సానుమత్ ప్రఫుల్లం – మైథిలి అబ్బరాజు

” పర్వతాలతో అంతే ఎప్పుడూ. వాటితో ఏమాత్రం కాలం గడిపినా ఇక వాటికి చెందిపోతాము – తప్పించుకుందుకు లేదు ” అంటారు రస్కిన్ బాండ్. ముసోరీ ఆయన స్థిరనివాసం. ఇష్టమైన చోటనే , ఇష్టమైన పనే చేస్తూ జీవించగలగటం ఒక సాధన. అదృష్టం కన్నా కూడా ఎంపిక అందుకు ముఖ్యం. అలాగ గొప్పవాడు ఆయన.

దేహానికీ  మనస్సుకూ ప్రకృతికీ  లంకె . ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా.కొందరికి సముద్రం. కొందరికి కొండలూ అడవులూ. కొందరికి పక్షులూ జంతువులూ.

నాకైతే  గుండెనెప్పుడో కొండలు లాక్కున్నాయి.  పదిహేడు పద్దెనిమిదేళ్ళప్పుడు  – నవంబర్ లో , వాయుగుండపు రోజుల్లో  – అరకు లోయకి వెళ్ళినప్పుడు అదొక మహా విభ్రమం. అంతంత ఆకుపచ్చ , అంతలేసి చలిగాలులు – అది ఇంకేదో లోకం. పసుపుపచ్చ వలసపూల సాంద్రమైన కెరటాలు..

తర్వాతి కాలంలో – వేసవి విడిదుల మహారాణి ఊటీ, రాజకుమారి కొడై – ఇంకొన్ని – దేనికీ ఎండల్లో వెళ్ళలేదు . వాటి వైభవం శరత్ హేమంతాలలో, సౌందర్యం వర్షాకాలం లో.

అనేకానేకమైన చీకాకుల మధ్యలోంచి , తెగించి – మొన్నీమధ్యన. ఎటువంటి లాలనకూ ఎదురు చూడకుండానే , కదిలి వెళ్ళాం.  కాని  కొండలకి ఎంత కరుణని … శుభ్రం చేసిచ్చాయి నన్ను.

ఎక్కువ తాకిడి  ఎరగనిది  యార్కాడ్ . ఏరు, దానినానుకుని కాడు [ అడవి ] – ఆ పేరు అని విని ఆశైతే కలిగిందిగాని వేడి సెగల సేలం లో దిగినప్పుడదేమీ లేదు. ముప్ఫై రెండు కిలోమీటర్ లలో అంత గొప్ప మార్పేముంటుందో – . నిట్ట నిలువు పర్వతాలవి. తూర్పు కనుమల భాగాలట. అక్షరాలా ఇరవై హెయిర్ పిన్ మలుపులు. పదిహేను దాటాక – అప్పుడు , అడవి వాసన. అమ్మయ్య !  ఆకులూ పువ్వులూ నీటి సెలలూ కలిపి వచ్చే పసరు పరిమళం – మరింకెక్కడా రాదు, ఏ అత్తరు సీసాలోకీ.

అంతర్జాలం లో ఫోటోలు , రివ్యూ లు చూసుకుని వెళ్ళదలచిన రిసార్ట్ – ఆ చిన్న ఊరి చివరన . కార్ దిగుతూనే చుట్టుముట్టిన నిశ్శబ్దం. రాత్రి తొమ్మిదిన్నర . మసక వెన్నెట్లో అటూ ఇటూ – అలముకున్న  శ్యామలవర్ణం … నలుపు కలిసిన ఆకుపచ్చ . ఎక్కువ దీపాలే లేవు – ఉన్నవీ ధగధగలు కావు. మూడు నాలుగు  ఎకరాల మేర చెదురు చెదురుగా వసతి గదులు. మౌనాన్ని చెదరగొట్టని ధ్వని ఏదో , మెల్లి మెల్లిగా చెవులలోకి. నీటి శబ్దమని  అర్థమైంది. అవును, సెలయేరే – ఆనుకునే .  అర్ధ చంద్రాకారపు గది, తోటలోకి కిటికీలు. తొందరగా నిద్రలోకి.

పిట్టల అరుపులకి కళ్ళు విప్పటం సుకృతాలలో ఒకటేమో. ఎవరూ ఉన్నట్లేం లేదు, ఉన్నపాటునే నీళ్ళవైపుకి . అది సహజమైన వాగే.. దాన్ని ఇముడ్చుతూ రిసార్ట్ కట్టారట. ఏర్పరచారని ఊహిస్తామేగాని పెద్ద బండరాళ్ళ నుంచి గులకరాళ్ళ బాటల వరకూ ఏదీ కృత్రిమంగా లేదు. పైన్ , వెదురు కొమ్మలలోంచి తల ఎత్తే  ఆకాశం కావలించుకుంటూ.

ముప్ఫై రెండు మలుపుల దారి అని ఉందట. యార్కాడ్ సరస్సు దగ్గర మొదలై , కొండల మెలికలలోంచి అరవై ఎనిమిది పల్లెటూళ్ళు చుట్టి తిరిగి అక్కడికే వస్తుందట. బయల్దేరాం.  బ్రతికి ఉన్నందుకు సంతోషించే ప్రయాణమది. నీడలు తేలే మహావృక్షాలు, మధ్యన సిల్వర్ ఓక్ లు, వాటికి ఒద్దికగా అల్లుకుపోయే మిరియపు తీగలు, నేలమీదని ఎడమెడంగా కాఫీ మొక్కలు. రెండు మూడు చోట్ల దిగిపోయి ఉత్తినే చూస్తుండిపోయాను. డ్రైవర్ , పాపం – తమిళ సినిమా పాటలు వినబోయాడు , బిక్కుబిక్కుమనిపించి కాబోలు. వద్దని అర్థిస్తే విన్నాడు గాని ఏమీ అర్థం అవలేదు ఎందుకో – నాకెందుకు ! వన్య మృగాల మొహాలలో ఉంటుంది ఒక ‘ మనిషి పట్టని తనం ‘ – ఆ కొండల తలాలలో కూడా. అరణ్యమధ్యం లో ఎవరో స్వామీజీ సుమేరు శ్రీచక్ర దేవాలయమొకటి కట్టారు. పక్కనే గుబురు గా అడవి. అంతెత్తున పనస , టేకు చెట్లు. మార్మికం గా , అతి గంభీరంగా .  అక్కడ కొండమ్మ  కి గుడి ఉండటం లో ఔచిత్యం అంతా ఉంది. ఒకరిద్దరు తప్ప లేని ప్రాకారం లో , నిజం – శక్తి ఏదో అందుతూన్నట్లే ఉండింది. నాకు , అంత శ్రద్ధాసక్తులు లేనిదానికి.

మర్నాడు కిలియూరు జలపాతానికి. ఎన్ని మెట్లు ఎక్కి దిగామో. ఫెళ్ళుమని పడుతోంది లోయలోకి – ఆ కాహళి ఎంత దూరానికో వినబడుతూ. నడిచీ నడిచీ – అబ్బా…అప్పుడయింది దర్శనం. ఏమాత్రం ధూళి కలవని  తెలుపు. అంచ రెక్కల తెలుపు. లక్షల జాజిపూవుల గుమ్మరింత. మందాకిని ఇట్లాగే కోటి రెట్లుగా భాగీరథి అయిఉండునా !

భవానీ సింగ్  అత్తరువుల దుకాణం లో చందన తైలం సీసాలు , కొన్ని ఇంటి పట్టు చాకొలెట్ లు. అంతే – చేసిందంటూ.

ఏమీ చేయకపోయేందుకే అసలీ యాత్ర.

బైసన్ వుడ్స్ రిసార్ట్ లో రాత్రులది చాలా అందం. తోటలో అక్కడక్కడా  మినుకుమనే లాంతరులు , కీచురాళ్ళ పాటలు. రోజూ కిటికీల బయట వాన. ఆగకుండా , తెల్లారేదాకా . ఆ చప్పుడు లో మేలుకోవచ్చు, నిద్రపోవచ్చు  …రెంటికీ మధ్యనా  ఉండ వచ్చు-

స్వప్నాలకీ సాక్షాత్కారాలకీ సరిహద్దుల లో.

[painting : Elizabeth Fraser ]

12 Comments

 1. Lovely mam.Your write up reflecting the intensity you felt.We too visited Yarcad.It is the place for Winter.As you said Ooty is my best choice.While depecting of nature and feel is marvelous like GEETHA DEVI.All the Best.

  Like

 2. అక్షర చిత్రం అంటే ఇదేనేమో..
  అక్కడికెళ్లి తీరాలనిపించేలా రాశారు.. 👌👌👌

  Like

 3. “ఏమీ చేయకపోయేందుకే అసలీ యాత్ర.”
  అద్భుతః . కొండ ని అద్దం లో చూపించారు … బహు గొప్పగా ..!!
  సానుమత్ ప్రఫుల్లం – బలే అన్నారే !!!

  Like

  1. అవునా….బావుందా !!! కాళిదాసు శ్లోకంనుంచి అప్పు తెచ్చుకున్నానయ్యా . థాంక్ యూ !!

   Like

 4. మీరు దెనిగురించి రాసినా అది కలువల సరస్సు కావచ్హు,విస్వనాధగారి సాహిత్యం కావచ్చు ఇప్పుడీ తూర్పుకనుమల యాత్రైనా ఒక పదచిత్రం అలా ప్రత్యక్ష్మం అవుతుంది.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s