బాబాయ్ – అబ్బాయ్ – స్వాప్నిక్ చీమలమర్రి

“ఏరా పొద్దున్నుంచి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళొచ్చావ్?”

 

“ సినిమాకెళ్ళాను బాబాయ్.”

 

“ఎలా ఉందేవిటి?”

 

“ఏమో నాకు నచ్చలేదు.., ఎందుకో ఇంకొంత బావుండచ్చనిపించింది.”

 

“ఏది ఒకసారి కథ చెప్పు,”

 

ఒక పది నిమిషాల తరువాత,

 

“సినిమా బాలేందంటావ్ అయితే.., సినిమా ఎలా ఉంటే బావుంటుందంటావ్?.”

 

“డైలాగ్స్ అస్సలు బాలేవు బాబాయ్, డైరక్షన్ పూర్, స్క్రీన్ ప్లే అవకతవకగా ఉంది, కథ, ఆక్టర్స్..”

 

“నువ్వు చెప్పినవన్నీ కరెక్టే, కానీ వరస మాత్రం తప్పు. మొదటిది కథ, రెండు స్క్రీన్ ప్లే, ఆ తరువాత డైరెక్షన్, ఆ తరువాత డైలాగ్స్.”

 

“కొన్ని సినిమాలు కథ లేకపోయినా బోర్ కొట్టవ్, కొన్ని పెద్ద కథ ఉన్నాసరే ఎప్పుడెప్పుడు బయటికి వచ్చేద్దామా అని ఉంటుంది. ఒక కథ బావుందో లేదో, ఎలా తెలుస్తుంది బాబాయ్.”  

 

“ఆ గ్రహణశక్తీ మనకి తరతరాలుగా వస్తోందిరా అబ్బాయి.. బాష పుట్టిందే కథ కోసం. చిన్న ఆట ఆడుకుందాం. సరే, నువ్వు పొద్దునుంచీ చేసిన కార్యక్రమాలన్నీ ఒకసారి కథలా చెప్పు..”

 

“పొద్దున్నే లేచి, స్నానం చేసి, ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకెళ్ళాను, అక్కడ కొంచెం తినేసి, ఇదిగో ఇంటికి వచ్చి నీతో మాట్లాడుతున్నా.”

 

“బావుంది, అవసరం అయిన  విషయాలు మాత్రమే చెప్పావు, నీ కోణం నుంచి చెప్పావు, ఎలా జరిగాయో అదే క్రమంలో చెప్పావు. కానీ ఇది సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది?”

 

“బాగోదు, ఇది సినిమా ఏంటి. నేను కూడా చూడను..”

 

“ఎందుకు?”

 

“ఇందులో ఏముందని! అందరికి జరిగేదేగా!”

 

“అది, వచ్చేసావ్ దారికి, ఒక కథకి హీరో (protagonist) ఎంత ముఖ్యమో, వాడి గమ్యం అంత ముఖ్యం. ఆ గమ్యం (Goal) ఎంత ముఖ్యమో మధ్యలో తగిలే అడ్డు (Obstacle)అంత ముఖ్యం. ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినదాంట్లో, నువ్వు హీరోవి, నీ గమ్యం సినిమా థియేటర్ కి వెళ్ళటం, కానీ నీకు అడ్డు ఏది, కథలో డ్రామా ఎక్కడుంది?”

 

“డ్రామా ఉండటం అంటే మసాలానా బాబాయ్?”

 

“మసాలా, పోపు దినుసులు, తిరగమాత కాదు. డ్రామా అంటే నీకు ఎదురయ్యే చిత్రవిచిత్రమైన పరిస్థితులకి నువ్వు పలికించే నవరసాలు.”

“ఏమీ అర్థం కాలేదు బాబాయ్.”

 

“ఇలారా చెప్తా, ఇప్పుడు పొద్దున్నే బైక్ మీద వెళ్తున్నావ్, ఒద్దులే, రాత్రి సెకండ్ షో చూసి ఇంటికి వస్తున్నావు, బైక్ వద్దు, కారులో అనుకుందాం. నీ ముందు ఒక ఆక్సిడెంట్ అయ్యి ఒకడు పడిపోయాడనుకో. నువ్వు అతనిమీద జాలి పడి నీ కారులో ఎక్కించుకున్నావనుకో,.. ”

 

“బావుంది, కానీ అది కూడా అందరు చేసేదేగా,”

 

“అవును కదా, ఇప్పుడు నువ్వు హాస్పిటల్ కి వెళ్తున్న దారిలో, వాడు నీకు ఒక గన్ పెట్టి నిన్ను కిడ్నాప్ చేస్తే..”

 

“ఇదేంటి బాబాయ్ ఇలా తిప్పేసావు కథని? కిడ్నాప్ ఏంటి మధ్యలో?”

 

“ఆ, తిరిగింది చూసావా, దీన్ని Inciting Event అంటారు, ఇది సినిమా మొత్తానికి వెన్నెముకన్నమాట. ఇది మొదలైన దగ్గర నుంచి, సినిమా అంతా దీనిమీదే తిరుగుతుంటుంది. అంటే తరువాత జరగబోయే విషయాలన్నీ-  పోలీసులు, నిన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు , నువ్వు బయటికి రావటం – అలా. “

 

“నన్నెందుకు కిడ్నాప్ చేస్తాడు బాబాయ్, నా దగ్గరేముంది కొత్తిమీర కట్ట.”

 

“కరెక్ట్, నిన్నెందుకు కిడ్నాప్ చెయ్యాలి? అంతమంది కార్ల వాళ్ళు నీ ముందు వెళ్ళుంటారు, కానీ నిన్నే ఎందుకు? అంటే, నీ కథ మాకు తెలియాలి కదా? దీన్ని Exposition అంటారు. అంటే నువ్వు ఎవరు, నీ ఫ్రెండ్స్, మీ నాన్న, నీ కాలేజీ గట్రా విషయాలు అన్నమాట.”

 

“అంటే రింగులు తిప్పి ఫ్లాష్ బ్యాక్ అని వేస్తారు ఆలనా?”

 

“ఆ.. అది తెలిస్తే కథకి ఒక కొత్త రూపం, నీగురించి వేరే కోణం తెలుస్తాయన్నమాట. ఇప్పుడు నువ్వు కిడ్నాప్ అయ్యావు, నిన్ను ఒక దగ్గర దాచారు. నీకు అంతా గందరగోళంగా ఉంది. నీ ముసుగు తియ్యగానే నువ్వు చూసిన మొదటి వ్యక్తి నీ ఫ్రెండ్.”

 

“నా ఫ్రెండ్ నన్ను కిడ్నాప్ చేశాడా? ఎందుకు? ఇక్కడ ఇంటర్వెల్ ఆహ్?”

 

“అబ్బే, అప్పుడే. దీన్ని ప్లాట్ పాయింట్ (Plot Point 1) అంటారు, అంటే నిన్ను ఎవరు కిడ్నాప్ చేసారో తెలుసు, కానీ ఎందుకో తెలీదు. ఇది తెల్సుకుంటావు సినిమా ముందుపోయే కొద్దీ..”

 

“అవునా, అయినా నా ఫ్రెండ్ నన్నెందుకు కిడ్నాప్ చేసాడు?”

 

“ఇంకాస్త వివరంగా చెప్తా.. ..ముందు వెళ్ళి అన్నం తినిరా!”

 

(వచ్చే నెలనుంచి ఇంకాస్త వివరంగా)

 

12 Comments

  1. బాబాయ్ తో పనే కాదు … సినిమా గురించి ఎన్నో తెలియని విషయాలు సరదాగా చెప్పాడు …. ఇంకో భాగం ఎప్పుడో ?

    Like

  2. Good.Interesting start.New approch with sharing the finer points on cinema making.seems that did some home work.Looking forward for exciting ones.All the best sir

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s