అయిదుగురు పిల్లలూ అదీనూ [రెండో భాగం] – మైథిలి అబ్బరాజు

ఆ రోజు ఆంథియా కి ఒక కలొచ్చింది. అచ్చం నిజంగా జరుగుతున్నట్లే అనిపిస్తూండింది. ఒక్కత్తే జూ పార్క్ లో తిరుగుతోందట, వాన పడుతోందట –  వర్షానికి  అక్కడి జంతువులకి చిరాకేసి గుర్రు గుర్రుమంటున్నాయట. ఆ శబ్దం, నీళ్ళు మీదపడటం – లేచాకా కొనసాగుతోంది. పక్కనే జేన్ గురకపెడుతూ నిద్రపోతోంది – జలుబు చేసి ఉంది పాపం. అప్పుడే స్నానం చేసొచ్చిన రాబర్ట్ తుండుగుడ్డ చివరలని మెల్లిగా ఆంథియా మొహం మీదికి పిండుతున్నాడు – నిద్ర లేపేందుకు.

” హే. లే  నువ్వు ” – కోపంగా అరిచింది. రాబర్ట్ ఆపేశాడు – మంచిపిల్లవాడిలాగా. నిద్రపోయే మనుషులని లేపేందుకు కొత్త కొత్త మార్గాలూ ఇంకా అటువంటి జనరంజకమైనవీ కనిపెడుతుంటాడే గాని – బుద్ధిమంతుడే.

” భలే కలొచ్చింది నాకు ” – ఆంథియా మొదలెట్టింది.

” నాక్కూడా ” – అప్పుడే నిద్ర లేస్తూ జేన్ ప్రకటించింది. ” అక్కడ కంకరగుంటలో  మనకి ఇసక యక్షిణి కనిపించిందట. రోజుకొక కోరిక తీరుస్తుందట …”

” అరే, నాకు కదా వచ్చింది ఆ కల – ” రాబర్ట్ అడ్డం వచ్చాడు. ” రోజుకో కోరిక తీరుస్తానంటే ‘ గొప్ప అందం గా ఐపోవాలి ‘ అని కోరుకున్నారట మీరు – బుద్ధితక్కువమొహాల్లాగా. అంతా అడ్డదిడ్డమైపోయిందట ”

” ఒకే రకం కల అందరికీ వస్తుందా అలా ? ” – ఆంథియా లేచి కూర్చుంది. ” నాకేమో జూలో వాన పడుతూన్నట్లూ తర్వాత పాపాయి మనల్ని గుర్తుపట్టనట్లూ మార్తా మనల్ని ఇంట్లోంచి గెంటేసినట్లూ – ”

మెట్ల మీదినుంచీ  సిరిల్ గొంతు వినిపించింది – ” బ్రేక్ ఫాస్ట్ కి వస్తారా అందరూ ? రాబర్ట్ , స్నానం చేశావా – నిన్నట్లా ఎగ్గొట్టేశావా ? ”

” నాన్నా వాళ్ళ గదిలో చేసేశాలే ” – రాబర్ట్ కేకపెట్టాడు.

సిరిల్ తల తుడుచుకుంటూ గుమ్మం లోకి వచ్చి నిలుచున్నాడు.

” తెలుసా- మా అందరికీ ఒకే రకం కలొచ్చింది – ఇసక యక్షిణి గురించి ” – ఆంథియా .

సిరిల్ మొహం చిరచిరలాడింది. ” కలా, ఇంకేమన్నానా ? వెర్రి మొహాల్లారా, అదంతా నిజమే.అందుకే పొద్దుటే లేచి తయారయాను నేను.  రోజుకో కోరిక తీరుతుంది మనకి. నిన్న జరిగిన భాగోతం తో బుద్ధి తెచ్చుకుని ముందే అందరం కూర్చుని ఏం అడగాలో తేల్చుకుని వెళదాం. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్ళు అడక్కూడదు – అందాలూ చందాలూ తలతిక్కలూ – ” – ఆజ్ఞాపించాడు.

ముగ్గురూ మెదలకుండా తయారయారు. జేన్ కి అంతా నిజమనిపిస్తోంది గాని ఆంథియాకి మార్తా హెచ్చరించేదాకా నమ్మకం కుదరలేదు. ముందురోజులాగా అల్లరి చిల్లరిగా తిరిగి అర్ధరాత్రి ఇంటికొస్తే తలుపులు తీసేది లేదనీ ఆ లోపల అడ్డమైనవాళ్ళూ అందమైన మొహాలేసుకుని లోపలికి తోసుకొస్తే  ఊరుకోననీ మార్తా గదిమి చెప్పింది.

అవును కదా – మార్తా కి కూడా అదే కల ఎలా వస్తుంది ? అదంతా నిజమే. ఇంతకీ గొర్రె పిల్ల [ పాపాయి ] ఏదీ ?

” మార్తా వాళ్ళ చుట్టాలింటికి రోచెస్టర్ వెళుతోంది, పాపాయిని కూడా తీసుకుపోతోందట. అమ్మని అడిగితే సరేనందట. మంచి బట్టలేస్తోంది దానికి ”

” అంతదూరం దాన్ని ఎలా ఎత్తుకెళుతుందో ఏమిటో- నిన్న నా చేతులు పడిపోయాయి ”

” వీపుకి కట్టుకుని వెళుతుందనుకుంటా ”

” లేదు- బండిలో వెళుతోంది. మార్తా నీ పాపాయినీ పద్ధతిగా సాగనంపితే ఇంక రోజంతా హాయిగా మనిష్టమొచ్చినట్లు చేసుకోవచ్చు ”

మార్తా దర్జాగా తయారైంది. తను ఆదివారం వేసుకునే వంగపండు గౌను తొడుక్కుంది. అది బిగుతయిపోయి బుజాల దగ్గర వంగి నడుస్తోంది. నీలం రంగు టోపీ దాని మీద గులాబి రంగు పువ్వులూ తెల్లటి కుచ్చులూ. పసుప్పచ్చటి లేస్ కాలర్, ఆకుపచ్చరంగు బౌ –  పాపాయి  వెండి రంగు పట్టు గౌనూ మీగడ  రంగు కోటు తో మార్తా కి తగినట్లుగా ముస్తాబైంది. ఇద్దరినీ ఎక్కించుకున్న  ఎర్ర చక్రాల బండి తాపీగా బయల్దేరింది.

 

*****

” పదండి పదండి ”

ఏం అడగాలో అంతా ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నారు. కంకర గుంట అంచుల్లోంచి దూకి చప్పున చేరిపోవాలనిపించినా కూడా నిగ్రహించుకుని నిదానం గా చుట్టూ తిరిగి వెళ్ళారు. ముందు రోజు శా మీడ్ కనిపించిన చోట చుట్టూ రాళ్ళు పేర్చి గుర్తు పెట్టుకున్నారు కనుక కనుక్కోవటం సులువే ఆవాళ. సూర్యుడు ధగ ధగా ప్రకాశిస్తున్నాడు. ఆకాశం  ఒక్క మబ్బు కూడా లేకుండా నిండు నీలం రంగులో ఉంది. ఇసక ముట్టుకుంటే చుర్రుమంటోంది.

” ఏమిటో , ఒక వేళ అదంతా కలయి ఉంటే ” – పార పట్టుకు తవ్వుతూ రాబర్ట్.

” ఒకవేళ నీకు తెలివి ఉండిఉంటే ” – సిరిల్  వెటకారం.

” ఒకవేళ నీకు మంచీ మర్యాదా ఉంటే ” – రాబర్ట్ రోషం.

మగపిల్లలిద్దరూ  పారలు తీసుకుని ఆడపిల్లలకి ఇసక ఎత్తిపోసే బొచ్చెలు ఇచ్చారు.

” పోనీ మేము తవ్వమా ? ” – జేన్ కి జాలేసింది.

” ఏమక్కర్లా. అయిపోతుందిలే- చేస్తున్నాంగా  ” రాబర్ట్ కి  చెమటలు కారిపోతున్నాయి.

” రాబర్ట్ , నువే అడుగుదువు గాని శామీడ్ ని. నీకే బాగా వస్తుంది చెప్పటం ” – ఆంథియా బుజ్జగించింది.

” ఆ- అంతొద్దులే ” అన్నాడుగాని రాబర్ట్ మురిశాడు కొంచెం.

చూస్తూండగానే ఇసక లోంచి – సాలీడు లాంటి ఒళ్ళూ సన్నటి పొడవాటి కాళ్ళూ చేతులూ గబ్బిలం చెవులూ నత్త కళ్ళూ –  శామీడ్ దర్శనమిచ్చింది. అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు – కల కాదు నిన్నటిదంతా.

అది ఒళ్ళు విదిలించుకుంది.బొచ్చులోంచి ఇసక చిమ్మింది.

” నీ ఎడంపక్క మీసం ఎలా ఉంది ఇవాళ ? ” – ఆంథియా మర్యాదగా అడిగింది.

” ఏదోలే. నడుస్తోంది -రాత్రి కాస్త బాధ పెట్టింది. అడిగినందుకు సంతోషం ” – శామీడ్ .

రాబర్ట్ అడిగాడు – ” మరైతే ఇవాళొక కోరిక తీరుస్తావుగా ? దాంతోబాటు ఇంకొక్కటి – చాలా చిన్నది లే, అది కూడా – ఏమనుకోకుండా ”

” హు ! ” -విసుక్కుంది శామీడ్. ” మీరిందాక నా నెత్తి మీద ఇసక తవ్వుతూ పోట్లాడుకోవటం వినేదాకా నిన్నటిది కలనుకున్నాను నేను. వింత వింత కలలొస్తుంటాయిలే నాకు ”

”అవునా –  మాకు చెప్తావా అవన్నీ ? భలే ఉండి ఉంటాయి ” -జేన్ దాన్ని శాంతపరిచే ప్రయత్నం చేసింది.

” అదేనా ఇవాళ్టి కోరిక ? ” -శామీడ్ ఆవలించింది.

” బుర్ర తక్కువ పిల్లా ” – సిరిల్  గొణుక్కున్నాడు . ఇప్పుడు ‘ అవును ‘ అంటే ఆ రోజు కోరిక ఖాళీ, ఆ సోది కలలు విని ఇంటికి పోవాలి. ‘ కాదు ‘ అంటే అమర్యాద , శామీడ్ కి అసలే ముక్కుమీదకోపం. ఏం చేసేట్లు ?

” అవి చెప్తే ఇంకో కోరిక తీర్చేందుకు నాకు ఓపిక లేదు ” – శామీడ్ అనేసరికి అంతా అమ్మయ్య అనుకున్నారు.

” పోనీ, వద్దులే ”సిరి ల్ చటుక్కున చెప్పేశాడు. ఆ మాటకి మళ్ళీ అదెక్కడ నొచ్చుకునిపోతుందోనని కంగారు అందరికీ.

” ఆ- సరే అయితే . చిన్న కోరిక అడగండి ముందు ”- శామీడ్ కళ్ళు ఆ చివరనుంచి ఈచివరకి తిప్పుకుంది.

” ఏం లేదూ – నువ్వు తీర్చే మా కోరికలేవీ మా ఇంట్లో మార్తా కి తెలియకూడదు ”

శామీడ్ ఒంటిని కాస్త ఉబ్బించుకుని మామూలై – ” ఆ. తీర్చాను. అయినా – మనుషులెవరూ పెద్దగా గమనించరు దేన్నీ . అసలు కోరికేమిటి ? ”

” ఎవరైనా , ఎక్కడైనా – కలలు కనగలిగేదానికి  మించిన ఐశ్వర్యం కావాలి మాకు ” – రాబర్ట్ నిదానం గా ఒక్కొక్కమాటా పలికాడు.

” దురాశ … అదేమంత మంచి చెయ్యదు మీకు, అంతవరకూ నయం ” తనలో తను గొణుక్కుని , ” కలలకి మించిన సంపదా అంటే నాకు తెలీదు. ఎంత కావాలి ? ఎలా కావాలి – బంగారం గానా , నోట్ల కట్టలా ? ”

” బంగారమే. లక్షలకొద్దీ నాణాలు ”

” ఈ కంకర గుంట నిండా అయితే చాలా ? ” శామీడ్ అలవోకగా ప్రశ్నించింది.

” చాలు ! చాలు !! ”

” అయితే బయటికి పొండి ముందు. అందులో కూరుకుపోగలరు ”

చేతులూ కాళ్ళూ ఊపింది వెళ్ళమని. పిల్లలంతా పరుగు లంకించుకున్నారు. ఒక్క ఆంథియా మాత్రం వెనక్కి తిరిగి ” రేపటికి నీ మీసం బాగైపోతుందిలే ” అని అరిచింది.

గట్టు మీదికి చేరి గట్టి – గా కళ్ళు మూసుకు నిలుచున్నారు. మెల్లిగా- అతి మెల్లిగా తెరిచారు. కళ్ళు చెదిరిపోతున్నాయి. నడి ఎండాకాలం మిట్టమధ్యాహ్నం సూర్యుడి వైపు చూస్తున్నట్లుంది. కంకర గుంట నిండా, అంచులదాకా పొర్లిపోతూ బంగారు నాణాలు ! గట్ల మీద చుట్టూరా పోగు చేసి ఉన్న కంకరంతా కూడా బంగారమైపోయింది. ఇంకా పక్కలకీ అక్కడా అక్కడా లెక్కలేనన్ని నాణాలు – ఎండలో మెరిసిపోతూ. మొత్తం కంకర గుంట కి నిప్పంటుకుని తగలబడిపోతున్నట్లుంది.

 

పిల్లలు నోళ్ళు తెరుచుకు చూస్తుండిపోయారు. ఒక్కళ్ళకీ మాటలు రాలేదు.

ఆఖరికి రాబర్ట్  వంగి కొన్ని  నాణాలు తీసుకుని అటూ ఇటూ  చూశాడు . ” ఇవి ఇప్పుడు చెల్లవేమో ”

” ఏం కాదు. ఏదైనా బంగారమేగా . చెల్లుతుంది ” -సిరిల్ హామీ ఇచ్చాడు. ఇక అందరూ గోల గోలగా మాటలు ప్రారంభించారు. గుప్పిళ్ళ నిండా తీసుకుని మళ్ళీ మళ్ళీ  జారవిడవటం – ఆ శబ్దం ఎంతో బావుండింది, విసుగే పుట్టలేదు ఎంతకీ.  జేన్ ని కూర్చోబెట్టి రాబర్ట్ నాణాలతో పూడ్చే ఆట మొదలెట్టాడు – ఇదివరకెప్పుడో వాళ్ళ నాన్న ని సముద్రం ఒడ్డున గుంటలో కూర్చోబెట్టి ఇసక తో పూడ్చినట్లు. జేన్ కాసేపు ఊరుకుంది గానీ తర్వాత వద్దని కేకలు పెట్టింది.

” అబ్బా, నొప్పిరా. రాళ్ళ లాగున్నాయి ఇవి. గొలుసులేసి కడుతున్నట్లుందేమిటో ”

సిరిల్ కి ముందు ఒళ్ళు తెలిసింది. ” ఆ. ఇంక చాలు. అందరం రెండు జేబుల్లోనూ  నింపుకుని బయటపడదాం . చీకటి పడితే వీటితో ఏం ఉపయోగం ఉండదుగా. రండి రండి. ముందస్తుగా ఊళ్ళోకి వెళ్ళి ఒక గుర్రాన్నీ బండినీ తీసుకుందాం ”

” కొంటావా వాటిని ? ” -జేన్

” ఎహె. కాదూ. అద్దె కి. బండిలో రోచెస్టర్ వెళ్ళి మనకి కావల్సినవన్నీ – అన్నీ కొనుక్కుందాం. తొందరగా బయల్దేరండి. ఇవి ఈ కాలపువి కావుగదా, మార్చుకుందుకు ఆలస్యం అవచ్చు. దొరికినన్ని తీసుకు రండి అందరూ . తక్కిన మాటలన్నీ దారిలో కానిచ్చుకోవచ్చు ”

” నా పాంట్ కి నాన్న తొమ్మిది జేబులు కుట్టించాడని మీరంతా నవ్వారుగా అప్పుడు- ఇప్పుడు చూడండి ఎలా పనికొస్తున్నాయో ” – సిరిల్ గర్వం గా అన్ని జేబులూ నింపి, పెద్ద జేబు రుమాలు లో ఇంకా చాలా మూటలు కట్టి, ఇంకా కొన్ని చొక్కాకీ ఒంటికీ మధ్యలో వేసుకున్నాడు. రెండు అడుగులు వేసేసరికి ఆ బరువుకి తూలాడు.

” కాస్త సరుకు దించెయ్యరా సరంగూ, పడవ మునిగిపోతుంది ” – రాబర్ట్ ఏడిపించాడు.

దించక తప్పలేదు.

అంతా కలిసి ఊరివైపుకి నడక సాగించారు. మైలు దూరం ఉంది ఊరు. దారంతా దుమ్మూ ధూళీ. ఎండ అంతకంతకీ నెత్తి మాడ్చేస్తోంది. జేబుల నిండా అంత బరువు – పిల్లలు అలిసిపోయారు.

ముందుగా సందేహం వచ్చింది జేన్ కే. ” ఇదంతా కలిపి కొన్ని వేల పౌండ్ లు ఉంటుందేమో – ఎలా ఖర్చుపెడతాం మొత్తం ? ముందెక్కడైనా ఆగి నాలుగు బిస్కెట్ లు కొనుక్కుంటే బావుండు- ఆకలేస్తోంది ” – ఒక తోట కంచె మీద ఇన్ని గుప్పెళ్ళ నాణాలు పోసేసింది. ” ఎంత పచ్చగా అందం గా మెరుస్తున్నాయో ? ఇవి ఉన్నట్లుండి బ్రెడ్ ముక్కలూ కేకులూ బిస్కెట్ లూ అయిపోతే ఇంకా బావుండదూ ? హాయిగా తినేయచ్చు  ”

” అవి తినేవి కావు. మనం తినలేము. సరేనా ? నడువు ” – సిరిల్ కోప్పడ్డాడు.

కాని వెళ్ళేకొద్దీ ఆయాసం ఎక్కువే అయింది. ఇంకా చాలా చోట్ల బంగారునాణాల కుప్పలని వదిలి పోవలసే వచ్చింది. అంత చేసీ ఊళ్ళోకి వెళ్ళేసరికి పన్నెండు వందల నాణాలు మిగిలాయి మొత్తం కలిపి. ఎవరూ వాళ్ళని చూసి అంత డబ్బుందని ఊహించేలా లేరు – మట్టికొట్టుకున్న బట్టలు, పీక్కుపోయిన మొహాలు. అర నాణెం ఉంటే గొప్పనిపించే వాలకాలు. ఊరు అంచున ఒక సత్రం  అరుగు మీద కూలబడ్డారు. దాని పేరు ‘ నీలి పంది నివాసం ‘ .  ఎర్రటి ఇంటి కప్పులమీది నుంచి కట్టెలపొగ ముసురుకుని ఉంది, అది ఆ వేడి సెగలతో కలిసి అంతా బూజర బూజర గా ఉంది.

సిరిల్ లోపలికి వెళ్ళి పిల్లలకి తాగేందుకేమైనా తేవాలని నిర్ణయమైంది. అలాంటి చోట్లకి పిల్లలని తీసుకెళ్ళరు – మగవాళ్ళు మటుకే వెళతారు. సిరిల్ ఇంచుమించుగా మగవాడికిందే లెక్కగనుక వెళ్ళచ్చు.

” అబ్బా- ఎంత వేడిగా ఉందో. కుక్కలకి వేడిగా ఉంటే నాలుకలు బయట పెట్టుకుంటాయి కదా, మనమూ అలా చేస్తేనో ? ” – రాబర్ట్.

అంతా ఆ ప్రయత్నం చేశారు. గొంతుకలని వీలైనంత సాగదీసి నాలుకలు బయట పెట్టుకు కూర్చున్నారు. ఎంతకీ దాహం ఎక్కువైందేగాని ఒక్క పిసరు తగ్గలేదు. చాలాసేపటికి సిరిల్ బయటికి వచ్చాడు.

” ఇవిగో – పళ్ళరసం సోడాలు. కొంచెం స్పాంజ్ కేకులూ బిస్కెట్ లూ కూడా కొన్నాను. అన్నీ నా దగ్గరి చిల్లర తోనే. ఆ బంగారం ఇక్కడ మార్చుకోమని అన్నారు. ఇంకా ఉందని చూపిస్తే నవ్వటం మొదలెట్టారు – తాగేసి ఉన్నారు కొంతమంది, మీరు రాకపోవటం మంచిదైంది. నేనెక్కడో కొట్టేసి తెచ్చానంటారేె ”

బిస్కెట్ లు మెత్తగానూ కేకులు గట్టిగానూ – ఏడిసినట్లున్నాయి. పళ్ళ సోడాలు మటుకు బావున్నాయి. మొత్తానికి అందరూ కాస్త తేరుకున్నారు.

” తర్వాత పెద్దదాన్ని నేను. నేను చూస్తాను ఈసారి . గుర్రం బండీ ఎక్కడ ఉంటాయి ? ” – ఆంథియా.

అవి వేరే సత్రం లో అద్దెకిస్తారు. అదీ ఆడపిల్లలు వెళ్ళే చోటు కాదు గనుక ఆంథియా పెరట్లోంచి వెళ్ళింది. పదినిమిషాలలో బయటికొచ్చింది.

” గుర్రం బండీ  తయార్ – ధర ఒక్క బంగారు నాణెం ” – ఉత్సాహంగా వెల్లడించింది.

” ఎలా చేశావు ? ఎలా ? ” – సిరిల్ ఆత్రంగా అడిగాడు.

” జేబుల నిండా బంగారం ఉందని చూపించలేదు నేను – అలుసైపోతాం అలా అయితే. ఒక్క నాణెం విడిగా పట్టుకు వెళ్ళాను. ఒకతను గుర్రానికి మాలీస్ చేస్తున్నాడు. అతనికి చూపెట్టాను. అటూ ఇటూ తిప్పి చూసి వాళ్ళ నాన్నని పిలిచాడు. స్పేడ్ నాణాలు అంటారట వాటిని, ఆయన చెప్పాడు. అది అచ్చం గా నాదేనా అని అడిగాడు. పూర్తిగా నాదేననీ, మనల్ని రోచెస్టర్ తీసుకెళ్తే అది ఇచ్చేస్తాననీ చెప్పాను. ఒప్పుకున్నాడు. అయిదు నిమిషాల్లో బండి వస్తుందట ”

ఆ గతుకుల దారి వెంబడి బగ్గీలో వెళ్ళటం కొత్త కొత్తగా ఉంది. కొత్తవి అన్నీ బావుండాలనేం లేదు, ఆ విహారం బావుంది కూడానూ. పిల్లలు ఎవరికి వాళ్ళు తమ డబ్బుతో ఏమేం కొనుక్కోవాలో ఊహించుకుంటున్నారు. పైకి ఎవరూ ఏమీ అనటం లేదు – బండి అతనికి తెలిసిపోకూడదు కదా. ఎట్టకేలకి రోచెస్టర్ చేరారు. పిల్లలు అడిగినట్లుగా బండి అతను వాళ్ళని వంతెన దగ్గర దిగబెట్టాడు.

” గుర్రం బండి కొనాలంటే ఎక్కడ దొరుకుతుంది ? ” – సిరిల్ ఆయన్ని అడిగాడు.

” సరాసెన్స్ హెడ్ లో.  బిల్లీ పీస్మార్ష్. గుర్రాల గురించి ఇంకా బాగా తెలిసినవాడూ వాడికన్నా మర్యాదా మట్టసం ఉన్నవాడూ మరొకడు ఈ భూమ్మీద లేడు. ఉండడు ”

” మంచిది. వెళ్ళొస్తాం ”

 

*****

 

ప్రపంచపు నియమాలన్నీ తల్లకిందులుగా నడుస్తున్నట్లు పిల్లలకి అనిపించింది. డబ్బు ఖర్చుపెట్టటమంత తేలిక పని ఇంకోటి లేదని పెద్దవాళ్ళు అంటుంటారు కదా – ఒక్క నాణెం ఖర్చుపెట్టేందుకు తాతలు దిగొస్తున్నారేమిటో ? కొట్టువాళ్ళంతా కూడబలుక్కున్నట్లు ఆ డబ్బులు మాకొద్దంటే మాకొద్దంటున్నారు. వాళ్ళలో వాళ్ళు ‘ మాయబంగారం ‘ అని గొణుక్కోవటం కూడా పిల్లల చెవులబడింది. ఆ పొద్దుటే ఆంథియా చూసుకోకుండా తన టోపీ మీద కూర్చుండిపోతే అది కాస్తా తప్పడం ఐపోయిది. అందుకని కొత్త టోపీ కొనుక్కుందామని బేరం చేసింది. గులాబీపువ్వులూ నీలిరంగు నెమలి పింఛాలతో ఎంతో అందం గా ఉంది. మూడు గినియాలు అట. ఆంథియా తీసి ఇవ్వబోయింది. అవి తీసుకుంటూ కొట్లో ఆడమనిషి ఆంథియాని ఎగాదిగా చూసి లోపలికి పోయి ఇంకో పెద్దావిడని వెంటబెట్టుకొచ్చింది. ఇద్దరి మొహాలూ చిరచిరలాడుతున్నాయి.

” నావే ఇవి. నా సొంతం ” అని ఆంథియా భరోసా ఇచ్చింది.

ఏం లాభం లేకపోయింది. ” ఇవి ఇప్పుడెవరూ వాడట్లేదు. మేం తీసుకోం , పట్టుకుపో ” అనేశారు వాళ్ళు.

ఆంథియా తన చేతులు మురికిగా ఉండటం వల్లనే అలా అయిందనీ గ్లవ్స్ కొని తొడుక్కుంటే సరిపోవచ్చనీ అభిప్రాయపడింది. సరే, ఒక చిన్న కొట్టుగా చూసి  వెళ్ళి ఇద్దరు అమ్మాయిలకీ గ్లవ్స్ కొన్నారు. ఆరు పెన్నీ ల చిల్లర. బంగారు నాణెం ఇస్తే ఆవిడ దగ్గర చిల్లర లేదంది. మళ్ళీ సిరిల్ డబ్బులే ఇవ్వాల్సి వచ్చింది- పాపం ఆ డబ్బులతో కుందేళ్ళు కొనుక్కుని పెంచుకుందామని పోగుచేసుకుంటున్నాడు. ఇంకా చాలా కొట్లు తిరిగారు. బొమ్మలు, అత్తరు సీసాలు, పుస్తకాలు, పట్టు జేబురుమాళ్ళు, పెన్ లూ పెన్సిల్ లూ – ఏవి అమ్మే కొట్లోనూ వాళ్ళ డబ్బులు తీసుకోలేదు ఎవరూ. తిరిగీ తిరిగీ పిల్లలకి విపరీతం గా ఆకలేసింది. తినుబండారాల కొట్లలోనూ అదే పరిస్థితి. ఇక ఇది పని కాదని – ఒక బేకరీ ఖాళీ గా కనిపిస్తే దూరిపోయి చేతికొచ్చినన్ని బన్ లూ కేకులూ తినటం మొదలెట్టారు. లోపలేదో పనిలో ఉన్న కొట్టు అతను బయటికొచ్చి ఇంత గొంతేసుకుని మీద పడ్డాడు. . ‘ ఇదిగో ‘ సిరిల్ ఒక నాణెం ఇస్తే తీసుకు చూసి ” పొండి ” అన్నాడు. ” మరి చిల్లర ? ” – సిరిల్.

” చిల్లరా ఇంకేమన్నానా ? ఎక్కడ కొట్టేశారో ఏమో – పోలీసులకి అప్పజెప్పనందుకు సంతోషించండి ”

తినటం పూర్తయాక పిల్లలకి కాస్త ఓపికొచ్చింది. కాని గుర్రం బండి కోసం బిల్లీ పీస్ మార్ష్ దగ్గరికి వెళ్ళటానికి అబ్బాయిలకి ధైర్యం చాలలేదు.  అయితే – జేన్ ది మంచి ఆశావహ దృక్పథం. ఆంథియా మహా మొండిది. అంచేత వెళ్ళక తప్పలేదు.

ఆ పాటికి అందరివాలకాలూ పరమ ఏబ్రాసి గా తయారయాయి. అలాగే పడిపోయి చెకర్ సత్రం చేరారు. వసారా లో ఎదురైన మనిషే సాక్షాత్తూ బిల్లీ పీస్ మార్ష్. ఈసారి అడిగే వంతు రాబర్ట్ ది.

” మీదగ్గర మంచి మంచి గుర్రాలూ బళ్ళూ దొరుకుతాయని విన్నామండీ ”

” ఆ. మీరు విన్నది నిజమే ”

” ఒకసారి చూడచ్చా అండీ  ? ”

” ఏం, కొంటారేమిటి ? ”

” అవునండీ ”

” ఎకసెక్కాలుగా ఉందా ? ఎవరైనా చీటీ ఇచ్చి పంపారా, పోనీ ? చూపించండి ”

” చీటీ అదీ ఏం లేదండీ. మేమే కొంటాం ”

ఏమనుకున్నాడో ఏమో ” ఒరేయ్ విలియం ” అని కేకేశాడు. విలియం వచ్చాడు. ” చూడ్రా – ఈళ్ళందరూ మన గుర్రాలు చూస్తారట. చూపెట్టేయ్ పాపం పిల్లలు – సరదా పడుతున్నారు. నిండా రెండు పెన్నీలైనా జేబులో ఉన్నట్లు లేవు ”

రాబర్ట్ కి రోషం వచ్చింది. తక్కినవాళ్ళు వెనక్కి లాగుతున్నా వినకుండా ”రెండు పెన్నీ లు కాదు – మా దగ్గర ఇం – త బంగారం ఉంది – అందరి దగ్గరా ” – జేబుల్లోంచి తీసి చూపెట్టాడు.

అవి చూసి బిల్లీ – ” చిత్తంయువరాజా, మీకేం కావాలి ? ” అని అడుగుతాడనేమీ పిల్లలు అనుకోలేదు గాని –

” ఒరేయ్- ముందా బయటి తలుపు ముయ్యండ్రా. వెనకనుంచి ఎవరోకరు పోయి పోలీసులని పిలుచుకురండి ” అనేసరికి అందరికీ గుండెలు జారిపోయాయి.

” వద్దండీ. ఇదంతా మాదే. దొంగిలించింది కాదు. పోలీసులని పిలవద్దు ” – ఏక కంఠం తో అరిచారు.

” అలాగా. అయితే అదంతా ఇక్కడ పెట్టండి ముందు. పోలీసుల మాట తర్వాత ఆలోచిద్దాం ”

” ఇది అన్యాయమండీ. మా ఊళ్ళో ఒకాయన మీరు చాలా మర్యాదస్తులని చెప్పారు ”

” మర్యాదస్తుడిని కనకే మంచిగా అడుగుతున్నా. ఆడపిల్లల్ని కూడా ఇందులోకి లాగారు కదరా. సర్లే, వాళ్ళని వదిలేస్తా – అబ్బాయిలిద్దరూ నాతో పోలీస్ స్టేషన్  కి రండి  ”

” మేమెక్కడికీ వెళ్ళం. వాళ్ళతోబాటే ఉంటాం. అసలు నీకు బుద్ధుందా లేదా ” – జేన్ వీరోచితం గా నోటికొచ్చినట్లు తిట్టటం మొదలెట్టింది.

ఆశ్చర్యమేమిటంటే బిల్లీ పీస్ మార్ష్ కి రావలసినంత కోపం రాలేదు. కాస్త మెత్తబడ్డట్లు కూడా గోచరించాడు.

జేన్ కి కొంచెం ఆశ కలిగి – ” ఇవన్నీ మా ఇంటి పక్కన కంకర గుంట లోవి. దాని నిండా ఇవే ఉన్నాయసలు. మాకు ఇసక యక్షిణి ఇచ్చింది. రోజుకో కోరిక తీరుస్తుంది. దాని ఒంటి నిండా బొచ్చుంటుంది…..”

బిల్లీ మొహం నిండా జాలి.

” ప్చ్. పిల్ల చూస్తే బానే ఉంది, మతి సరిగా లేనట్లుంది. ఇట్టాంటి పిల్లని కూడా ఇందులోకి లాగారేంట్రా ”

” దానికేం పిచ్చి లేదు. ఇసక యక్షిణి నిజం గానే ఉంది. ఈసారి నీకు కళ్ళు పోవాలనో కాళ్ళు విరగాలనో  కోరుకుంటాం చూడు ” – ఆంథియా శాపనార్థాలు.

వంకర గా నవ్వుకుంటూ విలియం ఇద్దరు పోలీసులని వెంటబెట్టుకొచ్చాడు. నాలుగు ముక్కల్లో అంతా వివరించబడింది, జేన్ కి పిచ్చి అని కూడా.

వాళ్ళలో పెద్ద పోలీసాయన పెదవి విరిచాడు – ” ఏం పిల్లలో , మరీ మితిమీరిపోతున్నారు. సరే, చేయాల్సింది చేస్తాం. పిచ్చిపిల్లని ఆస్పత్రికీ ఇంకో పిల్లని శరణాలయానికీ – మగపిల్లలని బోర్ స్టల్  బడికీ పంపిస్తాం. ”

కోపం తో భయం తో పిల్లలకి నోట మాట రాలేదు. ఇద్దరు పోలీసుల మధ్యనా వీధుల్లో నడుస్తున్నారు. అటూ ఇటూ చూసేందుకు సిగ్గేసి తలలు దించుకుపోతున్నారు. రాబర్ట్ ఒకడే కాస్త తలెత్తుకుని ముందు నడుస్తున్నాడు.

” ఓర్నాయినో, రాబర్ట్ లాగుందే- ఏమయిందిరా దేవుడో ” అనే పొలికేకలూ, ” దాబ్త్ – దాబత్ – ఎత్తుకొ ” అనే బుల్లి మాటలూ ఒకే సారి గాల్లోకి వెలువడ్డాయి. చూస్తే ఏముంది – మార్తా, పాపాయీ.

మార్తా చాలా ఉదాత్తం గా ప్రవర్తించింది. బిల్లీ మార్ష్ మాటలూ పోలీసాయన అనేవీ – వేటినీ నమ్మలేదు. తీవ్రం గా ఖండించింది. జేబుల్లోంచి బంగారం తీసి చూపెట్టినా , ” ఏముందక్కడ ? ఏం లేదే ? చిన్నపిల్లల్ని చేసి కచ్చ సాధిస్తారా ఏం ? ఏం పుట్టింది మీకు ? – అనే అంటూ వచ్చింది. తమని కాపాడేందుకే అయినా అంత పెద్ద అబద్ధాన్ని ఎలా ఆడుతోందా అని పిల్లలకి సందేహం. మెల్లగా అసలు సంగతి వెలిగింది. శామీడ్ ని అడిగారు గా – ఏ వరం అయినా మార్తా కి కనిపించకూడదని. అదీ సంగతి !

పోలీస్ స్టేషన్ చేరేసరికి సూర్యాస్తమయం అయింది. చీకటి పడుతోంది. అక్కడ కూచున్న ఇన్స్పెక్టర్ కి పెద్ద పోలీసాయన కథంతా చెప్పాడు.

” ఏదిరా, తియ్యండి. జేబులు చూపెట్టండి ”

సిరిల్ జేబుల్లో చేతులు పెట్టాడు. పెద్ద పెట్టున నవ్వొచ్చింది అతనికి. అది సంతోషం తోనో బాధ తోనో చెప్పటం కష్టం. జేబులు ఖాళీ. అందరి జేబులూ అలాగే ఖాళీ. చీకటి పడితే అంతా అదృశ్యమైపోతుందిగా – అదే జరిగిపోయింది.

” ఆహా ” ఇన్స్ పెక్టర్ పోలీసులనీ వెంట పడి వచ్చిన బిల్లీ మార్ష్ నీ చురా చురా చూశాడు.

” నా కళ్ళతో నేను చూశానండీ- ఇంతకు ముందే. ఎలా మాయం చేశారో కుర్ర వెధవలు – ”

మార్తా ఉగ్రురాలైపోయింది. మాటలు జాగర్తగా రానియ్యండి. మంచి కుటుంబం పిల్లల్ని పట్టుకుని ఒట్టి పుణ్యానికి యాతన పెట్టింది చాలక ఇంకా నోరు పారేసుకుంటారా ? మీ సంగతి పైవాళ్ళకి ఫిర్యాదు చేయిస్తా, మాకూ తెలిసినవాళ్ళున్నారు. అరె- చెప్తూనే ఉంటినే ఒక పక్క…”

” చూడమ్మా, పిల్లల్ని తీసుకెళ్ళిపో – తక్షణం ” అని వీలైనంత మెత్తగా చెప్పి

” మరి మీసంగతీ ? ” అని ఒక్కరుపు అరిచాడుఇన్స్ పెక్టర్.

 

****

బండి మాట్లాడి అందర్నీ అందులో కూలేసింది మార్తా. అప్పుడింక అందర్నీ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది, చెప్పకుండా రోచెస్టర్ దాకా పడివచ్చినందుకు. ఒక పూటంతా లక్షాధికారులైనవాళ్ళు అతి దీనం గా నిద్రకు ఉపక్రమించారు – అన్నాలు తిన్నాక.

మరసటి రోజు గుర్రం బండి అద్దెకిచ్చినాయనకీ, వీళ్ళు బన్నులూ కేకులూ తిన్న చోటికీ డబ్బులు పంపారు జేన్, ఆంథియా. వాళ్ళు పోగేసుకున్నది అది – పాపం. మరి ఆ ఇద్దరికీ ఇచ్చిన నాణాలూ మాయమైపోయి ఉంటేనో ???

 

[ ఇంకా ఉంది ]

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s