అయిదుగురు పిల్లలూ అదీనూ – (ఎడిత్ నెస్ బిట్ ) మొదటి భాగం [మైథిలి అబ్బరాజు ]

ఎడిత్ నెస్ బిట్ – ఇంగ్లీష్ లో పిల్లల కోసం రాసినవారిలో ముఖ్యమైనవారు( పెద్దవాళ్ళ కోసం కూడా రాసినా) . మొదటి వరస లో ఉంటారు. లూయీస్ కరోల్, జార్జ్ మాక్ డొనాల్డ్ వంటి వారు సృష్టించిన అద్భుత ప్రపంచాలని పిల్లలకి ఇంకా దగ్గరగా, వాళ్ళ పరిసరాల్లోకే తెచ్చి ఇచ్చారు.

 

Five children and it సీరీస్ లో మూడు పుస్తకాలు -[The phoenix and the carpet, The story of amulet] , The enchanted castle, The magic city , The story of treasure seekers ,  Wet Magic ,  వాస్తవ జీవితం రాసిన  The Railway children , – అన్నీ అతి గొప్ప విజయాలు. Tales of Magic series రాసిన Edward Eager  ‘’ ఆవిడే లేకపోతే మేమెవరమూ లేము.  Second-rate E. Nesbit is better than no E. Nesbit at all ”  అంటారు.

 

*****

 

రైల్వే స్టేషన్ కీ ఇంటికీ మూడు మైళ్ళ దూరం అట. గుర్రబ్బండి మాట్లాడుకుని ఎక్కిపోయారు అమ్మా పిల్లలూ. అయిదు నిమిషాలైందో లేదో – దారెమ్మట ఏ ఇల్లు కనబడ్డా – ” ఇదేనా ? ఇదేనా ? ” అని అడగటం మొదలెట్టారు. అసలా దార్లో ఎక్కువ ఇళ్ళే తగల్లేదు , ఒక్కటీ  వాళ్ళిల్లు కాదట. చివరాఖరికి -సున్నం రాళ్ళ గని  దాటాక , దానికీ కంకర  లోయకీ మధ్యని – కొండ మీద , అక్కడుంది ఇల్లు. తెల్లటి గోడలూ చుట్టూ పచ్చగా పూలతోటా వెనకాల పళ్ళ తోటా –

” వచ్చేశాం ” – అమ్మ అంది.

” ఎంత తెల్ల- గా ఉందో ” – రాబర్ట్ .

” అరే, రోజా పూలు చూడూ – ” – ఆంథియా.

” ప్లమ్  పళ్ళు ! ” – జేన్

” ఊ.బావుంది ” – సిరిల్ ఒప్పుకున్నాడు.

” పోలాం….అత్తలికి పోలాం ..” – పాపాయి.

ఒక్ఖ కుదుపు తో బండి ఆగింది.

అంతా ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ తొక్కుకుంటూ బయటపడ్డారు. అమ్మ నిదానం గా దిగింది. పెట్టెలన్నీ దింపించటం, బండి అతనికి డబ్బులివ్వటం – లోపలికి వెళ్ళాలని తొందర లేనట్లుంది. కంచె అవతల అంతా అడవికి మల్లే ఉంది. గుబురు గుబురు గా ముళ్ళ పొదలు. నిజానికి అమ్మకి ఆ ఇల్లు అంత పెద్ద నచ్చలేదు. సాదా సీదా ఇల్లు అంతే. లోపల ఒక సరైన అల్మైరా కూడా లేదట. కనీసం పై కప్పు కూడా బాగా వెయ్యలేదని నాన్న అనేవాడు.  పిల్లలకి మాత్రం ఎంతో హాయిగా అనిపించింది. రెండేళ్ళపాటు లండన్ లో ఇరుకైన ఇంట్లో సర్దుకున్నారు వాళ్ళు. చుట్టాలిల్లు అది. ఒక్క రోజు కూడా సరదాగా బయటికి వెళ్ళిందే లేదు – జైల్లో ఉన్నట్లుండేది. ఇక్కడ , పల్లె పట్టు లో , కనుచూపు మేరన మరొక మనిషే కనిపించకుండా ఉన్న  పరిసరాలు స్వర్గం లాగా ఉన్నాయి వాళ్ళకి. ఆ ఇల్లొక గంధర్వ భవంతి అనిపించింది.

లండన్ లో రకరకాల దుకాణాలూ నాటకశాలలూ అవీ ఉన్నాయి – అయితే మాత్రం , డబ్బులుంటే కదా, వెళ్ళేందుకూ ఏదన్నా కొనుక్కుందుకూ ? వీధులూ ఇళ్ళూ అన్నీ తిన్నగా సూటి గా సరళరేఖలూ  గీసినట్లూ బల్లపరుపుగా  అణిచేసినట్లూ ఉంటాయి  – ఎక్కడా స్వేచ్ఛగా ఆడుకుందుకే లేదు. చెట్లుంటాయిలే గాని ఎక్కటానికి లేదు . నీళ్ళ లో ఎక్కడ పడితే అక్కడ దిగి ఆడుకోలేరు.  మట్టి తవ్వుకోలేరు, మీద పోసుకోలేరు .  ఒక వీధి కీ ఇంకో వీధికీ తేడా నే కనబడదు – బహుశా ఆ విసుగు తోనే పట్టణాల్లో పిల్లలు పిచ్చల్లరి చేస్తుంటారు. పల్లెటూళ్ళల్లో అల్లరి చెయ్యరా అంటే చేస్తార్లేగాని అది వేరు. పూర్తిగా.

వాళ్ళని పట్టుకుని శుభ్రం చేసి పాలు తాగించేలోపున పిల్లలు ఇల్లూ తోటా మొత్తమంతా గాలించి ఒక కొలిక్కి తెచ్చారు. ఆయా గమనికల మూలం గా , అంతా బాగా – కాదు , బ్రహ్మాండం గా ఉందని తేల్చుకున్నారు.  ఇంటి వెనకంతా పెద్ద మల్లె తీగ అల్లుకుని ఉంది. మొత్తం పువ్వులే, తెల్లగా. అమ్మ పుట్టినరోజుకి ఎవరో బహుమతి ఇచ్చారే , ఆ చక్కని  సెంట్ సీసా లోంచి కూడా అంత మంచి వాసన రాలేదు. గడ్డి పచ్చగా మెత్తగా ఉంది, లండన్ ఇంట్లో లాగా ఎండిపోయి మట్టి రంగు లో లేదు. ఆ మూలన గుర్రాల సాల కూడా ఉంది. గుర్రాల్లేవులే గాని వాటికి పెట్టే గడ్డి ఉంది బోలెడు. చెక్క ఉయ్యాలొకటి ఉంది. రాబర్ట్ దాని మీంచి పడి తల బొప్పి కట్టించుకున్నాడు. కుందేళ్ళ గూటి తలుపులో సిరిల్ వేలు నలగ్గొట్టుకున్నాడు – కాలక్షేపానికి ఢోకా లేదని తేలిపోయింది.

మహా మజా గా ఉన్నది ఇది-ఇక్కడ ఏ నియమాలూ నిబంధనలూ లేవు. లండన్ లో అయితే అడుగడుగునా ” ఇది ముట్టుకోకు, అది చెయ్యకు ” అనే. అంటే అలా రాసి ఉండదు అన్ని చోట్లా, కాని రాసి ఉన్నట్లే నడుచుకుంటూ ఉండాలి. లేదంటే నెత్తిన మొట్టేందుకు పెద్దవాళ్ళెవరో ఒకరు ఎక్కడికక్కడ సిద్ధం.

ఆ ఇల్లు కొండ అంచున ఉంది. వెనక చుట్టూ  అడవి. లోయలో – వింత వింత ఆకారాల ఇళ్ళు. వాటిలో సున్నం మరగబెడతారట. ఇంకో రకం ఇళ్ళకి ఎర్ర రంగు వేసి ఉంది, వాటిలో ద్రాక్షరసం కాస్తారట. నారింజ రంగు సంజ కాంతి . ఆ ఇళ్ళ చిమ్నీల్లోంచి  వస్తున్న పొగలకి బంగారు రంగు పూసినట్లుంది. అదంతా ఏదో మంత్రపు నగరం లాగా. అరేబియన్ నైట్స్ కథల్లో లాగా.

పెద్దవాళ్ళు దేన్ని పడితే దాన్ని నమ్మరు. వాళ్ళకి అన్నిటికీ  ‘ ఆధారాలు ‘ కావాలి. పిల్లలు అలా కాదు, అన్నిటినీ నమ్ముతారు. ఈ పిల్లలకి ఒక వారం రోజుల్లోపే ఒక ‘ యక్షిణి ‘ కనిపించింది అక్కడ. మీరు నమ్ముతారా నమ్మరా ? ఇలాంటి యక్షిణి గురించి ఎవరూ ఎక్కడా చెప్పలేదు మరి.

నాన్న ఏదో పని మీద ఊరెళ్ళాడు. అమ్మేమో అమ్మమ్మ కి బాగోలేదంటే చూట్టానికి వెళ్ళింది. ఇద్దరూ ఒకేసారి హడావిడిగా బయల్దేరిపోయాక ఇల్లంతా ఖాళీ  గా నిశ్శబదం గా అయిపోయింది. పిల్లలు ఒక్కో గదీ తిరగటం మొదలెట్టారు. సర్దాల్సిన సామాను ఇంకా ఉంది అక్కడక్కడా. వీళ్ళేం చేసేందుకు లేదు. తోచట్లేదు.

సిరిల్ కి తట్టిందా ఆలోచన.

” ఆ పారలు పట్టుకెళ్ళి తవ్వుదామా ? కంకర రాళ్ళ లోయలో ? సముద్రం పక్కన ఇసకలో తవ్వుతున్నట్లు ఊహించుకోవచ్చు ”

” ఇక్కడ సముద్రమే ఉండేదట అప్పుడెప్పుడో, నాన్న చెప్పలే ? ఇక్కడ దొరికిన గవ్వలు వేల యేళ్ళ కిందటివట ” – ఆంథియా అంది.

సరే. వెళ్ళారు అంతా కలిసి. కంకర గుంట అంచుల్లోంచి కాకుండా  , చుట్టు దారిలో, బళ్ళూ అవీ వెళ్ళే దారిలోంచి లోపలికి దిగారు. అలాగైతే పడిపోవటం, దెబ్బలు తగలటం ఉండదు కదా. నలుగురికీ చేతుల్లో ఒక్కొక్క పార. ‘ గొర్రె పిల్ల ‘ ని వంతులేసుకుని మోసుకుపోయారు. అది పాపాయి. అది మొదటి మాట గా ‘ బా ‘ అందని దానికి ఆ పేరు.

కంకర గుంట చాలా వెడల్పు గా , ఎవరో రాక్షసుడి వాష్ బేసిన్ లాగా ఉంది. మధ్య మధ్యలో – కంకర తవ్వి తీసిన చోట్ల పెద్ద గోతులు. పిల్లలు వాటిని జాగ్రత్తగా తప్పుకు తప్పుకు నడిచారు. అంచుల్లోంచి పై దాకా దట్టం గా గడ్డి పెరిగి ఉంది. ఆ కిందంతా ఏవేవో పేరు తెలీని పువ్వులు- పసుపూ ఊదా రంగుల్లో, మట్టి కొట్టుకుని.

పిల్లలు మట్టి తవ్వి కోట ఒకటి కట్టారు. సముద్రం ఒడ్డునైతే ఏదో ఒక పెద్ద అల వచ్చి కోట ని కూల్చేసి పిల్లల్ని తడిపేసి వెళ్ళిపోతుంటుంది – అదంతా జారగకుండా కట్టిన కోట కట్టినట్లే ఉంటే ఏం సరదా ఉంటుంది ? ఆ పెద్ద గోతులని ఇంకాస్త తవ్వి వాటిల్లో దాక్కుని ఆడుకుందామని  సిరిల్ సూచించాడు గాని పిల్లలకి భయమేసింది, పూడుకుపోతామేమోనని. అందుకని, కోట కింది నుంచీ ఆస్ట్రేలియా కి సొరంగం  తవ్వటం మొదలెట్టారు. భూమి గుండ్రం గా ఉంటుంది కదా, అలా తవ్వుకుంటూ పోతే భూమికి ఆ వైపున ఉండే ఆస్ట్రేలియా పిల్లలు – తలకిందులుగా నడుస్తూ కనిపిస్తారని పిల్లలంతా అభిప్రాయపడ్డారు.

తవ్వారు, తవ్వారు – తవ్వుతూనే ఉన్నారు. మొహాలన్నీ చెమట పట్టి ఎర్రగా అయిపోయాయి. చేతులు కందిపోయాయి. అంతా ఇసక. గొర్రె పిల్ల ఇసకని తినే ప్రయత్నం చేసింది. దాన్ని మట్టి రంగు పంచదార అనుకుంది. కాదు అని తెలియజెప్పాక నిరాశ తో ఏడ్చి ఏడ్చి అక్కడే పడి నిద్ర పోయింది. అప్పుడిక దాని అక్కలూ అన్నలూ మరీ విజృంభించి తవ్వారు. సొరంగం బాగా లోతయింది. జేన్ కి భయం పుట్టింది.

” ఒరేయ్, ఇంక ఆపండ్రా. ఇది అడుగున కూలిపోతే పాపం ఆ ఆస్ట్రేలియా పిల్లల కళ్ళల్లో ఇసక పడదూ ? ”

” అవును కదా. అప్పుడు వాళ్ళకి కోపాలొచ్చేసి మనల్ని పొమ్మంటేనో ? కంగారూ లూ అపోసం లూ ఎమూ పక్షులూ – ఏవీ చూడకుండానే వచ్చేయాల్సొస్తుంది ” – రాబర్ట్ కూడా భయపడ్డాడు.

సిరిల్ కీ ఆంథియా కీ ఆస్ట్రేలియా మరీ అంత దగ్గర్లో లేదేమోఅనని అనుమానం.  అయినా సరే, పారలు పక్కన పెట్టి చేతుల్తో తవ్వుదాం లే అన్నారు. అలా తవ్వటం భలే తేలిక. ఇసక మెత్తగా ఉంది . చిన్ని చిన్ని గవ్వలు కూడా దొరికాయి .

” ఇదంతా ఒకప్పుడు సముద్రమై ఉంటే ? తడి తడి గా మేరిసిపోతూ…చేపలూ ఈల్ లూ పగడాలూ మత్స్యకన్యలూ…” జేన్ ఊహల్లోకి పడింది.

” ఓడలూ అవీ , వాటిండా రత్నాలూ బంగారం …మునిగిపోతుంటాయి గా అప్పుడప్పుడూ , ఒకదాంట్లోకి మనం దిగి ఆ నిధి అంతా తెచ్చుకుంటే – ” – సిరిల్ ఆశలు.

” అసలిక్కడి నుంచి సముద్రం ఎలా వెళ్ళిపోయిందో ? ” – రాబర్ట్ సందేహం.

” ఎవరూ గిన్నె తో పట్టి తీసుకుపోలేదులే ” – సిరిల్ వెటకారం . ” నాన్న అన్నాడూ, అడుగున భూమి బా- గా వేడెక్కిపోయి బుజాలు విదిలించిందట. మనం పడుకున్నప్పుడు ఉక్క పోస్తే విదిలిస్తామే, అలా అన్న మాట. మన దుప్పటి జారేటట్లు ఇక్కడి సముద్రం జారిపోయిందట. బయటపడ్డ బుజాలు గట్టి పడి ఇక్కడి పొడినేల గా అయిపోయాయట. ”

వీళ్ళ సొరంగానికి పక్కన – ఇదివరకు కంకర తవ్విన గొయ్యి ఒకటి కలిసిపోయి ఒక ‘ గుహ ‘ ఏర్పడింది. వీళ్ళు దూరేంత పెద్దది. అందులో ఏమన్నా వింతలు దొరుకుతాయేమోనని చూశారు- సిరిల్ కి ఒకటేదో మునిగిపోయిన ఓడ స్థంభం  లా కనిపించింది. తీరా చూస్తే అదొక గొడ్డలి కర్ర. ఇంకేం దొరకలే.

ఆంథియా మటుకు తవ్వుతూనే ఉంది. ఏ పనైనా చివరంటా చెయ్యటం ఆమె అలవాటు. ఆస్ట్రేలియా దాకా వెళ్ళకుండా తవ్వకం ఆపటం తలవంపులని అనిపించింది.

గుహ లోంచి బయటా పడ్డాక బోలెడు దాహం వేసింది. వెళ్ళి ఇంట్లో లెమనేడ్ తాగుదామనుకుంటూ ఉండగా…

” అబ్బే, అది అలా అనలేదు ” – ఆంథియా మృదువుగా చెప్పింది. ” మేమెవరమూ నీకేమీ హాని చేయం. భయపడద్దు ”

” హానా ? నాకా ? భయమా ? నేనెవరనుకుంటున్నారు ? ” – నిటారుగా నిలుచుంది అది. ఒంటి మీది బొచ్చంతా ఒక్కసారి నిక్కబొడుచుకుంది.

” సరే సరే ” – ఆంథియా సామరస్యం గా అంది. ” నువ్వెవరో తెలిస్తే నీకు నచ్చేలా మాట్లాడతాం. ఏమన్నా నీకు కోపమొస్తోంది మరి. నువ్వు ఎవరివి అసలు ? దయచేసి కోప్పడకు , మాకు నిజంగా తెలీదు ”

” తె- లీ – దా ? ” అది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ” కాలం మారిందని విన్నానుగానీ ఇంత మారిపోయిందనుకోలేదు. శామీడ్ కనిపిస్తే అది శామీడ్ అని తెలుసుకోలేనంత ??? ”

” శామీడ్ ? ఇదేదో గ్రీక్ లా ఉంది నాకు ”

” నీకేగాదు అందరికీ గ్రీకే అది.  ‘ సికత యక్షిణి ‘ – అదీ తెలీదా – ‘ ఇసక యక్షిణి ‘ – ఇప్పుడు కూడా గుర్తు పట్టరా  ? ”

అది దిగులుపడుతున్నట్లు కనిపించింది. జేన్ చటుక్కున అందుకుంది – ” అవునవును. నువ్వు ఇసక యక్షిణి వే. అందుకే కదా నిన్ను చూద్దామనుకున్నది మేము ”

” మీరు నన్ను చూడాలనుకోవటం చాలా వాక్యాల వెనకన ” – అది చిరాగ్గా  ఇసక లోకి దొర్లబోయింది.

” వెళ్ళకు వెళ్ళకు. ఇంకొంచెం మాట్లాడు ” – రాబర్ట్ అరిచాడు. ” నువ్వు ఇసక యక్షిణివనైతే నాకు తెలీలేదు గాని చాలా అద్భుతమైనదానివి అని అనుకున్నా చూస్తూనే ”

శామీడ్ కొంచెం శాంతించినట్లు తోచింది.

” ఆ. మాట్లాడేందుకేం లే – మీరు మర్యాదగా ఉన్నంతవరకూ. ఏదో పిచ్చా పాటీ ఐతే పెట్టుకోలేను నేను. మీరేదైనా అడగండి, నాకు బుద్ధిపుడితే జవాబు చెప్తా ”

ఏమడగాలో ఎవ్వరికీ తట్టలేదు చాలాసేపు. ఆ లోపు అదెక్కడ పోతుందోనని గాభరా.

ఆఖరికి రాబర్ట్ – ” నువ్వు ఇక్కడ ఎంతకాలం నుంచీ ఉంటున్నావు ? ”

” అబ్బో, కొన్ని యుగాల బట్టీ. కొన్ని వేల ఏళ్ళు ”

” చెప్పవా అదంతా ? ”

” అవన్నీ పుస్తకాల్లో ఉంటాయి ”

” లేవు. నువ్వు పుస్తకాల్లో ఎక్కడున్నావేమిటీ ? చెప్పవా చెప్పవా – మంచిదానివి కదూ ? నీకు తెలిసిందంతా – అంతా చెప్పు ”

శామీడ్ మీసాలు దువ్వుకుని వాటి వెనకనుంచి మందహాసం చేసింది.

” చెప్పవా చెప్పవా ” – ఏకకంఠం తో అడిగారంతా.

ఏ విషయానికైనా , అది ఎంత ఊహించలేనిదైనా – అలవాటుపడిపోవటం సాధ్యం. పదినిమిషాల కిందట పిల్లలకి ప్రపంచం లో శామీడ్ అనబడేది ఉందనే తెలీదు – ఇప్పుడేమో ఎప్పట్నుంచో మాట్లాడేస్తున్నట్లే అనిపిస్తోంది. అది ఒకసారి కళ్ళు లోపలికి తిప్పుకుని ప్రారంభించింది –

” ఆహ్. వెచ్చగా హాయిగా ఉంది కదూ, పాత రోజుల్లోలాగానే ! మెగాథీరియమ్ లు వస్తుంటాయా ఇక్కడికి ? ”

” ఏమిటీ ? ” – అలా అడగటం పద్ధతి కాదని తెలిసినా అడక్కుండా ఉండలేకపోయారు. మెగాథీరియమ్ ???

” టీరోడాక్టైల్ లు ఎక్కువే ఉన్నాయా ఇక్కడ ? ” మళ్ళీ అడిగింది అది.

పిల్లలు నోరు విప్పలేదు.

” పొద్దుటే బ్రేక్ ఫాస్ట్ కి ఏం తింటారు మీరు ? ” – అసహనం గా అడిగింది శామీడ్ – ” ఎవరు పెడతారు మీకు ? ”

” గుడ్లూ పాలూ పారిడ్జ్. మా అమ్మ పెడుతుంది. టీరోడాక్టైల్ లు అంటే ఏమిటి ? వాటిని బ్రేక్ ఫాస్ట్ కి తింటారా ? ”

” పొద్దుటే అవి తింటం కొత్తా ఏమిటి ? ” శామీడ్ విసుక్కుంది. ” అవి కొంచెం మొసళ్ళలాగా కొంచెం పక్షుల్లాగా ఉంటాయి. ఆ రోజుల్లో శామీడ్ లు ఎక్కడంటే అక్కడే ఉండేవి. పొద్దున్నే ఎవరోకరు ఒక శామీడ్ ని వెతికి పట్టుకునే వారు. అది ఒక వరం ఇచ్చేది. మామూలుగా ఇంట్లో పెద్దపిల్లాడిని పంపిస్తుండేవాళ్ళనుకుంటా. టీరోడాక్టైల్ లైతే మామూలు రోజుల్లో. పెద్ద పెద్ద విందులూ అవీ ఉంటే మెగాథీరియమ్ లనే కోరుకునేవాళ్ళు. అవి చాలా పెద్దగా ఉంటాయి, బోలెడు మందికి సరిపోయేవి. చేపలు కావస్తే ఇక్థియోసారస్ లూ కోళ్ళు కావస్తే ప్లీసియోసారస్ లూ కోరుకునేవాళ్ళు. ఇక్థియోసారస్ తోకలూ మొప్పలూ చాలా రుచిగా ఉంటాయట ” [ * – టీరోడాక్టైల్ లు, మెగాథీరియం లు, ఇచ్థియోసారస్లు, ప్లీసియోసారస్లు – అన్నీ prehistoric జంతువులు ]

” మిగిలిన మాసం దాచుకునేవాళ్ళా ? ” – అంథియా కి వంటింటి వ్యవహారాలంటే ఆసక్తి.

” లేదు లేదు. చీకటి పడితే మిగిలిందంతా రాళ్ళుగా మారిపోయేది. మెగాథీరియమ్  ల ఎముకల రాళ్ళు ఉన్నాయట గా ఇక్కడంతా, అంటారు లే ”

” ఎవరు ? ఎవరన్నారు నీతో ? ”

శామీడ్ జారుకోబోయింది.

” వెళ్ళకు. చెప్పు. అప్పుడు ప్రపంచం ఇలాగే ఉండేదా ? ”

” ఎబ్బే. అంతా వేరే. ఎక్కడ చూసినా ఇసకే అప్పుడు. బొగ్గులు చెట్లకి కాసేవి. గడ్డిపూలు ఇంతేసి పళ్ళాలంత ఉండేవి. ఇప్పుడన్నీ రాళ్ళైపోయాయిలే, కనిపిస్తాయి – చూస్తే. శామీడ్ లు సముద్రం ఒడ్డున ఉంటుండేవి. పిల్లలు పలుగులూ పారలూ తెచ్చి ఇసక తవ్వి వాటికి కోటలు కట్టిపెడుతుండేవాళ్ళు. ఇంకా అలాగే కడుతుంటారట కదా , సముద్రం ఒడ్డున ?”

” తర్వేతేమైంది ? మీ కోటలూ అవీ ఏమయాయి ? ”

” అదొక విషాద గాథ. శామీడ్ లకి తడి తగిలితే చచ్చిపోయే జబ్బు ఒకటి మొదలైంది. సముద్రం పక్కన తడిలేకుండా ఎలా ? అందుకని ఒక్కొక్కటీ చచ్చిపోతూ వచ్చాయి ”

” నువ్వూ తడిశావా పాపం ఎప్పుడైనా ? ”

శామీడ్ వణికిపోయింది. ” ఒకేఒక్కసారి. నా ఎడమ మీసం లో పదహారో వెంట్రుక చివర తడిసింది. ఇప్పటికీ చలిగా ఉంటే అక్కడ సలపరం అనిపిస్తుంది. అప్పుడు నేను సూర్యుడి కింద ఆ వెంట్రుక ఎండబెట్టుకుని బాగా దూరం గా వెళ్ళిపోయి పొడి ఇసక తవ్వుకుని ఇల్లు కట్టుకుని ఉండిపోయాను. ఆ తర్వాత సముద్రం వేరేచోటికి వెళ్ళిపోయిందిలే. ఇంకంతే. ఏం చెప్పను మీకు ”

” ఇంకొక్కటే . చెప్పు. ఇంకా వరాలు ఇవ్వగలవా నువ్వు ? ”

” ఎందుకివ్వనూ ? ఇందాక మీరు నన్ను బయటికి రమ్మంటే వచ్చాగా, అది వరమే ”

” ఇంకోటేదైనా ఇస్తావా ? ”

” ఆ- సరే. తొందరగా అడగండి. నాకు విసుగొస్తోంది. పోవాలి నేను ”

వరాలు అడగమన్నప్పుడు బుర్ర తక్కువ వరాలు కోరుకుని అవస్థ పడినవాళ్ళ కథలు బోలెడు తెలుసు పిల్లలకి. వాళ్ళైతే ఏం అడిగి ఉందురో చాలాసార్లు ఆలోచించి పెట్టుకున్నారు కూడా. ఇప్పుడొక్కటీ గుర్తు రాందే ?

” త్వరగా ” – రుసరుసలాడింది శామీడ్.

ఆంథియా కి మనసులో ఒకటి ఉంది. తనకీ జేన్ కీ ప్రత్యేకం అది. అబ్బాయిలకి ఏం నచ్చకపోవచ్చు. అయినా సరే అడిగేసింది – ” మేమంతా విపరీతమైన అందం గా అయిపోవాలి ”

ఒకరి మొహాలొకరు చూసుకున్నరు. రోజూ ఉన్నట్లే ఉన్నారు. ఏం మార్పు లేదు. శామీడ్ కళ్ళు మిటకరించుకుంది. ఊపిరి బిగబట్టి ఒళ్ళు ఉబ్బించింది. మామూలు కొలతకి రెండు రెట్లైంది.

” అలవాటు తప్పిపోయీ- కష్టం గా ఉంది ”- చెప్పింది.

” అయ్యో అవునా. వద్దులే పోనీ ”

” అలా కాదుగానీ అంతా కలిసి రోజుకి ఒక్కటి అడగండి. ఇస్తాను. అంతకంటే ఇప్పుడు నా వల్ల అయేట్లు లేదు ”

” సరే సరే ” – అన్నారేగాని ఎవరికీ అదేదో  చేస్తుందని ఏమాత్రం నమ్మకం లేదు.

శామీడ్ ఇసకలో  కాసేపు పొర్లి మళ్ళీ ప్రయత్నించింది. ఉబ్బటం మొదలెట్టింది. ఉబ్బుతూనే ఉంది.

” అయ్యో. దానికేమైనా అవుతుందేమో ” – ఆంథియా కి జాలేసింది.

” చర్మం చిట్లిపోతుందో ఏమో ” – రాబర్ట్ కి భయం పుట్టింది.

అంత పెద్దగా పెరిగి, శామీడ్ ఒక్కసారి ఊపిరి వదిలి ఎప్పట్లా అయేప్పటికి పిల్లలంతా అమ్మయ్య అనుకున్నారు.

” రేపటినుంచి తేలిగ్గా వచ్చేస్తుంది లే ”

” పాపం బాగా నొప్పెట్టిందా ? ” -ఆంథియా పరామర్శించింది.

” లేదులే. ఇదిగో, ఈ మీసం చివర , కాస్త. మంచిపిల్లవి నువ్వు. వెళ్ళొస్తా ”

చేతులూ కాళ్ళతో గబా గబా తవ్వేసి ఇసకలోకి మాయమైంది. పిల్లలు మొహాలు చూసుకున్నారు. ప్రతివాళ్ళకీ ముగ్గురు కొత్తమనుషులని చూస్తున్నట్లుంది… అద్భుతమైన అందం ఉన్నవాళ్ళెవర్నో. అనుకున్నారూ, వాళ్ళ తోబుట్టువులెక్కడికో వెళ్ళిపోయి ఈ కొత్తవాళ్ళు వచ్చారనీ, శామీడ్ లోపలికి పోతున్న గడబిడ లో చూసుకోలేదనీ.

ఆంథియా అమిత మర్యాద గా జేన్ ని అడిగింది – ” ఏమనుకోవద్దూ, ఇద్దరు అబ్బాయిలూ ఒకమ్మాయీ ఇటు వెళ్ళటం చూశావా ? ” . జేన్ కి పెద్ద పెద్ద కళ్ళు  నీలిరంగులో తళతళలాడిపోతున్నాయి. జుట్టు దట్టంగా కుచ్చులు కుచ్చులు గా నేలదాకా జీరాడుతోంది.

” నేనూ అదే అడుగుదామనుకుంటున్నా ”

” నువే జేన్ వి ” సిరిల్ అరిచాడు. ” నీ గౌన్ కి అక్కడ చిల్లుంది. నువ్వే. నువ్వు ఆంథియావి – నీ మాసిపోయిన చేతిగుడ్డ అలాగే ఉంది ! అయితే ఆ వరం నిజమైందన్నమాట – నువు రాబర్ట్ వి, నేనూ నీ అంత అందం గా అయానా ? ”

” నువ్వే సిరిల్ వి అయితే ఇదివరకటి కన్న ఎక్కువ నచ్చుతున్నావు. నీ జుట్టు బంగారు రంగు ! రాబర్ట్ జుట్టు నల్ల- గా మెరిసిపోతోంది. ఇద్దరూ చెరో రకం రాజకుమారుడిలాగా ఉన్నారు ” – ఆంథియా మురిసిపోయింది. ఆమెకి అందం పిచ్చి.

” ఏడిసినట్లే ఉంది. మీరిద్దరూ క్రిస్మస్ కార్డ్ ల మీది దేవకన్యల బొమ్మల్లా ఉన్నారు. మనుషుల్లాగా లేరు ” – రాబర్ట్ కేం నచ్చలేదు.

” సరే. ఒకర్నొకరు అలా అనుకుని ఏం చేస్తాం. పదండి. గొర్రె పిల్ల ని ఎత్తుకుని ఇంటికిపోదాం. మార్తా మనల్ని చూసి సంతోషిస్తుంది… ” –

పాపాయి అప్పుడే నిద్ర  లేస్తోంది. అది ఎప్పట్లాగే ఉంది. అద్భుతమైన అందం గా ఏమీ అయిపోలా.అయినా అందరికీ అది అలా ఉండటమే బావుందెందుకో

” దా, దా . అక్క దగ్గరికి దా ” – ఆంథియా ఎత్తుకోబోయింది. అందర్లోకీ ఆంథియా అంటే దానికి ఇష్టం.

పాపాయి రాలేదు. ”  పొ ” అని తల తిప్పేసుకుని నోట్లో వేలేసుకుంది .

” దా దా…” జేన్ పిలిచింది. పాపాయి నోట్లో వేలు తీసి  దాన్లో అది ” అక్త ” అనుకుంది. ఏడుపొస్తోంది దానికి.

ఇద్దరు అన్నలూ వెళ్ళి పిలిచారు. ” పొ.పిచబ్బయ్  ” అనేసి దుఃఖించటం మొదలెట్టింది.

అందరికీ అర్థమైంది. పాపాయి ఎవర్నీ గుర్తు పట్టట్లేదు. ఎలా ఇప్పుడు ?

సిరిల్ బలం గా ఎత్తుకోబోయాడు. పాపాయి గింజుకుని రక్కింది. సన్న పళ్ళేసుకుని కొరికి పెట్టింది.

” ఇప్పుడి దీన్ని కొత్తవాళ్ళం   లాగా మంచి చేసుకోవాలి కాబోలు – ఖర్మ ! ”

పాపాయి ని ‘ మంచి ‘ చేసుకునేప్పటికి గంట పట్టింది. అప్పటికి దానికి ఆకలి మొదలై ఎత్తుకోనిచ్చింది గాని చేతుల్లో నిలవదు, నీలుక్కుపోతోంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కష్టపడి మోసుకుంటూ ఇల్లు చేరి తలుపు కొట్టారు.

మార్తా తలుపు తీసి పాపాయిని గబుక్కున ఎత్తుకుని – ” అమ్మయ్య. పాపాయి వచ్చింది. తక్కిన వాళ్ళేరీ ? ” అని అడిగింది.

” మేమే ” -అన్నాడు రాబర్ట్.

” ఆ. మీరేలే. మా పిల్లలు ఏరీ అని ?”

” ఇదిగో చూడు మార్తా, మేమే. నేను ఆంథియాని. చాలా అందం గా అయిపోయాన్లే. అయినా నేనే. ఆకలేస్తోంది ”

” ఆహా ” – మార్తా వాళ్ళ మొహాల మీద తలుపేసుకుంది. ఎంత  కొట్టినా లాభం లేకపోయింది. రాబర్ట్ ధబీ ధబీ బాదుతూంటే – పోలీసులని పిలుస్తానని కిటికీ లోంచి మార్తా ప్రకటించి అది కూడా ధడేల్న మూసింది.

దరిదాపుల్లో ఎక్కడా ఇల్లు లేదు.. ఎవర్నైనా తినేందుకు అడగచ్చనుకుంటే. ఈసురోమంటూ పిల్లలు అటూ ఇటూ తచ్చాడారు. సిరిల్ ధైర్యం చేసి, నీళ్ళ గొట్టం పట్టుకుని మొదటి అంతస్తు కిటికీ వైపుకి ఎగబాకబోతే మార్తా అతని మొహాన చన్నీళ్ళు దిమ్మరించింది. అప్పుడే ఒక కాన్స్టేబుల్ ఆ వైపు రావటం తటస్థించింది. పట్టుకుపోతాడా ? అద్భుతమైన అందం తో వెలిగిపోతున్నందుకు ???

” చీకటి పడితే మామూలుగా అయిపోతామేమో కదా ? ” – ఆశ.

” చీకటి పడ్డాక రాళ్ళం అయిపోతే ? ” ఎవరికీ ఏమనేందుకూ ధైర్యం రావట్లేదు. వెళ్ళి మళ్ళీ  శామీడ్ ని పట్టుకుంటేనో ?

వెళ్ళి పిలిచారు. అరిచారు. తవ్వారు.

ఊహూ. శామీడ్ అనబడేదేదీ  దర్శనమివ్వలేదు.

శోష లు వచ్చి అక్కడే పడి ఉండిపోయారు.

నిద్రపోయారు.

చీకటి పడింది.

ఆంథియా కి ముందు మెలకువ వచ్చింది. తనని తను గిల్లి చూసుకుంది. మెత్తగానే ఉంది. రాయి అయిపోలా. తక్కినవాళ్ళనీ గిల్లింది. అందరూ మెత్తగానే ఉన్నారు. ఒక్కో మొహమూ తేరిపారచూసింది.

” లేవండి లేవండి. ఒరేయ్ సిరిల్ , నీ మొహం మీది మచ్చలు – రాబర్ట్ , నీ వంకర ముక్కు – జేన్ , నీ చింపిరి జుట్టు – అబ్బా- ఎంత బావున్నార్రా..” ఆంథియా కి ఏడుపొచ్చేసింది.

ఇంటికి పడిపోయారు.

మార్తా తలుపు తీసి అంత సేపూ ఎక్కడికి పోయారని తిట్టిపోసింది.

” వాళ్ళెవరో వచ్చారు నలుగురు . వాళ్ళిల్లే  అయినట్లు లోపలికి రాబోయారు. చూసేందుకు మహా చక్కగా ఉన్నార్లే, ఐతే మాత్రం -నాకేమిటట ? ”

” వాళ్ళా- వాళ్ళ వల్లే మేం రాలేకపోయాం ”

” అదేమిటదీ ? ”

” వాళ్ళు మమ్మల్నొక చోట బంధించేశారు. సూర్యాస్తమయం అయితేగాని విడిపించలేదు. ఎరక్కపోయి నమ్మాం వాళ్ళని , చెత్త వెధవలు. ఆకలేస్తోంది మార్తా ”

” వేస్తుంది, ఎందుకెయ్యదూ ? పొద్దుననంగా పోయారు ఊరిమీదికి . మళ్ళీ ఎప్పుడైనా ఎరగని వాళ్ళతో పెత్తనాలు చేస్తే మీ పని చెప్తా. ఆ పిల్లలెక్కడైనా కనిపిస్తే మాట్లాడకండి. కావస్తే నాకు చెప్పండి- తేలుస్తా వాళ్ళ అందం గిందం – వెధవ ఎచ్చులూ వాళ్ళూనూ ”

బల్ల మీద వేడి వేడి భోజనం.

” అబ్బే. మళ్ళీ ఎప్పుడూ వాళ్ళ జోలికి వెళ్ళంగా ”

 

[ ఇంకా ఉంది ]

 

 

 

8 Comments

 1. అదేదో సినిమాలో హీరో “మనలో ఉండే చిన్నపిల్లాడిని… జీవితాంతం సజీవంగా ఉంచాలి .. అప్పుడే జీవించటం అవుతుంది” అంటాడు …మీలాంటి రచయితలు ఇలాంటి అద్భుత రచనలని పరిచయం చేస్తూ ఉంటే , బాల్యం సజీవంగా కాక ఇంకోలా ఎలా ఉంటుంది ?

  Liked by 1 person

  1. థాంక్ యూ అండీ. రాస్తాను రెగ్యులర్ గా. మొత్తం 11 భాగాలు…

   Like

 2. అద్భుతం ఆంటీ. ఆ చోటెక్కడో చెబుదురూ.. వెళ్లిపోవాలనుంది అక్కడికి.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s