‘ చుక్కలు ‘ [స్కెచ్ ] – స్వాప్నిక్ చీమలమర్రి

“పొద్దున్న ఏ రంగు చొక్కా వేసుకున్నావో సాయంత్రానికి మర్చిపోతావ్, ఉబర్ పిలిచి ఓలా క్యాబ్ ఎక్కేస్తావ్, పెట్టె సద్దేటప్పుడు షర్టులు పెట్టి ప్యాంట్లు మర్చిపోతావ్. ఇంత అయోమయంగా  పడి  ఏడిస్తే రేపొద్దున్న ఎలారా!” మా అమ్మమ్మ, ఈ సుప్రభాతంతోనే గత పదేళ్లుగా నన్ను నిద్రలేపుతుంది. చెప్పి చెప్పి విసిగిపోయి, నోరు నొప్పొచ్చి, నాచేతే సెల్ల్ఫోన్లో రికార్డు చెయ్యించి, ఈమధ్యన  వాట్సాప్ చేస్తుంటుంది. “నేను మారతాను అనుకోవడం నీ పిచ్చితనం అమ్మమ్మా.” అని పదేళ్లుగా చెప్తూనే ఉన్నా అలుపెరగదు.

 

మా పక్కింటి అంకుల్ భుజంగరావు వాళ్ళ నాన్న ఏ ముహూర్తాన ఆ పేరు పెట్టాడో కానీ, ఆయన భుజాలు ఎప్పుడూ ఖాళీగా ఉండటం చూడలేదు. ఒకసారి లాప్టాప్ బ్యాగ్ ఉంటే, ఒకసారి గ్యాస్ సిలిండర్. ఒకసారి జిమ్ లో బార్బెల్ ఉంటే, ఇంకోసారి భుజం మీద  నాగలి (అయన మా కాలనీ నాటకాల్లో బలరాముడు పాత్ర ధరించినప్పుడు) ఉంటుంది. ఇవేవి లేకపోతే, గంపెడు బాధ్యతల్ని, బాధల్ని, కావడిలో మోస్తుంటాడు. ఒకసారి Atlas Shrugged పుస్తకం పట్టుకుని అయనకి కనిపిస్తే ఆ కవర్ పేజీ చూసి ఆయనికి ఫిట్స్ వచ్చినంత పని అయ్యింది పాపం. ఈ మధ్యనే ఆయనికి కొత్తగా కొడుకు పుట్టాడు, ఇప్పుడు కాస్త పాతబడ్డాడు ( 8 నెలలు క్రితం సరకు) కానీ, నా దగ్గర ఇంకా కొత్త నటిస్తూనే ఉంటాడు. వెధవ. వీడు చూడటానికి, అదే మొయ్యటానికి, పెద్ద బరువుగా అనిపించకపోయినా, కృష్ణుణ్ణి తూచేయ్యగలడు. ఉన్నవాటికి తోడు అంకుల్ భుజాలమీద వీడి భారం పడేసరికి, పాపం కళ్ళు లోతుకి పోయి, మూడు అంగుళాలు ఎత్తు తగ్గాడు.

 

ఇక తులసాకు గాడి విషయానికి వస్తే… సూపర్ మాన్ కి ఉన్న, enhanced hearing – వీడి గురించి నాలుగు గోడల అవతల మాట్లాడిన వీడికి సునాయాసంగా వినపడిపోతుంది, ఐరన్ మాన్ కి ఉన్న super charm – కొత్త మనుషులని యిట్టె చార్మ్ చేసి బిస్కెట్లు కొనిపించేసుకోగలడు, బాట్ మాన్ కి ఉన్న ఇంటలిజెన్స్ – సొంతంగా మాఫియా నడపగగలడు. నాకున్న బలమైన అనుమానం ఏంటంటే, వాడికి మాటలు వచ్చి కూడా ఇంకా attention కోసం మాట్లాడట్లేదని. ఒక సారి ఇదే ప్రశ్న వాడిని అడిగితే “అవునన్నాడు.” అదే జనానికి చెప్తే “పసి పిల్లడు ఎక్కడైనా మాట్లాడతాడా.” అని నాకు పిచ్చన్నారు. జీవితంలో పిచ్చిలేదని నిరూపించుకోవడం కన్నా కష్టమైన పని లేదు. నన్ను పాత సరకు గాడు అక్కడే కొట్టాడు. (వీడి మానిప్యులేషన్ని గమనించగలరు). అది ఎక్కడివరకు వెళ్లిందంటే, మా అమ్మమ్మ నాకు లేని పిచ్చి తగ్గాలని ఉపవాసాలు కూడా మొదలుపెట్టింది. నేను సతమతమవుతున్నపుడు, వాడు చూసిన చూపు నాకు ఇంకా గుర్తుంది. (దొంగ వెధవ – సారీ.)

 

ఆ రోజు అంకుల్ ది ఆఫీస్ అంతటినీ భుజాలమీద మీద మోసే డ్యూటీ. ఇవంకా రాకను పురస్కరించుకుని వాళ్ళ బాస్ పొద్దున్నే బ్రహ్మి ముహూర్తంలో ఆఫీస్లో అడుగు పెట్టాలని చెప్పి ఆర్డర్ విసిరాడు. అంకుల్  పెట్టె సద్దుకుని ఐదింటికల్లా ఆంటీ కట్టిన చద్దిడ్లి మూట భుజానేసుకుని ఆఫీస్ కి బయల్దేరాడు.అఫీస్ వెళ్ళగానే ఆ మూట దించేసి, పక్కన పడున్న పనిని భుజాన వేసుకున్నాడు. బాస్ పనిని పట్టించుకోకుండా, టైంకి అంకుల్ తెచ్చుకున్న ఇడ్లీ లాగించేసి, చట్నీకి వంక పెట్టి, టీవీ9 కి ట్యూన్ అయ్యి, ఇవాంకా ట్రంప్ విశేషాలని తిలకించడం మొదలుపెట్టాడు. “ఆ అమ్మాయిని చూడవయ్యా, తండ్రికి తగ్గ కూతురు. అసలు ఏం తేజస్సు! ఏం తేజస్సు!!”అంటున్నాడు బాస్.

 

నేను తీరిగ్గా పదింటికి లేచేసరికి, పేపర్లోనూ, బతుకు జట్కాబండి ప్రోగ్రాములోనూ చెప్పేట్టుగా- (పక్కింట్లో )యుద్ధ వాతావరణం నెలకొంది. అసలేం జరుగుతోందో తెలియటానికి ఒక గంట పట్టింది. సంగతి ఏంటంటే, పాత సరకు గాడికి పోలియో చుక్కలు అర్జెంటుగా వేయ్యించాలట. అయోమయం అంకుల్ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. ఇంటికి రమ్మంటే ఏవో వంకలు చెప్తున్నాడు.

 

“ఇంత అడ్డదిడ్డంగా ఎలా ఉంటావ్? ఆ మాత్రం గుర్తులేదా. ఆ హాస్పిటల్ ఎక్కడో కూడా నాకు తెలీదు. ఇప్పుడేం చెయ్యాలి. పైగా ఇంట్లో చుట్టాలు.”

 

“ట్రాఫిక్ ఎలా ఉందో తెలుసా, అందులోను ఇవాళ బయట కనపడితే కాల్చేస్తాం అని సీఐఏ వాళ్ళు హెచ్చరికలు జారీ చేసారు కూడా.” అంటూ ఆ పక్క ఫోన్లో ఏదో సద్దాలని చూసాడు.

 

“కుదరదు, ఈరోజే వెయ్యించాలి, ఈరోజు చాలా మంచి రోజు, నెల క్రితం పెట్టించిన ముహూర్తం. ఉస్సేన్ బోల్టుకి  ఈ ముహూర్తానికే పోలియో చుక్కలు వేయించుకున్నారు.., ఇప్పుడు చూసారా చిరుత లాగా పరిగెడుతున్నాడు.”

 

“అదేంటీ, మొన్న మనవాడు ఐఐటీ చెయ్యాలన్నావు కదా.”

 

“ఏం రెండూచెయ్యలేడనుకుంటున్నారా? మీరు కూడా మీ బాబాయిలా మాట్లాడకండి.  పొద్దున్న ఐఐటీకి వెళ్లి సాయంత్రం స్ప్రింటర్ అవ్వకూడదనా మీ ఉద్దేశం?”

 

“ఆలా కాదు, వాడికి ఏది ఇష్టమో?”

 

“నోరు ముయ్యండి. వాడు అన్నీ చెయ్యగలడు. నేను చెయ్యిస్తా. ఇప్పుడు మీరు వస్తున్నారా లేదా? రోజూ పిల్లాడిని నా మీద పడేసి పోవడం అలవాటేగా మీకు. ఈ చుట్టాలనే చూసుకోనా  వీడి సంగతే చూసుకోనా!” అంది ఆంటీ, చుట్టుపక్కల పట్టించుకోకుండా.

 

అంకుల్ ఇగో హర్ట్ అయ్యింది. “నేను రావట్లేదు” అని ఫోన్ పెట్టేసాడు.

 

మా అమ్మమ్మ దగ్గరికి వచ్చి ఒకటే ఏడుపు. ఇంకేమవుతుంది మా అమ్మమ్మ, ఆవిడ ఏడుపులకి కరిగిపోయి, అరుపులకి బెదిరిపోయి, హామీ ఇచ్చేసింది. నేను వెళ్ళి పని పూర్తి చేసుకుని రావాలని.

 

“మీకెందుకండి శ్రమ..” -ఆంటీ.

 

“ఇందులో శ్రమ ఏముంది, మా వాడికి పెద్ద పనిలేదు, వెళ్ళొస్తాడులే. ”

 

“అదేంటి నా పని కూడా మీకు తెలుసా?  నేను ఈరోజు రీసెర్చ్ పేపర్ రాయాలి,” అని నసిగాను.

 

“బోడి పేపర్ రేపైనా రాసుకోవచ్చు, ముహుర్తాలు మనకోసం ఆగుతాయా! దమ్మిడీ కడుతుందిరా నీ రీసెర్చ్? ముందు పని కానీ. మేము ఈలోపు సీరియల్ చూస్తుంటాం. అయోమయంగా ఉండకుండా జాగ్రత్తగా వెళ్ళిరా.” ఆ చివరి ముక్క చెవిలో చెప్పింది.

 

“నేను కూడా వెళ్తానండి,..” – ఆంటీ

 

“నువ్వు ఆ చుట్టాల సంగతి చూసుకోమ్మా. మా వాడు వెళ్ళొస్తాడులే. పక్కనేగా హాస్పిటల్.” అంటూ నా వైపు ‘ఏదోటి చెప్పు’ చూపు చూసింది.

 

“అవును నేను వెళ్ళొస్తాలెండి.” అన్నాను.

 

ఆవిడ కొంచెం సంశయిస్తూ పిల్లాడిని నా చేతికి ఇచ్చింది.

 

“పిల్లాడినేగా ఇస్తున్నారు, సొంత కారుని తాగుబోతు వాడికి ఇస్తున్నటు ఆ మొహం ఏమిటండి.” అన్నాను కాస్త హాస్యం చేద్దామని.

 

“నేను కూడా వెళ్తా అమ్మమ్మ గారూ, నాక్కొంచెం భయంగా ఉంది.” అంది ఆంటీ.

 

“ఎక్కడేం మాట్లాడాలో ఎప్పటికి  నేర్చుకుంటావురా!” నా చెవిలో వినిపించాయి మళ్ళీ.

 

“ఏం పర్లేదు ఆంటీ, మేము వెళ్ళి పోలియో చుక్కలు గటా గటా తాగేసి, జాం అని ఇంటికి వచ్చేస్తాం. ఏరా.”

 

పిల్లాడు నాకేసి చిరాగ్గా ‘మేము’ కాదు ‘నేను’ అన్నట్టు మొహం పెట్టుకుని చూస్తున్నాడు. కారులోకి ఎక్కగానే కిటికీ లోంచి ఒక్కసారి ఆలా మా అమ్మమ్మ కేసి చూసాను, వెనక్కొచ్చెయ్యమంటుందేమోనని. అప్పటికే ఆవిడ ఇష్ట సీరియల్ మొదలవుతోందని కంగారుగా వెళ్లిపోయింది.

 

పిల్లాడు, నేను, కారు, హాస్పిటల్, పోలియో చుక్కలు, కారు, ఇల్లు. ఇలా ఉంది ఇప్పటికి ఎజెండా. ఇంక ఎదో ఆలోచిస్తుండగా, “డ్రైవర్ కార్ తియ్యి” అని వినిపించింది. ఇది మాత్రం వాడు అన్నదే. అనలేదా? ఏమో నాకు పిచ్చి.

 

పిల్లాడికి మోషన్ సిక్నెస్ ఉందని చెప్పకుండా నన్ను కమిట్ చేసారు. కార్ స్టార్ట్ చెయ్యగానే, ఊరికే ఉంటాడా సుబ్బరంగా పావనం చేసాడు. బాష్ కంపెనీ టిష్యూ పేపర్స్ని, టచప్ బ్యాగ్లోని మేకప్ కిట్ ని వాడి, బట్టలు మార్చి, చెత్త వాసనలు రాకుండా సాంబ్రాణి పొగ వేసేలోపు, మళ్ళీ పావనం చేసాడు. అంతలావు సూపర్ మ్యాన్ కే kryptonite వీక్నెస్ లాగా, వీడికి కారు పడదన్నమాట. ఏ చెత్త చైనీస్ వస్తువు కొన్నా దానికోక మ్యానువల్ ఏడుస్తుంది. వీడికి మాన్యువల్ లేదు సరికదా, అంతా ఆటోమేటిక్గా జరిగిపోతోంది. ఎలాగోలా 2 కి.మీ దూరాన్ని విడతలవారీగా గంటన్నరలో చేరుకున్నాం.

 

ఇన్ని చేసిన వీడికి డోర్ కూడా నేనే తియ్యాలి.

 

హాస్పిటల్ ఖాళీగా ఉంది. ఆ పోలియో చుక్కల రూమ్ లోపల పెద్ద జనం లేరు, మంచి రోజు కాదనుకుంటా. రూంలో పిల్లల ఫోటోలు తగిలించి ఉన్నాయి. ఆ పక్కన నర్స్ ఖాళీగా పెడిక్యూర్ + మానిక్యూర్ బొటీక్ పెట్టుకుంది. తాను చేసుకుంటూ నలుగురికి చేస్తూ చిన్న కుటీర పరిశ్రమ నడుపుకుంటోంది. మేము వెళ్ళగానే సద్దుకుని,

 

“టూ మినిట్స్ సర్. ఈ ఇద్దరికీ చేసేసి వచ్చేస్తా. ఈలోపు ఆ ఫారం నింపండి.”

 

ఫారం నింపుతుండగా, బయట రఘుగాడు వెళ్తూ కనపడ్డాడు. “ఇదిగో నర్సుగారు, మా వాడికి ఎక్కడా లోభించకుండా సుబ్బరంగా పోలియో చుక్కలు పట్టించండి, మిగిలితే ఈ బ్యాగ్ లో పాల సీసాలో నింపండి, సాయంత్రం మేము పట్టిస్తాం. నేను ఇప్పుడే వస్తా. వచ్చేసరికి మా కుర్రాడు మీ వేళ్ళలా వజ్రంలా మెరవాలి. మీరేంచేస్తారో నాకు తెలీదు.. ఒరేయ్ రఘు వస్తున్నా ఉండు.”

 

“గాలి తిరుగుళ్ళు తిరగకుండా త్వరగారా” అన్నాడు పిల్లాడు. అనలేదు. నాకు పిచ్చి లేదు.

 

“ఒరేయ్ రఘు..”

 

“హలో, ఏంట్రా ఇలా వచ్చావ్?”

 

“పోలియో చుక్కలు వెయ్యిద్దామని. నాకు కాదులే, పక్కింటి పిల్లాడికి. నువ్వేంటి ఇలా..”

 

“ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు కనపడతారేమోనని చూస్తున్నారా. దేవుడు ఉన్నాడురా, ఒక పది వేలు కావాలిరా, సద్దగలవా?”

 

“తెలిసిన వాళ్ళని బావున్నావా అని అడగాలి కానీ, అప్పు అడగకూడదురా. అయినా నీకు తెలుసుకదరా  మా మిడిల్ క్లాస్ బ్రతుకులు, రెక్కాడితే గానీ డొక్కాడదు. కాయకష్టం చేసి సంపాదించినా సొమ్మంతా ఇలా హాస్పిటల్స్ పాలవుతోంది. అర్థం చేసుకుంటావ్ అనుకుంటున్నా! రేయ్ రఘు ఒక్కటి గుర్తుపెట్టుకో, విధి బలీయమైనది, స్నేహం బలమైనది.” వాడికి అర్థం అయ్యేలోపు నెమ్మదిగా రూంలోకి జారుకున్నా.

 

అక్కడ రూంలో పిల్లాడు ఒక్కడే ఉన్నాడు. ఈ హాస్పిటల్స్ వాళ్లకి వేలకి వేలు పడెయ్యడమే కానీ, అస్సలు శ్రద్ధ ఉండదు. వీడికి హాస్పిటల్ సిక్నెస్ కూడా ఉందనుకుంటా. మళ్ళీ షర్ట్ మారింది. డ్రాప్స్ మాత్రం బాగా పడ్డట్టు ఉన్నాయి,మొహం మంచి వెలుగొచ్చింది. నేను అస్సలు ఆలస్యం చెయ్యకుండా, ఎజెండా ప్రకారం వెంటనే వాడి బ్యాగ్ ని వాడిని మోసుకుని, కారిడార్లో తచ్చాడుతున్న రఘుగాడికి కనపడకుండా పాక్కుంటూ కార్ పార్క్ వెళ్ళిపోయా.

 

కార్ స్టార్ట్ చేసే ముందు వీడి కోసం అంత న్యూస్ పేపర్స్ పరిచి, సామాగ్రి రెడీ చేసుకుని ఇగ్నిషన్ ఇచ్చా. పిల్లాడిలో వేరే లక్షణాలు ఏమీ కనపడలేదు. నెమ్మదిగా ఫస్ట్ గేర్ వేసుకుని కాసింత ముందుకు వెళ్ళి  మళ్ళీ ఎలెర్ట్ అయ్యా. ఏమీ జరగలేదు. మెడికల్ మిరకిల్స్, పోలియో చుక్కలకి, నాసియా పోవడం ఏంటి అనుకుంటూ ఇంటికి చేరిపోయాం ఇద్దరం.

 

ఇంట్లో సీరియల్ చూస్తున్నారు ఇద్దరూ. ఆంటీ చూస్తూ కునికిపాట్లు పడుతోంది. అమ్మమ్మ నా దగ్గరికి వచ్చింది,

 

“ఏరా, పిల్లాడు ఏడి?”

 

“ఇడుగో..”

 

“వీడెవడురా, మన పిల్లాడు ఏడి?”

 

“ఇదిగో వీడే మనవాడు. కళ్ళద్దాలు పెట్టుకో సరిగ్గా. ఇదిగో మనవాడి వానిటీ సంచి.”

 

“సంచి మనవాడిదే, వీడే మనవాడు కాదు.”

 

“అదేంటమ్మా, నువ్వు లక్ష చెప్పు. వీడు మనవాడే, చూడు ఆ ముచ్చు మొహం. అయినా వీడికి కార్లు పడవని నాకు ముందే చెప్పాలిగా, ఇప్పటికి ఆరు సార్లు చొక్కాలు మార్చాను, వీడేసుకున్నదానితో కలిపి ఏడవది. నేనేదో మర్యాదస్తుణ్ణి కాబట్టి సరిపోయింది, వేరే వాళ్ళైతేనా. ఇంకోటి గమనించావా, పోలియో చుక్కల మహిమ చూసావా వెలిగిపోతున్నాడు. దాని ఎఫెక్ట్, వీడి మోషన్ సిక్నెస్ కూడా పోయింది, ఈ శుభవార్త ఆంటీకి అందచెయ్యి.”

 

“ఏడ్చావ్, నోరు మూసుకో అయోమయం శుంఠ! వీడు మనవాడు కాదు! అర్జెంటుగా హాస్పిటల్కి ఫోన్ చెయ్యి. అయినా పోలియో చుక్కలకి మోషన్ సిక్నెస్ పోవడం ఏంట్రా..” అంది పక్కకి లాక్కెళుతూ.

 

“అమ్మ, ఏ చొక్కా వేసుకున్నానో మర్చిపోయే వెధవనే కావచ్చు, కానీ పిల్లల్ని గుర్తుంచుకోలేనంత ఆయోమ…” ఫోన్ మోగింది ఈలోగా.

 

“నేను హాస్పిటల్ నుంచండీ.”

 

“ఆ హలో, ఏం కంగారు లేదండి మావాడు మా దగ్గరే ఉన్నాడు.”

 

“కంగారు పడింది మీరు, మీ పిల్లాడిని ఇక్కడ వదిలేసి, వేరే పిల్లాడిని పట్టుకుపోయారు. మీ మీద కిడ్నాప్ కేసు పెడతామంటున్నారు వాళ్ళు. నేను శాయశక్తులా వాళ్ళని ఆపుతున్నా, అర్జెంటుగా పిల్లాడితో పాటు ఇక్కడికి రండి.”

 

నాకు ఇప్పుడు మొత్తం అర్థమైంది. వీడు మన పాతసరకు గాడు కాదు. కాళ్ళు వణికాయి. మా నాన్న ఎప్పుడూ చెప్తుంటాడు, “తప్పు మనది అయినప్పుడు ఎదుటవాడిని తిట్టెయ్యడం మంచి పద్ధతి.”

 

“మా పిల్లాడిని మీ దగ్గర ఉంచేసుకుని, వేరే వాడిని అంటకడతారా! మీ అంతు చూస్తా! ఏదో పెద్ద హాస్పిటలని మీ దగ్గరికి వస్తే ఇదా మీరు చేసేది. నా సర్కిల్ మీకు తెలీదు, నాగార్జున సర్కిల్ కన్నా పెద్దది తెలుసా!”

 

“మీ పిల్లాడిని తీసుకెళ్తేవెళ్ళండి లేకపోతే లేదు. అన్నం పెట్టే అమ్మ లాంటి హాస్పిటల్ని ఏమైనా అన్నారో మర్యాదగా ఉండదు. ఆ పిల్లాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషగిరి గారి అబ్బాయి. వాళ్ళకి తెలుసు ఏమి చెయ్యాలో..” ఫోన్ కట్ అయ్యింది.

 

“హహ, సినిమాల్లో చూసినట్టు, పిల్లలు మారిపోయారంటమ్మా మళ్ళీ ఫోన్ ఒకటి. ఏం వీడిని మనకి ఇచ్చి వాడిని పట్టుకెళ్ళచ్చుగా వాళ్ళు. వెధవలు కామన్ సెన్స్ ఉండదు. అన్నిటికీ గొడవలు ఎక్కువైపోయాయి, అసలు మానవ జాతి క్షీణించడానికి.. ”

 

పక్కనుంచి వేడిగా ఏదో కదిలింది. అట్లకాడ.

 

తప్పించుకుని, కార్ ఎక్కి హాస్పిటల్ కి వెళ్లేసరికి పోలీసులు, జీపులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, మధ్యలో చొక్కాలేని పిల్లాడు. ఆ వెనక తలుపు నుంచి వెళ్ళి నర్సుకి వీడిని ఇచ్చేసి, మా షర్ట్ లెస్ సిక్నెస్ గాడిని ఎత్తుకుని కారులోకి పరిగెత్తేలోపు దరిద్రుడు రఘుగాడి ఎదురు.

 

“రేయ్ ఇందాక నువ్వు చెప్పింది బాగా ఆలోచించారా”

 

ఒక రెండువేలు ఇచ్చేదాకా వదల్లేదు. మిగిలినది పేటీఎం చేస్తానని, ఎలాగోలా ఇంటికి చేరుకుని ఆంటీ ఇంటికి వీడిని డెలివర్ చేసేసరికి శోష వచ్చింది.

 

“ఇప్పుడేగా ఇంటికి చచ్చావ్ మళ్లీ ఎక్కడికి?”

 

“నువ్వు చెప్పింది నిజమే, పోలియో చుక్కలకి మోషన్ సిక్నెస్ పోదమ్మా. పోదు…ఇందాక వెళ్తూ బాగ్ ఇక్కడే మర్చిపోయానమ్మా. కార్ సర్వీసింగ్ కి ఇవ్వాలి.”

 

 

5 Comments

  1. నాన్నా స్వాప్నిక్ , మరీ దారుణం అయ్యా! ఇంతలా నవ్విస్తావా? నవ్వలేక చచ్చిపోతున్నాను. చుక్కలు వేయించమంటే, చుక్కలు చూసివచ్చావుకదయ్యా దాంతో మాకు పొట్ట చెక్కలు చేసావు. చాలా బగుంది జంధ్యాల గారిని మించిపోతావు. శుభాశ్శీసులు.

    Liked by 1 person

  2. నవ్వి నవ్వి కడుపు నొప్పి వొచ్చింది 😊 ఎప్పుడో పూర్వకాలం లో మల్లిక్ కధలు నవ్వితే నవరత్నాలు చదివినప్పుడు నవ్వా మళ్లీ ఇప్పుడు థాంక్స్ 👌👍

    Liked by 1 person

  3. ముందే ఊహించి స్వాప్నిక్ అని పెట్టారు! పేరేదయితేనే నీ పాతలు పిక్నిక్ లా ఉంటాయి స్వాప్నిక్! సరే సరే! నీకు కారు పడదని నాకు తెలుసులే! ప్రాసలతో చంపను. Hilarious! God bless you

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s