ఓహో గులాబి బాలా – సాంత్వన చీమలమర్రి

నీకెందుకో అనిపిస్తుంది – మంచి టైలరనేవాడు నిజమైన ప్రేమ, నీతి నిజాయితీ లాంటి కావ్యవస్తువు అని. అందరూ వాడి గురించి మాట్లాడతారు, సినిమాలు తీస్తారు, స్తోత్రాలు చదువుతారు – కానీ తుచ్ఛమైన ఐహిక ప్రపంచంలో వాడి షాపు తాలూకు దారం పోగు కూడా నీకెక్కడా కనబడదు. వెతకాలని నిశ్చయించుకుంటావ్. ఆల్కెమిస్ట్ పుస్తకంలో గుంటడు శాంటియాగోని ఆదర్శంగా తీసుకుని, మీ ఊరి “జగ్గయ్యా క్లాష్టోరూం” వాళ్ళ కర్రల సంచీలో ఎంతో ఇష్టంగా కొనుక్కున్న నీ రెండు పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్సు కుక్కి ఊరిమీద పడతావు.

అనుకున్నది పొందటానికి నీలోపల కఠోరమైన దీక్షా, హరితేజా, అర్చనా, పట్టుదలా ఉండాలని ఎనిమిదవ శతాబ్దపు చైనా కవి ఒకాయన రాసిన వ్యక్తిత్వవికాస హైకూ నీ మదిలో గంగానమ్మ స్టైల్ డ్యాన్సు చేస్తూ ఉంటుంది. తిరిగీ తిరిగీ శోషొచ్చి పడే దశలో ఒకానొక షాపు ముందు అరుగు మీద కూర్చుంటావు. ఇక నీవల్ల కాక ఇంటికి వెళ్దామనుకునేసరికి ఎవరో నిన్ను పిలిచినట్టు వినబడుతుంది. తిరిగి చూస్తే చింకిబట్టల్లో ఒక బారుగడ్డం ముసలాయన నీ వైపు వెర్రిగా, వింతగా చూస్తుంటాడు. నువ్వు అజ్ఞానివై పర్సులో చిల్లరకోసం వెదుకుతావు. అతను వికటాట్టహాసంచేసి “ఎందుకొరకొచ్చావే చిలకా! నీకేమి దొరికినాదే చిలకా!” అని ఏదో పాడుతూ వెళ్ళిపోతాడు. వెనక్కి తిరిగి బోర్డు పైన పేరు చదూతావు. ఆకృతీ ఫ్యాషన్ టైలర్స్. ముసలాయన జాడ కనబడదు. నీ బాల్యావస్థలో చూసిన రాడాన్ వారి డబ్బింగ్ సీరియళ్ళలో ఇలా మిస్టీరియస్ ముసలాళ్ళొచ్చి జ్ఞానోపదేశాలూ వగైరా చెయ్యడం కద్దే అని గుర్తొచ్చి కాస్త కంగారు తగ్గుతుంది.

కోరమంగళాలో ఉండే మీ కొలీగ్ వాళ్ళ వదిన కజిన్ బెస్ట్ ఫ్రెండ్‌కి భువనైకమోహనమైన సల్వార్లు కుట్టిన టైలర్ షాప్ పేరు కూడా ఆకృతీ ఫ్యాషన్సే అని నీకు వెలుగుతుంది. ఆ అమ్మే ఈ అమ్మగా మళ్ళీ పుట్టిందేమో అనే ఆశతో ఆ గడప తొక్కుతావు.

అక్కడ తగిలించివున్న నమూనా డ్రెస్సులుచూసి పైన వ్రాయబడ్డ విశేషణంలోని ‘ భు ‘, ‘ వ ‘, ‘నై’, ‘ క ‘,’మో’ అక్షరాలు గదిలోకెళ్ళి నీ మొహమ్మీదే ధభీమని తలుపేసేస్తాయి. ముక్కు పగలనందుకు సంతోషిస్తూ ఓ మోస్తరు హనంగా అయినా ఉన్నాయిలెమ్మని లోపలికెళ్తావు. అయినా బట్టల అందం వేసుకునేవాళ్ళల్లో ఉంటుందనే సూక్తి నీ స్ఫురణకొస్తుంది. నీ చిన్నప్పుడు మీ ఊరి కాశీ టైలరు మీ అమ్మ షిఫాన్ చీరతో నీకు కుట్టిన “స్టెప్స్ ఫ్రాక్” అనే వస్త్ర విశేషం తొడుక్కున్నపుడు మీ అమ్మమ్మ తాతయ్యా “విక్టోరియా మహారాణిలా ఉన్నావే!” అని మురిసిపోవటం గుర్తుతెచ్చుకుంటావు. దాన్ని శనివారం మీ స్కూలుకు వేసుకెళ్లినప్పుడు నిన్ను చూసి స్కూల్‌బస్‌లో కొందరు కెవ్వుమని అరిచి మూర్ఛపోవడాన్ని మాత్రం నీ మనసు లోతుల్లోకి ఎన్నడో తోసేశావు.

షాపులో కమ్మటి గ్రీజు వాసనకొడుతూ ఉంటుంది. నాలుగైదు మిషను చక్రాలు గిరగిర తిరుగుతూ ఉంటాయి. కత్తిరించిన గుడ్డ పీలికలు రంగురంగులుగా కుప్ప పోసి ఉంటాయి. నీ మనసు ఉప్పొంగుతుంది. ఏ వృత్తికావృత్తి ఎంత ప్రత్యేకమైనది! ప్రతీ పని తాలూకు soundscape, colorscape దానికే ప్రత్యేకం కాదూ? శ్రమలో ఎంత జీవనమాధుర్యముంది! ఈ విధంగా శ్రమని రొమాంటిసైజ్ చేస్తూ, శ్రమ దోపిడీని హైలైట్ చేస్తూ చక్కటి award winning అభ్యుదయకవిత ఒకదాన్ని మనసులో పేర్చుకుంటూ ఓనరు లా కనిపిస్తున్న వ్యక్తిని వెళ్ళి అడుగుతావు- “సల్వార్ కుట్టాలి. పార్టీ వేర్. ఎంతౌతుంది?” అతడి జవాబు విన్నాక నీ కవితా సౌధం కుప్పకూలుతుంది. లేకపోతే! మీ ఊరిలో ఇచ్చేదానికన్నా డెబ్భైరూపాయలు ఎక్కువ అడిగాడు! ఇందాకటి కూలిపోయిన కవితాసౌధపు కాంక్రీట్ రద్దుముక్క ఒకదాన్ని తెచ్చి కాసేపు దాంతో గీకి గీకి బేరమాడతావు. శాల్తీ ఒక్కింటికి కనీసం యాభైరూపాయలు తగ్గిస్తావ్. ఊరుకుంటే ఈ టైలర్లు దోచేస్తారు మరీని!

బేరమయ్యాక సంచీలోంచి రెండు జతల మెటీరియల్సూ తీస్తావ్. నీ మెదడులో ఇందాక ముసలాయన చేసిన జ్ఞానోదయం ఇప్పుడు జ్ఞానమధ్యాహ్న దశకు చేరుకుంటుంది. అందుకు ఒకటే జత ముందర కుట్టడానికిచ్చి అది బావుంటే ఆనిక్కి రెండోది ఇద్దామనుకుంటావు. రెండిట్లో కాస్త తక్కువగా నచ్చిన గులాబీ తెలుపు కాంబినేషన్ డ్రెస్సును ప్రయోగానికి సిద్ధం చేస్తావ్. అప్పటిదాకా Cafeteria లో పునుగులు తింటున్న నీలోని నీతా లుల్లా, రీతూ కుమార్లు  రంగంలోకి దిగుతారు.

“Expensive అనార్కలి మెటీరియల్ ఇది. Pure crepe. ఈ వైట్ కలర్ పీస్ చెస్ట్ దగ్గరికి రావాలి. దుపట్టా (తెలుగువాళ్ళలాగా చున్నీ అంటే పరువు తక్కువ లుల్లాజీ దగ్గర) పింక్ కలర్ కదా.. కాంట్రాస్ట్ బాగా కనపడుతుంది. అన్నట్టు దుపట్టాకి వైట్ కలర్ ముత్యాల లేస్ బోర్డర్ వెయ్యండి. ప్లెయిన్ జిగ్ జాగ్ బాగోదు. నెక్ “వీ” కాదు, “యూ” కాదు… ఇంగ్లీష్ లెటర్ “క్యూ” ఆకారంలో రావాలి… “ నీ మనసులోని అంతులేని  ఊహలకి అక్షరరూపమిచ్చి అతనికి చేరవేస్తావు.

 

“క్యూఁ?” అన్నట్టు చూస్తాడు టైలరు.

 

“అంటే ఆ బాటం క్లాత్‌ని థ్రెడ్‌లాగ design చేసి, diagonal గా అటాచ్ చేసి, కింద సిల్వర్ కలర్ tassels పెట్టాలి… అది రైట్‌సైడ్‌కి రావాలి. లెఫ్టైతే మళ్ళీ దుపట్టా కింద కనబడదు… ఇంకా బాటమేమో చూడీ చెయ్యండి.”

టైలరు మౌనంగా మడతేసుకుంటాడు.

“ఏవండీ! గుర్తుంటాయా అన్నీ? లేదంటే రాసుకుంటారా?” ఆరాటంకొద్దీ అడుగుతావు.

“అక్కర్లేదు మేడం. నేనూ డిగ్రీ చదివాను. ఐ కెన్ రిమెంబర్. మీరు చెప్పినట్టే కుడతాను. మీకు నాపైన భరోస లేదా?” అంటాడతను.

అతని ఉనికిని ప్రశ్నించి ఈగోని దెబ్బతీసినందుకు నీపైన నీకే కోపమొస్తుంది.

“సారీ అండీ. నాకు దివాలీ లోపు కావాలి. ఇవ్వగలరుగా?”

“అప్పటిదాకా అక్కర్లేదండీ… వచ్చే శనివారం ఇచ్చేస్తాగా!”

ఆనందభాష్పాలు తుడుచుకుంటూ చీటీ తీసుకుని ఇల్లు చేరుకుంటావు.

ఆ రోజు రాత్రి టీవీలో తమన్నా గులాబీ, తెలుపు రంగుల్లో ఉన్న సల్వార్ వేసుకుని కనబడుతుంది. లుల్లాజీ ఆ డ్రెస్సు కన్నా నీదే బాగొస్తుందని వక్కాణిస్తుంది. రెండ్రోజులాగి ఇంట్లో జనం ఏదో సినిమా చూస్తుంటే డైలాగు వినబడుతుంది- “తెల్లని దుస్తులు ధరించినది. పై వస్త్రము గులాబీ రంగు”. నీ డ్రెస్సు ఎలా తయారవ్వబోతోందో తలుచుకుని రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

శనివారం ఉదయం టైలరుకు ఫోన్ చేస్తావు. స్విచాఫ్! సాయంకాలమూ అదే పరిస్థితి. మర్నాడు ఎలాగో ఆదివారం కొట్టుకు సెలవు. సోమవారమూ మనిషి పత్తా ఉండడు. నీకు మెల్లిగా గుబులు మొదలౌతుంది. ఒకవేళ అతను సరుకంతా తీసుకుని పారిపోయుంటే?  అతని నంబరు పోలీసులకిచ్చి లొకేషన్ ట్రేస్ చెయ్యిద్దామా అనే విపరీతాలోచనలతో నీలో నువ్వే మదనపడుతుంటావు.

మంగళవారం మధ్యాహ్నం అతనే ఫోన్ చేస్తాడు- “మేడం! అర్జెంటు పని మీద మాండ్య వెళ్ళాను. డ్రెస్సు అద్భుతంగా వస్తోంది… ఇంకొక్క రెండురోజులు… శుక్రవారం నేనే డెలివర్ చేయిస్తాను. నా పైన భరోసా ఉంచండి…” అని.

మంగళవారం ఉదయం మొహానికి మంకీటోపీ, కూలింగ్ గ్లాసులూ ధరించిన ఒక ఆగంతకుడు  బెదురుగా మీ ఇంటి గుమ్మంలోకొచ్చి గేటుమీంచి మీ వరండాలోకి ఓ ప్యాకెట్ విసిరేసి అదేపోతపోతాడు.

ఏముందో తెరిచి చూస్తావు….

*******

దాదాపు ఒక గంటపాటు మాటా పలుకూ లేకుండా పడివున్నావని మీ ఇంట్లో జనం చెప్తారు. తిరిగి ఆ ప్యాకెట్ వైపు చూసే ధైర్యం చెస్తావు. దుఃఖం గొంతులో పారసెటమోల్ 650 mg ట్యాబ్లెట్టులాగా అడ్డుపడుతుంది.

ఏమి జరిగిందో నీకు చెదురుమొదురుగా గుర్తొస్తూ ఉంటుంది.

 

“పోనీ ఓసారి వేసుకుని చూడు. బాగానే ఉంటే ఇంట్లో వేసుకోవచ్చు, లేకపోతే పోయే…” మీ అమ్మమ్మ ఊరడించటానికి ప్రయత్నిస్తోంది.

 

నువ్వు పైన వెయ్యమన్న తెల్లటి క్రేప్ క్లాత్ స్థానంలో మస్తు నీలం పెట్టిన దళసరి లోపల్లంగా క్లాతు ఉంటుంది. దానికేవో ముత్యాలు కుట్టి మేకప్పేసి అందంగా చూపించే ప్రయత్నం కూడా చేయబడిందని గ్రహిస్తావు. దుపట్టాకి ఒక మూల దట్టంగా అంటుకున్న గ్రీజు వాసన చూస్తావు. కూలిపోయిన సౌధాల విషాధ గాధలు వినబడతాయి. చూడీ పైజమా, మీ ఇంట్లో మొక్కలకి నీళ్లు పెట్టే ట్యూబూ ఒకే వ్యాసంతో ఉన్నాయని తెలుసుకుంటావు. ఏలాగోలా ప్లాస్టిక్ కవరేసి దాన్ని మడమలమీంచి ఎక్కించే ప్రయత్నం చేస్తావు. చూడి పైజమా కనిపెట్టినవాడికి గరుడపురాణం ప్రకారం “సూచీముఖం” కరెక్టా లేక “కుంభీపాకం” శ్రేష్టమా? అనే మీమాంసలో పడతావు. కుర్తా నిత్యా మీనన్‌కి ఇలియానా కొలతలతో కుట్టినట్టు ఉంటుంది. నెక్‌లైన్ అక్షరాలా నీ గొంతు కోస్తూ ఉంటుంది. నీ కుడి చెయ్యి భూమికి సమాంతరం గా ఉంటుంది. ఎడమ మోచేతికి కి టెన్నిస్ ఎల్బో వస్తుంది.

 

మిగిలున్న కాస్త జీవశక్తినీ కూడగట్టుకుని షాపుకు వెళ్తావు. వాడు వెకిలిగా నవ్వుతూ “మీ మెషర్‌మెంట్స్‌కి క్లాత్ సరిపోలేదు మేడం… అందుకే ఎగష్ట్రా క్లాత్ కొనివేశాను. బాగా వచ్చిందా?” అంటూ వేరే కస్టమర్ దగ్గర బలిబట్టలు మడతేస్తుంటాడు. నీ ఆకృతి పట్ల నీకున్న అపోహలకి ఆజ్యం పోసినట్టౌతుంది. కాళ్ళకింద భూమి కుంగిపోతుంది.

లోపలినించి ఒక ఆరేడేళ్ళ పిల్ల వస్తుంది. టైలరు పిల్లవంక మురిపెంగా చూస్తూ ఉంటాడు.”ఆంటీ ఇవాళ నా హ్యాపి బర్త్‌డే! చాక్లెట్ తీసుకోండి” అని ఒక ఆల్ఫెన్‌లీబే నీ చేతిలో పెడుతుంది.  ఈ చాక్లెట్టు పేరు ఏనాడూ ఇంగ్లీషులో సరిగా రాయలేనందుకు నీపైన నీకు అసహ్యం కలుగుతుంది. నువ్వెందుకూ పనికిరావనే భావన నిన్ను నిలువునా ముంచేస్తుంది. నువ్వు ఈ అనంతవిశ్వంలో కేవలం ఒక ధూళికణానివనిపిస్తూ ఉంటుంది. అయినా నీకే ఇన్ని ఆలోచనలూ ఉద్వేగాలూ ఎందుకుండాలనిపిస్తుంది. దీన్నే మేధావి పరిభాషలో Existential Crisis అంటారని నీ Intellectual ఫేస్‌బుక్ ఫ్రెండొకాయన చెప్పటం గుర్తొస్తుంది.

ఆటో పిలిచి ఎక్కబోతూ ఉంటావు.

అప్పుడు గమనిస్తావు. ఆ పిల్ల తెల్లని గౌను ధరించినది. పైన కుచ్చులు గులాబీ రంగు.

13 Comments

 1. యుగయుగాలుగా, తరతరాలుగా తరగని వస్త్రదోపిడీకి బట్టలూడదీసి మరీ చూపించావు. ఈ కబుర్లకి కనెక్టవ్వని వ్యక్తి భూప్రపంచంలోనే ఉండరని వైశంపాయనుడు ఇప్పుడే చెప్పి, టైలర్లని నమ్మి బట్టలిచ్చినందుకు చెప్పిచ్చుకు కొట్టుకోండి, కలియుగంలో ప్రతీజీవి మరోజీవికి ఉపయోగపడేలా దేవుడు ఫేట్లు రాసాడని, మేక్సిమం మన ఫేటే అవ్విధంగా జ్వలిస్తుందని ఉవాచించి, ఆయన అంగోస్త్రమొకటి ఆకృతి వాడికి ఇచ్చాట్ట. తెచ్చుకోడానికి చక్కాపోయాడు. Congratulations Santwana! నీ మధురస్వరం వినగలిగే వేదిక ఇచ్చినందుకు.

  Like

 2. ఏ ఒక్కటీ వదల్లేదు సుమా..రాత్రి నెట్ ఓపెన్ అవక..ఆఫీస్ లో చదువుకుంటూ ముసి ముసి గా నవ్వుకుంటున్నా..పక్కన ఉన్న Hari-మా HR చూసి ఏంటి మాష్టారూ అని అడిగే దాకా ఈ లోకం లోకి రాలేదు.You are impossible Santwana.Love you dear

  Like

 3. ఇది హాస్యరచనే అయినా .. నా త్రి పీస్ సూట్ బాగోతం అంతా గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి ..ఈ వాక్యాలు చదివి నవ్వి నవ్వి ఇంకోసారి కళ్ళలో నీళ్లు తిరిగాయి ..—> ” రాడాన్ టీవీ మిస్టీరియస్ ముసలోళ్ళు, వాళ్ళ ఉపదేశాలు … ఆ అమ్మ ఈ అమ్మగామళ్ళీ పుటిందేమో అన్న ఆశ, ప్రతీ పని తాలూకు soundscape, colorscape దానికే ప్రత్యేకం కాదూ, నీలోని నీతా లుల్లా, రీతూ కుమార్లు రంగంలోకి దిగుతారు, “సూచీముఖం” కరెక్టా లేక “కుంభీపాకం” శ్రేష్టమా? అనే మీమాంసలో పడతావు. కుర్తా నిత్యా మీనన్‌కి ఇలియానా కొలతలతో కుట్టినట్టు ఉంటుంది, దీన్నే మేధావి పరిభాషలో Existential Crisis అంటారని నీ Intellectual ఫేస్‌బుక్ ఫ్రెండొకాయన చెప్పటం గుర్తొస్తుంది.” hilarious 😀

  Like

 4. నిత్యామీనన్ కంటే ఇలియానాకే కిందెక్కువ అనే కామెంట్ పెడితే మీరేమైనా నొచ్చుకునే ప్రమాదం ఉందా? 😊
  👌👌👌

  Like

 5. Fine madam.Nowadays we are not coming across this type of satires .New coined words are appreciable. ex.బలిబట్టలు.All the best.

  Like

 6. Hilarious narration.
  నీలోపల కఠోరమైన దీక్షా, హరితేజా, అర్చనా, పట్టుదలా ఉండాలని ….
  Ultimate అసలు. 👏👌

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s