటా చెప్పింది – “ మనిద్దరికీ కలయికా లేదు విడిపోవటమూ లేదు. కలిసి కనిపించటం లోకాలకు ఒకక్షేమం ‘’

తెలిస్తేనా !!!

ఏమీ ఎరగనట్లు , జరగనట్లు – అగ్నిదేవుడి వెంట వస్తూన్న తనను ఇంత మొహం చేసుకు చూసి కోదండం అందిస్తాడా – అప్పుడొచ్చింది పూర్తి ఆగ్రహం- మరింక శమించకుండా.

 

*        *     *      *   *

 

సీత ఎక్కి దిగిన చితిలో… కట్టెలు చల్లబడి తునిగిపోతున్నాయి. సీతారాముల ఏకాంతానికి భంగం రాకుండా వానరులు అక్కడా అక్కడా గుమిగూడి గుసగుసగా ఏవో చెప్పుకుంటున్నారు .  ఉబుసుపోక తన ప్రేయసిని ఉడికించి ఉందొక చక్రవాకం –   ఒంటరిగా కూర్చుని కుములుతూ కూస్తోంది. దూర దూరాల లో – రాక్షసాంతఃపురం నుంచి – ఎవరెవరో గానం చేస్తున్నారు, ఇంకెవరెవరో పెద్దపెట్టున ఏడుస్తున్నారు.

మర్యాదా పురుషోత్తముడికి మనసంతా కల్లోలం.

ఏమిటో – ఆవిడ ని చూస్తూనే అంత కోపం వచ్చేసింది. రాదా మరి ? తప్పిపోయిన పిల్ల కోసం వెతికీ వెతికీ నిరాశపడి నిస్సత్తువ వచ్చాక ఆ పిల్ల కంటబడితే నోరు చేసుకోవాలనీ నాలుగు తగిలించాలనీ అనిపించదేమిటి ? అమ్మగారి చెలికత్తె  బిందురేఖ కూతురు మహా తులిపిది. అది తప్పిపోయినప్పుడు చూశాడుగా , చిన్నప్పుడు ?

ఆ పిచ్చి కోరిక కోరకపోతే ఇన్నాళ్ళు ఎడబాసి ఉందురా ? ఇంత రచ్చ తప్పి ఉండదా !  ఎంత శోకం, ఎన్ని పాట్లు, ఎన్ని అగచాట్లు, ఎంత ప్రయత్నం !! చెట్టు చాటునుంచి బాణం వేయవలసి కూడా వచ్చెను…రావణుడిని చంపటమొక ఘనవిజయమని అనిపించనేలేదు- తప్పనిసరయే గాని. అసలతని మొహం చూస్తే ఏదో తెలిసినవాడికిమల్లేనే ఉందే ? ఎప్పుడు తెలుసు – అయోధ్య కీ లంక కీ అంత దూరముంటే ?

మధ్యాహ్నం నుంచీ మనసు చేదెక్కుతూనే  ఉంది- ఆ రణ బీభత్సం మధ్యన. దీనస్థితిలో వస్తే ఎక్కడ జాలి కలుగుతుందోననీ ఆవిడ అలా బోసిగా వస్తే తనకు పరువు తక్కువ నీ –  అలంకరించి తీసుకు రమ్మన్నాడు. ఆవిడ నగలే , తన తండ్రి పెట్టి పంపినవే – ఋష్యమూకం మీద జారవదిలినవే. వాటిలోవే – ఇవి వదిన గారి అందెలని లక్ష్మణుడు గుర్తు పట్టినవి. పాపం ఆ నీచమైన మాటకెంత లోజెడి ఉన్నాడో కద, తక్కిన నగలేవీ తనకి తెలియవు పొమ్మనేటంత. ఆవిడ అడ్డబాసా పాపిట చేరూ చెవి దిద్దులూ ఎందుకు తెలియవు లక్ష్మణుడికి -ఎంత ఆపేక్ష గా ఉండేవాళ్ళిద్దరూ !!! అనే మాటా అనగూడని మాటా తెలియనిది ఆవిడకేనా, తానూ అనగలడింకొక వంద రెట్లు.

వచ్చిన కోపం కడివెడు, తెచ్చుకున్నదింకొక గంపెడు.
కాని – ఆ అగ్ని లోకే తనకీ దూకాలనిపించలేదూ ? ఒకవేళ ఆవిడ అదే పోత పోతే , ఎవరూ చూడకుండా ఏ అర్ధరాత్రో తానూ అదేపని చేద్దామని అనుకోలేదూ ?

అసలంత పని చేస్తుందనుకోలేదు. ఏమాటా పడనట్లే , ఠీవి గా – స్వాధీన వల్లభ లాగా ఎక్కిందా చితిని.

అయినా – ఆవిడ మామూలు రాచకూతురా ? అప్పుడెప్పుడో అయోధ్యలో –  వచ్చీ రాని వయస్సులో ఆటలలో కోపమొచ్చి ఆమె పైన చేయెత్తబోయినాడు . అరుంధతీ దేవి ఆ దారిన వెళుతూ వచ్చి అంది కదా – ” పసిస్వామీ, తెలుసుకో – నీ  కోసం వచ్చిందీ సంపద.  ఆవిడకి నువ్వు ఇచ్చుకోగలవాడివి మటుకే. పెట్టగలవాడివి కావు. గుర్తుపెట్టుకొ ”మ్మని. అర్థమయీ కాని ఉపదేశం. అసలెప్పుడు మాత్రం ఆవిడేమిటో ఇదమిత్థంగా తెలుసా అని ?

అంతా ఒక్కసారిగా ” దేవతలు దేవతల ” న్నారు. దివ్యశరీరులు చాలా మంది ప్రత్యక్షమైనారు. తానట- విష్ణువట. ధర్మం నిలబెట్టేందుకు వచ్చాడట. లోకధర్మాలు తమ ఇద్దరికీ వర్తించవట. అవునా ? ఏదో తెరపిమరపులుగా ఉంది అంతా – అంతే కాబోలు.

లోలోపల ఆశపడుతున్నట్లే –  వెనక్కొచ్చేసిందా అనలమాలిక. అగ్నిదేవుడేదో చెబుతున్నాడు –  మనస్సుకెక్కదు . ఆమె- ఆమె మాత్రమే …తను నరుడు, ఆమె నారి – ధనుస్సు చేతికిచ్చాడు.  పక్కకి పక్కకి ముడుచుకుంటూ – మొక్కుబడిగా తీసుకుంది.

ఆ బిగువు ఎప్పటికి వదిలేను ?

 

*  *  *  * *

 

అసలే లేఎరుపు వన్నెది. నిప్పుల్లో దూకి వచ్చి జ్వాలాముఖిలా ఉంది.

కాగిన జున్నుపాలు తనకిష్టమని తెచ్చి మొత్తం తనచేతే తాగించేది . ఇప్పుడు తనే ఆ పాలకి మల్లే ఉంది- చల్లారదు, చల్లార్చుకు తాగేందుకు ఎడమీయదు.

ఇంక ఉండబట్టలేడు.

” ఈ మాత్రానికేనా అగ్నిదేవుడు నిన్ను నాకు భద్రంగా.తెచ్చి ఇచ్చినది ? “  –  గబగబా అనేశాడు.

సంధ్య లాగ ధధగమంటూ ప్రణయపు గడపమీదే ఆగకపోతే –  కొంచెం కదలకూడదా….ఈ వైపుకి , ముగ్ధయామిని గా ఒరగకూడదా … అనేందుకు మానుషం సరిపోలేదు.

” చెడి పుట్టినింటికేమి వెళతానని ఆ తెన్నును ఎంచుకొంటే మీరూ మీరూ కూడబలుక్కుని నన్ను చావకుండా ఆపారు  కదా. అవమానాగ్ని లో వేగటమే నాకు తగిన శిక్షనే కదా  – ? ” – లజ్జతో ఆమెకి దుఃఖం వచ్చింది. ఆపుకొంటూ తలదించుకుంటే ఆయన ధైర్యం చేసి చిబుకం పట్టుకున్నాడు.

ఎత్తిన ముఖం లో ఆ రెండు నేత్రాలూ వర్షించే సూర్యచంద్రులకి లాగా వెలుగుతున్నాయి. ముక్కెర నుంచి వెయ్యి తారకల కాంతులు.

ఆ క్షణాన ఆయన కామేశ్వరుడైనాడు. మనిషిని అని మరచాడు.

” అగ్ని లో దూకితే నువ్వు మరణిస్తావా ? ఏదీ, నా మొహం చూసి చెప్పు. ఆరిపోతానని భయపడ్డాడే మరి ?  మన ఆంజనేయుడు లంక ని తగలబెడుతూంటే అతని తోకకి నిప్పు అంటకుండా ఆపినదెవరు ? నేనూ చెప్పక నువ్వూ చెప్పక అగ్నికి ఆ ఆజ్ఞ ఇచ్చినదెవరో ? ”

ఎంత అణచినా ఆగని మందస్మితప్రభ  తో  ఆ ఆశ్వయుజ శుద్ధ దశమి  ప్రకాశించింది.

ఆ కాస్త సందు దొరకగానే ఆయన ఆవిడ చేతులు పట్టుకున్నాడు క్షమాపణగా.

సరే- అగ్ని లోకి దూకినదానికి ఆ మాటలు సరిపోయాయి, మరి అంతకు ముందరివాటికి ?

ఆట. ఇదంతా. ఆ దెబ్బ అరటిపండు.

[ కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం యుద్ధకాండ ఉపసంహరణ ఖండం లోని పద్యాల ఆధారం గా. నా మనస్సులోపలి చిరకాల శల్యం నశిస్తూ ఉన్న చిహ్నంగా.

‘ నెయ్యపు కినుక ‘ నంది తిమ్మన గారి ‘ పారిజాతాపహరణం లో ” నను భవదీయదాసుని ” అని కృష్ణుడు సత్యభామను బ్రతిమాలుకునే సందర్భం లోది. ఆ పదబంధం మీద నాకు చాలా మక్కువ. ఆ శీర్షిక తో కథ రాయాలని కోరిక ఎప్పటి నుంచో.

అది ఇలా ఈ పరం గా తీరటం – ఆశ్చర్యం ]

10 Comments

 1. “మనస్సులోపలి చిరకాల శల్యం నశిస్తున్న చిహ్నంగా” ఆయన వైపునుంచి రాయడం కనిపించినప్పట్నుంచి పరవశమే. ఇక ఈ మాట మదిని ఆనందంలో ముంచెత్తింది.
  ఆవిడ మాటల గురించి చెప్పేదేముంది. కానీ ఈసారి చాలా క్లిష్టమైన అనుసంధానం చేసినట్లున్నారు, మాకు అరటిపండులానే ఇచ్చారు 😊
  మిమ్మల్ని రాయమని ఇబ్బంది పెట్టనిక, నాకు కిటుకు తెలిసింది. కనీసం పది రోజుల్నుంచి రోజూ అనుకుంటున్నా……… this is ecstasy….

  Like

 2. నెయ్యపు కినుక రాయడం మీ చిరకాల వాంఛ! నాకెంతో ఇష్టమయిన సీతారాముల గురించి చిరకాలంగా వినాలనుకుంటున్న ఈ మాటలు ఇంత అందంగా, ఒప్పుదలగా, హుందాగా మీరు రాయగా చదవడం నా భాగ్యం, నాకు పరవశం. ధన్యవాదాలు. ఆమె ఏమయినా తక్కువదా ఏంటి!? ఆ కాడికి ఆయనమాత్రం సామాన్యుడా? శ్రీమన్నారాయణుడే కదా! అందమైన కధకు అభినందనలు.

  Like

 3. కానకేగి ఆజ్న మీరక మాయాకార మునికి చిక్కి

  అనే త్యాగరాజకీర్తన గుర్తుకు వచ్చింది.

  చాలా అందంగా ఉంది నెయ్యపుకినుక.

  ఆసీతారాముని అనుగ్రహం కలుగుగాక.

  Like

  1. అవును మాడం, త్యాగయ్య గారూ అమ్మవారినే ముందు పెట్టారు. ధన్యవాదాలు

   Like

 4. అనురాగ క్రోధం! మీకు మీరే సాటిఇలాంటి భావ ధార కి! ఎప్పటిలా… మీపై అవ్యాజమైన ప్రేమ నాకు ప్రతి కథా చదివిన ప్రతిసారీ! వజ్రం లా మెరుస్తూ నే, హృదయాన్ని కోసెలా రాయటం..దయలేదెం!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s