చీకటి ( కథ ) – స్వాప్నిక్ చీమలమర్రి

చుట్టుపక్కల చీకట్లకి అంటకుండా వెళ్తోంది బస్సు.  మేఘాలు పొగరుగా కురుస్తున్నాయి. ఎక్కడో దూరంగా ఉరిమిన చప్పుడు, డ్రైవర్ గుండెలో బెదురులా ప్రతిధ్వనించింది. అద్దం పైన నీటి బొట్లు తోకచుక్కల్లా రాలుతున్నాయి. బస్సు వేగాన్ని, చినుకుల్ని , తుడిచెయ్యటానికి వైపర్లకి ఒక్క క్షణం పట్టలేదు. ముందున్న వెలుగు త్రోవ చూపడం మానేసి, హెచ్చరించడం మొదలుపెట్టింది. ధైర్యం చమటలాగా తప్పించుకుంటోంది. లేని దర్జాతో మొండిగా కదులుతోంది బస్సు. డ్రైవర్ కి ఏమీ పాలుపోక, పక్కన గేర్ బాక్స్ తో ఆడుకుంటున్న పిల్లాడిని గట్టిగా ఒక బూతుకేక వేశాడు. ఏదో లోకాల్లో ఉన్న జనం, ఒక్కసారిగా కళ్ళు, నోళ్లు ముందుకి తిప్పారు. కిటికీ బయటున్న చిక్కటి అంధకారం మనసుల్లోకి పాకింది. పెద్ద గుంటలో పడబోయిన టైరుని రక్షిద్దామని, డ్రైవర్ ఒక్కసారిగా పక్కకి తిప్పాడు. లోయలో లీనమైపోతోంది బస్సు. నా చెవుల్లో న్యూటన్స్ క్రేడిల్ శబ్దం మొదలైంది. క్లిక్.. క్లిక్.. క్లిక్..

చచ్చిపోయే ముందు జీవితం అంతా ఒక్కసారి  కళ్ళముందు కనపడుతుందంటారు, నాకు కనపడింది మాత్రం ఒక కవి జీవితం. ఎందుకు పుట్టాడో? ఎందుకు రాశాడో తెలియని,  తెలుసుకోవాలని కూడా లేని  కవి జీవితం. బాధల ఎడారుల్లో దూరంగా కనపడే ఆనందపు ఎండమావులవైపుకు, తడి ఇసుకతిన్నెలమీద పడిన అడుగులు క్షణమైనా లేవనే దుఃఖం వైపుకు, మెడకి బిగుసుకుంటున్న వ్యసనాల గొలుసుల తాళంచెవుల నిధి వైపుకు. ఒక కటిక చేదుని తీపని భ్రమ పడే జనాల వెర్రితనానికి అవతల వైపుకు, నడిచిన, పరిగెత్తిన, రొప్పుతూ కుంగిపోయిన ఒక కవి జీవితం.

క్లిక్.

“ఇప్పటికి నాలుగు పుస్తకాలలో పిచ్చి గీతలు గీసేసావ్, ఇంక  నేను కొనను” నాకు పెన్సిల్ పట్టుకోవడం  వచ్చాక వినపడిన మొదటి మాటలు. తెల్లకాయితాల మీద ద్వేషం నాకు. మాట్లాడవని.  ఎవరికీ అవసరంలేని తెలుపు ఎందుకు.  కొద్ది రోజులకి ఆ తెల్ల మేఘాల మధ్య నల్ల ఇంద్రధనుస్సులు విరిగాయి. అక్షరాలు. చదవటం వచ్చింది.  ఆ నలుపులోని ఒక్కో రంగుని విభజించడానికి ఇంకొన్ని నెలలు పట్టింది. సృష్టించడానికి, సంవత్సరాలు పట్టింది. “చెట్లు పచ్చగా ఉండును, ఆకాశం నీలంగా ఉండును.” వంటి అబద్ధాలు వింటూ, పదే పదే, మోసపోయాను.  చెట్లు ఒక్కో ఋతువులో ఒక్కోలా ఉంటాయి. ఆకాశం ఈ క్షణం ఉన్నట్టు మరు క్షణం ఉండదు .

క్లిక్.

“రేయ్! ఆడుకుందాం రారా! అక్కడేం చేస్తున్నావ్!” మావిడితోపులో నా స్నేహితులు ఆడుకుంటుంటే, మొదటిసారి నేను చూసిన చిత్రం ఇప్పటికి నాలోపల చెరిగిపోలేదు. పల్చటి మామిడి ఆకుల మధ్యనుంచి ప్రకాశించిన సూర్యకాంతి ఆకుపచ్చగా మారింది. ఆ క్షణం ఆ ఆకుని అయిపోవాలనిపించింది, ఆ సూర్యకాంతిని తాకుతున్న  ఆకుల నుంచి మనిషిని చూడాలనిపించేంత. ప్రకృతిలో ఎప్పుడూ రెండు శక్తులు, ఒకటి అన్నీటినీ ఏకం చేసే శక్తయితే, అన్నిటిని విడిగా ఉంచే శక్తి ఇంకొకటి. ఏ అనర్థాలైనా జరిగేవి, వీటి మధ్య ఉన్న విరోధం వల్లనే. యుగాలు మారే కొద్దీ, ఆ విరోధం బలమై, అనర్థాలు పెరుగుతుంటాయి.

క్లిక్.

చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా సున్నితం, ముద్దుచేయకపోతే చిన్నబుచ్చుకుని ఎటో వెళ్లిపోతాయి. రెండో తరగతి సైన్స్ పిరియడ్, డబల్ రూల్ పుస్తకంలో, నేను రాసిన మొదటి కవిత. అది చూసిన మా సైన్స్ టీచర్ ఏమి చెయ్యాలో అర్థంకాక నన్ను కొట్టి క్లాస్ బయటికి పంపించింది. ఆవిడ కళ్ళలోని భయం, కంగారు ఇంకా గుర్తున్నాయి. భయం ఎందుకు? క్లాస్ విననందుకు కోపం కదా రావాలి? వ్యత్యాసాన్ని (Contrast) తట్టుకునే శక్తీ ఉండదు కొంతమందికి. ఏడేళ్ల  పిల్లాడు రాసే కవితమీద జెలసి. దాన్ని వెంటనే హాస్యం చేసెయ్యాలి. నలుపుకి తెలుపుకి మధ్య ఉన్నది కాదు వ్యత్యాసమంటే. ఆ నలుపులలోని నలుపుల మధ్య తేడా. ఇది కొంతమంది ఎన్ని జన్మలు ఎత్తినా గమనించలేరు, అధిగమించలేరు..

క్లిక్.

పదవ తరగతి పరీక్షలు. ఆ పరీక్షల విలువ ఎంతనీ! అవి తప్పితే జీవితం వ్యర్థం కదూ! వ్యర్థమైన జీవితాన్ని ముందుకు తోసేకన్నా, ఏ కొండమీదనుంచో నన్నే తోసేసుకుంటే? ఆ అవసరం రాలేదు, సెకండ్ క్లాస్ వచ్చింది. తప్పితే బావుణ్ణు అనిపించేలా సెలవలన్నీ, పీడ కలల్లా వెళ్లిపోయాయి. మావాళ్లు నాపైనున్న అపారమైన నమ్మకంతో, ముందు ఇంటర్లో చదవాల్సిన పాఠాలనే ఆ  సెలవల్లోనే నా పైన వేశారు. రోజుకు నాలుగు గంటలు చదవాలి, రెండేళ్లలో మెడికల్ కాలేజీలో చేరాలి, ఆరేళ్లలో డాక్టర్ అవ్వాలి, ఎనిమిదేళ్లలో.. ఇది నా ముందున్న కార్యక్రమాల పట్టిక. వీటన్నిటికీ నాతో సంబంధం లేదు. నా కవిత్వం అక్కర్లేదు. దీనిని తప్పించుకోవడానికి నేను చేసిన మొదటి పని, ఇంట్లో ఇది నావల్ల కాదని చెప్పడం.

“ఎందుకు కాదు, తలచుకుంటే ఏదైనా చెయ్యచ్చు.”

ఆ మాటలు విన్నప్పుడు నిజమనిపించేంత బావుంటాయి, స్నేహంగా భుజం మీద చెయ్యి వేసి నడుస్తాయి. కానీ పక్కకి తీసుకెళ్లి “నువ్వు ఏమీ చెయ్యలేవురా” అని మొహాన ఉమ్మేస్తాయి. నేను వీటితో ఇంకో రెండు సంవత్సరాలు బ్రతకాలి. ఈ మలినం నా కవిత్వానికి అంటకూడదు. కవిత్వం రాయడం, చదవడం మానెయ్యాలి. దానికి నాకు దొరికిన లంచం, ఒక కంప్యూటర్, అందరి జీవితాలు తొంగి చూడగలిగే, ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వగలిగే ఒక చిక్కనైన అల్లిక అంతర్జాలం.

క్లిక్.

మొదటిసారి భయం వేసింది, నాలాంటి మనుషులు ఇంకొంతమంది అక్కడ పరిచయం అయ్యాక, మొదటిసారి జాలి కలిగింది. ఏది వారి తీరం! ఏది వారి దారి! వారి గుహల్లో ఎప్పటినుంచో మధ్య నివసిస్తున్న వారి చేత దీపమేది ? ఎందుకు వారికా ఆనందం? ఎందుకు అంత శోకం? ఏది వారు రాసేమాటలకి ఆధారం! కవిత్వమంటే ఒక ప్రయాణం, రోజూ కనపడేవాటి వెనక నక్కి ఉన్న ఇంకొక పొరలోకి. కవిత్వమంటే ఒక అన్వేషణ, కచ్చితంగా ఉందని తెలిసినా, మాయమైన దాని ఉనికి కోసం. కవిత్వమంటే ఒక ధైర్యం, ఎవ్వరు లేకపోయినా, అన్నీ దూరమైనా, వెచ్చగా హత్తుకునే గుండెలలా. అక్కడ నా అడుగులు చాలవు. నా వయస్సు చాలదు.

ఏదోటి రాసెయ్యాలి, నేనేంటో చూపించాలి అనే తృష్ణతో ఒక కవిత రాసి ఫేస్బుక్ లో  పెట్టా.

నీ నవ్వుతో అమావాస్యనాడు వెన్నెల కాచేనా!

            నీ మౌనంతో ఎడారి కడలై పొంగేనా!

            నీ శోకానికి ఆనకట్ట నా నవ్వా?

            ఎంత కాలం?

            ఇక నవ్వి విసిగిపోయాను, ఏడుపు మరచిపోయాను,

            ఇంకేమి చూపగలను శూన్యం తప్ప!

ఎవ్వరూ చదవలేదు, పట్టించుకోలేదు.

 

క్లిక్.

కొన్నాళ్లు ఆ కాలేజీలో ఉండేసరికి, వాళ్ళ నిర్ణయం మేరకు – అవసరం మేరకు , ఉపయోగపడాలని – నా కళ్ళని  సున్నితంగా పొడిచేసారు. దృష్టి క్షీణించింది. లక్షల రంగులు చూసిన నాకు ఇప్పుడు కనపడే రంగులు రెండు, వెలుతురూ, చీకటి. కలిగే భావాలూ రెండు, మెలుకువ, నిద్ర. తెలిసిన ప్రదేశాలు రెండు, ఇల్లు, కాలేజీ. నెమ్మదిగా ఈ రెండూ ఒకటికి కుంచించుకుపోయాయి, చీకటి, మెలుకువ, కాలేజీ. తెలియకుండానే బాధని మోసాను, కవిత్వం వదిలేసాను.  ఎంట్రన్స్ రాసిన మరుసటి రోజు మళ్ళీ కంప్యూటర్ ముట్టుకున్నా. నా కవిత్వానికి నాలుగైదు లైకులు. కామెంట్స్ ఏంలేవు.   ఇన్ బాక్స్ లో 20 మెసేజెస్ . కవిత పెట్టిన రోజునుండి, 6 నెలల క్రితం వరకు.  అన్నీ ఒకరినుంచే. ఒకే ఒక్క  మనిషి నన్ను బయట పడేద్దాం అనుకున్నాడు. ఆఖరి మెసేజ్ లో అయన చిరునామా, ఫోన్ నెంబర్ పంపించి ఆపేసాడు.
క్లిక్.
ఆ మెసేజ్ లకి అప్పుడు  బదులు ఇవ్వబుద్ధి కాలేదు.  సుడిగుండంలో బలవంతంగా ఎదురీదుతూ అలిసిపోయాను. అందరూ  ఊహించినట్టుగానే, జీవితంలో ఘోరమైన పాపం చేసేసాను. ఎంట్రన్స్ తప్పాను. ఆ బాధ మింగుడుపడలేదు,  కొంతమంది ఓదార్చారు, ఇంకొంతమంది గేలిచేసారు. మా ఇంట్లో భయపడ్డారు, ఏమవుతానోనని, ఎక్కడ తేలతానోనని. బలవంతంగా ముంచాకా, తేలేందుకు చోటేక్కడిది!

క్లిక్.

బి ఫార్మసీలో చేరాను. ఇంత అక్రమంలో కూడా నాకు ఒక క్రమం కనపడుతోంది. మారే కాలం కవికి కాక ఇంకెవరికీ స్పష్టంగా తెలిసేది! ఒక పియానో సొనాటాలోని ఆఖరి స్వరం, మెరిసే మెరుపులోని మొదటి తళుకు, తీరాన్ని ముద్దాడే సముద్రపు ఆఖరి బొట్టు. ఇవి కవి కోసంకాక మరెవ్వరికీ! మరి ఆ గొంతుకి చుట్టుకుంటున్న వేళ్ళు? వాటి సందులనుంచి నేను అరిస్తే? ఎవరికి వినపడేది! ఆ పైన మూడేళ్లు నన్ను బయటికి లాగాలని ప్రయత్నించిన వాళ్ళకి నా మీద ఇష్టం కన్నా, వాళ్ళకి వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ.

అవును నాకు పొగరు, పెద్ద విషాదం అనుభవించిన వాళ్లందరికి ఉంటుంది పొగరు.

“ఇది నాకు జరిగింది, నాకే ప్రత్యేకంగా జరిగింద”నే ఒక గర్వం.

అలాంటివాళ్ళని లాగి ఒడ్డునపడేయాలంటే, త్రాణ కావాలి! అది సంపాదించే బదులు జాలి పడినట్టు నటిస్తే పోలేదూ ! నిజమే. అలాగే నటించారుకూడా. తెల్లవారుతుందనే ఆశలు రేపి, అవసరంలేనంత ప్రాణవాయువుని అరువిచ్చి, మత్తుగా తూలుతుండగా , ఏనుగంబారీలతో తొక్కితే?

క్లిక్.

ఒకదాని వెంట ఒకటి దిగుళ్ళ కవితలు రాస్తూ పోతున్నా. ఎన్ని రాసినా కెథార్సిస్ లేదు. దుఃఖం తరగట్లేదు. అందరికీ నచ్చుతున్నాయి.
మరి నాకు ?

ఎలాగోలా బయటికి రావాలనిపిస్తోంది, ఇంకెంత కాలం ఈ రొచ్చులో ఉండాలనిపిస్తోంది. నా బాధ మీద నాకే అసహ్యం వేసింది. ఎక్కడికి లాకెళ్తుందిది? నా ఊపిరిని కొల్లగొట్టడానికి దానికేంటి హక్కు? పాము చుట్టుకుంటుంటే పోరాడాలి.అయ్యేది అవుతుందిలే అని కూర్చోడానికి అసలు పుట్టడం ఎందుకు ? పోరాటం, యుద్ధం మానవులకున్న వరం. నా దృష్టి నాకు మళ్ళీ రావాలంటే, నా బాధని కాల్చాలి. నా లోపలున్న కవిత్వాన్ని నాశనం చేసుకున్నది నేనే. ముందు నాతో నేను గెలవాలి, శత్రువులమీద తరువాత దండెత్తచ్చు. , నేను సుఖపడినప్పుడు. ఎవ్వరి మాటలు నాకు అంటేది! ఎవ్వరి కళ్ళు నన్ను తాకేది! నేను మారాలి, ఆ తరువాతే, అంతా.

ఆ మెసేజ్ లని మళ్ళీ ఒకసారి చదివా.  అప్పటి నన్ను మళ్ళీ ఒకసారి చూశా.  పక్కనే ఉండి చాలా మంది ఇవ్వని ఆసరా  అయన ఎప్పుడో ఇవ్వాలని చూసాడు.  తీసుకుంటే ?

మొదట్లో చాలా కష్టమైంది, బయటికి రావాలనిపించలేదు, బయట అనేది ఒకటి ఉందని ఒప్పుకోవడానికి కొన్ని వందల యుద్ధాలు గెలవాల్సొచ్చింది. ఆ నెర్రె ల నుండి చిమ్మే వెలుగుల వైపుకి నెమ్మదిగా పాకుతుంటే, కాలి మడమలు ఒకటిగా కట్టేసిన సంకెళ్ళు ముందుకు పడేసేవి. విడుదలకి నాకొక్కటే ఊతం, ఆ మెసేజ్ లు . చదివాను, ఇంకిపోయే వరకు, నా బానిసత్వం చచ్చేవరకు. చీకట్లు పగిలే వరకు.

వెళ్ళి అయన కాళ్ళమీద పడి, నా జీవితంలో ఇన్నేళ్లు వృధా చేసినందుకు, క్షమించమని అడగాలి, అడిగితే ?

ఆ చివరి మెసేజ్ లో ఉన్న చిరునామాకి ప్రయాణం తలపెట్టా.

క్లిక్.

బస్సు లోయలో పడే ముందు, నా బల్లమీద అలారం మోగింది. రే చార్ల్స్ – సెవెన్ స్పానిష్ ఏంజెల్స్ పాటతోటి  నాకు మెలకువ వచ్చింది.ఇంకా ఇంట్లోనే ఉన్నా అని అర్థమైంది. ఒక ఆరుగంటలలో నా జీవితం మొత్తాన్ని మళ్ళీ చూసాను. నాకిదొక పాఠం, ఒక్కొక్క రోజు ఎంత అద్భుతమో.  నాకల. మన మధ్య  ఊబిలో కూరుకుపోతున్న  కొంతమంది కవుల నిజం  . అంకెల నుంచి అంతరిక్షం వరకు అన్ని సృష్ఠించబడింది మనిషిని స్పందింపచేయటానికే. ఆ స్పందనని వెతకాలి, వెలివెయ్యకూడదు.

బయల్దేరాలి.

painting :kiiju89

16 Comments

 1. చాలా బావుంది,,చీకటిలో కలిసిపోతుందనుకున్న జీవితం మీద ప్రసరించిన వెలుగు రేఖ హమ్మయ్య అనని ఊపిరి పీల్చుకునేలా చేసింది,.చాలాబావుంది బంగారం

  Like

 2. స్వప్నిక్ మీ నుంచి అసలు ఊహించలేదు ఇటువంటి కధని , అద్భుతం …ప్రతి వాక్యంలోనూ ఎంతో డెప్త్ … మరిన్ని కధలు రాస్తారని ఆశిస్తూ …అభినందనలు

  Like

 3. మీలో ఈ పార్స్వం కొత్తగా ఉంది..ఎంతో మథనం జరిగితే తప్ప..ఇలా రాయగలగడం కష్టం.బాగా churning అయితేనే the cream comes up. keep it up dear

  Like

 4. ఏడేళ్ల పిల్లాడు రాసే కవితమీద జెలసి. దాన్ని వెంటనే హాస్యం చేసెయ్యాలి. నలుపుకి తెలుపుకి మధ్య ఉన్నది కాదు వ్యత్యాసమంటే. ఆ నలుపులలోని నలుపుల మధ్య తేడా. ఇది కొంతమంది ఎన్ని జన్మలు ఎత్తినా గమనించలేరు, అధిగమించలేరు..How real ?

  బలవంతంగా ముంచాకా, తేలేందుకు చోటేక్కడిది ? – This will haunt many.

  Very good piece Swapnik.

  BTW, I guess there is a spelling error in <> I guess you mean భ్రమ. 🙂

  Like

 5. కథ కవిత 2nd class లో రాసిన కవిత చదవాలని ఉంది.bye the way superb poetic story

  Like

  1. ఆ కవిత కోసం వెతకాలండి, బీరువాలోనూ, మనసులోనూ. Thank you andi!

   Like

 6. స్వాప్నిక్ ! ఇంత స్పందన, జీవనస్రవంతి నీలో ఇమిడి ఉండడం వలనే , ఇంత గొప్పగా రాస్తున్నావు! ఒక అక్షరం పదమయ్యి, పదాలు కధలూ, కవితలూ అవ్వాలంటే జీవితాన్ని, సృష్టినీ చాలా మనసుకు దగ్దరచేసుకుని చూస్తేనే సాధ్యమవుతుంది. నీ చీకటి ఎన్నో నలుపుల్ని చూపించింది. నలిపేస్తున్న బాల్యాలూ, చదువులే పరమార్ధంగా నూరి, భావుకతను చంపేస్తున్న వ్యవస్థ, దానిని గుడ్డిగా నమ్మే పేరెంట్స్, చిన్నారిలోని సృజనాత్మికతను మొగ్గలోనే తుంచేసే చీడపురుగులు……. వీటికి కొదువే లేదు. ఇంత చీకట్లో ఒక్కరయినా ఉండితీరుతారు, ఇసుమంత వెలుగురవ్వలు కురిపిస్తూ. వాళ్లే ఈ ప్రపంచానికి అంతో ఇంతో ప్రాణవాయువు పోస్తున్నారు. అద్భుతం నాన్నా! గాడ్ బ్లెస్ యూ!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s