స్వాధీన – మైథిలి అబ్బరాజు

 

ఆ వారం చివరన వాళ్ళిద్దరూ రాజీ  చేసుకున్నారు . అంటే అంతకుముందేదో పోట్లాడుకున్నారని కాదు. రెండేళ్ళ పరిచయం లో దెబ్బలాటలు లేనేలేవు. అదొక ఒప్పందమని అనుకోవచ్చు – పెద్దమనిషి తరహాగా. నీలిమ

ని  శరత్ పెళ్ళిచేసుకోమని అడగకూడదు – ఎందుకు చేసుకోవాలో తన కారణాలన్నిటినీ ఏకరువు పెట్టకూడదు.  నీలిమ తనంత తానుగా కాదని చెప్పకూడదు – ఎందుకు వద్దో అదంతా కుండబద్దలు కొట్టకూడదు.

అంతకు ముందు అతను మూడు నాలుగుసార్లు కాల్ చేశాడు ఆమెకి. ” మూడు నాలుగు రోజులు సెలవు దొరికేటట్లుంది  . ఇదంతా వదిలేసి ,  దూరంగా  ఎటైనా   కార్లో పడిపోదామనిపిస్తోంది. నాతో రాకూడదూ నువ్వు ? ”

నీలిమ కి బోలెడంత పని. డెడ్ లైన్స్ ఉన్నాయి . టీమ్ లో ఇద్దరు సెలవ మీద వెళ్ళారు .

” ఏమో-  కుదరదనుకుంటా…”

” ప్రయత్నించు ” – అతను అడ్డుపడ్డాడు. ” ఏదోకటి చెప్పు మీ హెడ్ కి . మీ అత్తయ్యకి బాగాలేదనీ నీ కోసం దిగులు పడిందనీ – ”

” అబ్బా, అంత తేలిగ్గా ఎలా …” ఇంతలేసి వెడల్పున్న కళ్ళద్దాలని నుదుటిమీదికి నెట్టుకుని తన ముందర పేరుకున్న పనినంతా చూసిందొక్కసారి.

అతను –  ” ఒక వీకెండ్ కి వెళదాం అయితే . . శుక్రవారం సాయంత్రం నీ పనైపోయాక బయల్దేరదాం. ఆదివారం సాయంత్రానికిబెంగుళూరు    వచ్చేయచ్చు ”

” ఎక్కడికెళదామని అసలు ? ”

” నాకైతే  వేనాడ్   వెళదామని ఉందిగానీ అంత దూరం కుదరదుగా. అరణ్యక అని రిసార్ట్ హోటల్ ఉంది బి ఆర్ హిల్స్ లో  – అక్కడికి ”

” నువ్వు ఇదివరకు పనిచేసేవాడివీ- అదేనా ? ”

” అవును అదే. ఎన్ని నేర్చుకున్నానో అక్కడ. నువ్వు చూద్దువుగాని,  ఎలా ఉంటుందో ”

” కోటీశ్వరులకే అందుబాటులో ఉంటుందనుకున్నానే ? ”

” నేను ఆ హోటల్ చెయిన్ లోనే ఉన్నానుగా ఇప్పటికీ. బాగా తగ్గింపు ధర లో వస్తుంది. నువ్వు సరేనంటే ఇప్పుడే కాల్ చేసి ఒకటో రెండో గదులున్నాయేమో కనుక్కుంటాను ”

” అబ్బా, నన్ను మెడ వంచి ఒప్పించేలా ఉన్నావు ”

” ఆ, నిజం గా ఆ పనే చేయగలిగితే ఇంకేం ! వస్తావా, చెప్పు మరి ? ”

నీలిమ నిట్టూర్చి ఒక నిమిషం ఆలోచించింది. వెళ్ళాలనే ఉంది ఆమెకి…ఈ జనారణ్యాన్ని వదిలి అడవి లోకి-

వర్షాకాలం. కొండలూ లోయలూ .పువ్వులూ…

” సరేగాని నువ్వు ..” ఆగిపోయింది. ఆఫీస్ లో ఆ మూలన కొత్త రిక్రూటీ ఉంది- చిన్నపిల్ల. వినననట్లు నటిస్తూ కవర్ లూ కాయితాలూ సర్దుతోంది.

” అంటే, మనం … ” – మళ్ళీ ఆగింది.

” లేదు. అలా ఏం ఉండదు ” – కాస్తాగి అన్నాడు అతను. ” మనం వాదించుకోబోట్లేదు. పెళ్ళీ , ఉంగరాలూ మంగళవాద్యాలూ   – శాశ్వతమైన విషయాలన్నీ నిషిద్ధం. ఊరికే అలా వెళ్ళొద్దాం, సరదాగా- అంతే . ”

నీలిమ మొహం మీదికి చిరునవ్వు వచ్చింది.

” వూ. బావుండేటట్లే ఉంది ”

” బావుండేటట్లు ? ”

” లేదులే. బావుంటుంది. ”

” శుక్రవారం సాయంత్రం నాలుగింటికి   నీ ఆఫీస్ కి రానా మరి ? సర్దుకుని వచ్చేస్తావా అప్పటికి ? ”

” సరే . గురువారం రాత్రే అన్నీ సర్దేసి , పెట్టె కార్ లో పెట్టుకొచ్చుకుంటాను ”

” మరి నీ కార్ ఎలా ? ”

” సెల్లార్ లో వదిలేయచ్చులే ”

” ఐ లవ్ యూ నీలిమా ”

” నువ్వు నాకు మాటిచ్చావు ”

” ఇవ్వలేదు. పెళ్ళి చేసుకోమని అడగనని మా- త్రమే మాట ఇచ్చింది. దానికీ దీనికీ ఏం సంబంధం లేదు. ఆ మాత్రం తెలియదా మనకి ఈ పాటికి ? ” – కాస్త నిష్టూరం గా అన్నాడే కానీ అతనికీ నవ్వొచ్చింది. గొంతులో తెలిసిపోయింది ఆమెకి.

” శుక్రవారం సాయంత్రం. కలుద్దాం ‘’

*****

ఇంచుమించు చేరిపోతున్నారు. నగరం లోంచి బయటపడేసరికే  గంట పట్టింది – వీకెండ్ రద్దీలో. ఆ తర్వాత ఇంకో గంట. ఉన్నట్లుండి పరిసరాలన్నీ మారిపోయాయి.నల్లటి తారు రోడ్లు  ఇంకా నల్లబడ్డాయి. వాన తుంపర  లో  ఆకులూ కొమ్మలూ   తూగుతున్నాయి.  పసుపు గులాబి వెలుగు  సంధ్యనంతా కప్పేసింది. ఆరేడు చాయల ఆకుపచ్చ తో ఎవరో గీస్తున్న బొమ్మ – కిలోమీటర్ ల మేరన – తడి తడిగా. అరకుండా. దిగంతాల అంచుల్లాగా ఊదా రంగుల కొండల వరస.

” ఇలా ఎంత దూరమైనా పోదాం . ఊటీ వెళ్ళచ్చా ఇలా ? ” – నీలిమ కి ఆరాటం.

” కాని వెళ్ళట్లేదు మనం.  అరణ్యక  వరకే వెళుతున్నాం, అక్కడికి దాదాపుగా – వచ్చేశాం ” – కార్ అడ్డదారిలోకి మళ్ళి కొండవాలు లోకి దూసుకువెళ్ళింది. పుస్తకాల్లో బొమ్మలు గీసినట్లున్నాయి ఆ ఇళ్ళు. అటూ ఇటూ రెల్లు పొదలతో పారుతూన్న ఏరు, దాని పైన వంతెన. ఇంకా చాలా చెట్లు – తర్వాత గేట్ హౌస్. ఆ లోపలికి రోడ్ – పైకి వంపు తిరిగి. కంచెకి తెల్లటి రంగు వేసి ఉంది. గడ్డిబీళ్ళలో గుర్రాలు. దూరం గా సరస్సు కాబోలు. గోల్ఫ్ కోర్స్ కూడా ఉన్నట్లుంది. మలుపు తిరిగేసరికి ఆ పెద్ద పాతకాలపు ఇల్లు ప్రత్యక్షమైంది. రెండే అంతస్తులు – పొడుగ్గా ,ఏటవాలు కప్పుతో.  వెనకటి పద్ధతిలో కిటికీలకి కమ్మీలు.

” ఎం- త బావుందో ! ”

” ఎంత బావుంటుందో ముందుగా చెప్పలేదు కావాలనే . తర్వాత నీకు అంత లేదనిపిస్తేనో…”

” ఎన్నాళ్ళు పనిచేశావు ఇక్కడ ? ”

” నాలుగేళ్ళు. అసిస్టంట్ మానేజర్ గా. పేరుకే ఆ పదవి – అన్ని రకాల పనులూ నావే. నేర్చుకున్నది అంతా ఇక్కడే ” – కాస్త గర్వం గా చెప్పాడు.

” దీన్ని హోటల్ గా మార్చి ఎన్నాళ్ళైంది? ”

‘’ ఎవరో బ్రిటిషర్స్ ది. కాఫీ ఎస్టేట్ బంగళా. చాలా ఇష్టం గా కట్టుకున్నారట. చాలామంది సంతానం.  1947 తర్వాత కూడా కొన్నేళ్ళు ఉన్నారట. ఒకరొకరూ వెళ్ళిపోయాక కొన్నేళ్ళు ఖాళీ గా ఉండిపోయింది. ఆఖరికి  1970 లలో అమ్మేశారు. ఆ కుటుంబం వారసుడొకాయన నేను పనిచేస్తుండగా వచ్చారొకసారి. వెళ్ళిపోయేప్పటికి పదేళ్ళట ఆయన వయసు. బాగా ఇమోషనల్ అయిపోయారు. ” దిస్ వస్ ఎ హోమ్ ఆఫ్ లవ్ ” అన్నారు నాతో. ఇల్లు కట్టినాయనకి భార్యంటే చాలా ప్రేమట. వాళ్ళ పడకగది చాలా విశాలం గా అందం గా ఉంటుంది. దాన్ని హనీ మూన్ స్వీట్ కింద చేశారు. మంచి  పేరుంది దానికి .’’

– కార్ చక్రాల కిందని గులకరాళ్ళ శబ్దం. విశాలమైన వసారా అంతా రంగురంగుల గులకరాళ్ళు పరచి ఉన్నాయి..

శరత్ ఇంజన్ ని ఆపేసి సీట్ బెల్ట్ తీసేసి  నీలిమ వైపు చూసి నవ్వాడు . ” కంగారు పడకు. మనం అందులో దిగటం లేదులే ”

” దిగుతామని నాకు అస్సలు అనిపించలేదులే ”

” అంటే – దిగితే చాలా చాలా బావుంటుందనుకో…”

”   శరత్..” – ఆమె గొంతు నిండా హెచ్చరిక. ” నువ్వు మాటిచ్చావు ”

” ఏమనేమిటి ? హనీమూన్ స్వీట్ గురించి మాట్లాడను అనా ? ”

” హనీమూన్ కి సంబంధించే ఏ ఒక్క విషయం గురించైనా సరే, మాట్లాడనని ”

” ఇంత అందమైన చోటు – కష్టం గా ఉంది ..”

” అయితే ఇక్కడున్నంత కాలం – అదిగో, అక్కడ గోల్ఫ్ ఆడుకుంటూ కూర్చో ”

” నువ్వూ వచ్చి ఆడతానంటే-   అలాగే ”

” నేనెందుకొస్తానూ- నాలాగా ఏ బాదరబందీ లేని అమ్మాయెవరైనా కనిపిస్తే కబుర్లు పెట్టుకుంటాను టీవీ సీరీస్ ల గురించి  ”

శరత్ నవ్వటం మొదలెట్టాడు . ” ఆహా, ఎంత మంచి వీకెండ్ గడపబోతున్నాం ” – చటుక్కున వంగి ఆమెని ముద్దు పెట్టుకున్నాడు. ” కోపంగా ఉంటే ఇంకా ప్రేమించబుద్ధేస్తుంది నిన్ను. దా, వెళదాం. సామాను ఎవరో తెస్తార్లే ”

దిగగానే వందల కొద్దీ సంపెంగల పరిమళం చుట్టుకుంది. అవును. ఆ ప్రాంతం ఆ పూలకి ప్రసిద్ధి. ‘ దొడ్డ సంపెగె ‘ అంటారు.  రంగుల రాళ్ళ మీంచి , గాజు తలుపులు తెరుచుకుని లోపలికి. లోపల పెద్ద హాల్. ఎర్రగా గచ్చు చేసిన నేల. గోడలకి చెక్క పలకలు.  పెద్ద మెట్లవరస – పైన అటూ ఇటూ వరండా లు. ఒక మూలన పెద్ద నెగడు, మండుతూ. చితుకులు చిటపటలాడే చప్పుడు, గోడ గడియారం టిక్ టిక్ మని చప్పుడు – అంతే. నిశ్శబ్దం.

*****

మెట్ల కిందని రిసెప్షన్ లో ఒకతను అటువైపు తిరిగి ఏదో సర్దుకుంటున్నాడు. గబగబా వెళ్ళి వెనకనుంచే అతన్ని కౌగలించుకున్నాడు.

” శ్రీకాంత్  ! ”

అతను ఆశ్చర్యం గా ఇటు తిరిగాడు. మొహం లో ఒక్కసారిగా పెద్ద నవ్వు.

” అరే,  శరత్ – నువ్వేమిటిక్కడ ? ”

” దిగుదామని వచ్చానురా. చూడలేదా నా పేరు , కంప్యూటర్ లో ? ”

” చూశానూ- సి. శరత్  అని ఉంది. పూర్తి ఇంటిపేరు లేదు- నువ్వనుకోలేదు…”  శరత్  భుజం మీదుగా అవతలికి చూసిన    శ్రీకాంత్ మొహం లో సంతోషం . ” వాటె ప్లసంట్ సర్ప్రైస్ ! ”

శరత్ కాస్త వెనక్కి తగ్గి పరిచయం చేశాడు – ” తను నీలిమ. నా ఫ్రెండ్ . ”

శ్రీకాంత్ సర్దుకున్నాడు. ” హోటల్ మానేజ్ మెంట్ ఇద్దరం కలిసి చేశామండీ ఢిల్లీ లో. ఎన్నో ఏళ్ళైనట్లుంది ”

” శ్రీకాంత్ గారు ఇక్కడే ఉన్నట్లు తెలుసా నీకు ? ” – అడిగింది.

” ఆ. తెలుసు. ఉన్నాడనే సగం ధైర్యం ”

” నువుండేది బెంగుళూర్ లో  కదా ? ” – శ్రీకాంత్.

” ఆ. యశ్వంతపూర్ లో. కాస్తఖాళీ దొరికింది – నువ్వేం చక్కబెడుతున్నావో చూసిపోదామని వచ్చాలే ” – చుట్టూ చూస్తూ – ” ఊ. పర్లేదు . టేబిల్ క్లాత్ ల మీద మరకలు లేవు, ఆష్ ట్రే లు నీట్ గా ఉన్నాయి…బిజినెస్ బావుందా ? ”

” యా. ఏడాది  లో పదినెలలపాటు పూర్తిగా నిండిపోతోంది ”

” హనీ మూన్  స్వీట్  ని ఇంకా బాగా చేశారని విన్నాను- అదీ నిండుతోందా ? ”

” ఆ. ఈ వీకెండ్ కి బుక్ అయిపోయింది. కొంపదీసి నీకేమైనా…? ”

” అరెరె. అదేం లేదు. నీలిమా నేనూ – ఊహూ. ”

మాట మారుస్తూ శ్రీకాంత్ అడిగాడు . ” ఏమైనా డ్రింక్స్ ? ”

” టీ. ” – నీలిమ.

” జాస్మిన్ టీ బావుంటుందిక్కడ – తాగుదాం ”

*****

ఎవరిదో పేద్ద , చక్కటి ఇంటికి వెళ్ళి ఉన్నట్లుంది నీలిమకి. కాకపోతే ఇంట్లోవాళ్ళకేమీ సాయాలు చేయక్కర్లేదు. ఆ ఇల్లు అమ్మిన కుటుంబం వాళ్ళ ఫర్నీచర్ తోబాటు గా ఇంకా దేన్నో కూడా వదిలి వెళ్ళినట్లున్నారు. వాళ్ళు ఇంకా అక్కడే ఉంటున్నట్లూ కాసేపట్లో బయటనుంచి వచ్చేస్తారేమో అన్నట్లూ అనిపిస్తోంది. కొత్త కాలానికి అనువు గా చేసిన మార్పుల వల్ల అక్కడ నిలిచిపోయిన  కళాకాంతీ ఎక్కడా తగ్గలేదు. చిట్టి చిట్టి రోజాపూలవాల్ పేపర్ శరత్  గదిలో. నీలిమ గదిలోది బుల్లి డైసీలు. . కిటికీ తెరల మీద  విలియం మారిస్  ప్రింట్ లు. 1920 ల నాటి సొగసు.

ఒకప్పటి డ్రాయింగ్ రూమ్  ని ఇప్పుడు లాంజ్ గా మార్చారు. పెద్ద పెద్ద ఫ్రెంచ్ విండో లు – వాటికవతల డాబా, దాటితే లాన్ లు.  శరత్ త్వరగా తయారై వచ్చేశాడు కిందికి భోజనానికి వెళ్ళేందుకు. . నీలిమ ఇంకా తయారవుతూనే ఉంది. కాస్త అసహనం గా మంచం అంచున కూర్చుండిపోయాడు. ఫార్మల్స్  వేసుకున్నాడు.  వైన్ రంగు బ్లేజర్, తెల్లటి షర్ట్. టై కూడా. ఆ వాతావరణానికి సరిగ్గా సరిపోయినట్లు.

” పెర్ ఫ్యూమ్   బావుంది. బర్ బరీ ? ”

” ఆ. వీకెండ్. రా త్వరగా. ఆకలేస్తోంది ”

” నువ్వు పద. నాకింకో పది నిమిషాలు. ఈ లోపు స్టార్టర్స్ తీసుకుంటూండు ”

అయిష్టం గానే లేచి వెళ్ళాడు.

అద్దం లోకి చూస్తూ తల దువ్వుకుంటోంది. ఒత్తైన  పొడవాటి జుట్టు. దాన్ని తీర్చేందుకే చాలా సమయం పడుతుంది. అద్దం లో తనని తను చూసుకుంది. ఎందుకో కొంచెం చిరాకు.

అంతా బాగానే ఉంది. కాటుక కళ్ళు,  నారింజ రంగు పెదవులు , నల్లటి ముఖ్ మల్ కుర్తా, దాని మీద మెరిసే ముత్యాలు. ఏదో లోపం.

” ఏం కావాలి నీకు ? ” – అద్దం లో అమ్మాయిని అడిగింది.

తెలియాలి. అదే  జవాబు. ఈ అనుబంధానికి తనను తాను ఇచ్చుకోగలదా అని ? ఇచ్చుకునీ అందులో పడి కొట్టుకుపోకుండా ఉండగలదా అని. ప్రేమించబడీ ఉక్కిరిబిక్కిరి కాకుండా ఉండగలదా అని. ప్రేమిస్తూనే తనకోసం కాస్త దాచుకోగలదా అని.

” నీకు అన్నీ కావాలి. గొంతెమ్మ కోరికలు ”

” అవును. కావాలి. అన్నీ . ”

” ఏదోకటి తేల్చుకో. శరత్ ని అలా ఎటూకాకుండా ఎన్నాళ్ళుంచుతావు ? తప్పు ”

” తెలుసు. అదీ తెలుసు ”

ఎవర్నైనా అడిగితే బావుండు. ఎవరైనా ఇది చెయ్యమని చెబితే బావుండు.అమ్మ ఎప్పుడూ ఒత్తిడి పెట్టలేదు. అసలామె లోకమే వేరు. బి.టెక్ అయాక మాత్రం లాంఛనం గా అడిగింది.

తను గట్టిగా వద్దనేసింది. రెండేళ్ళు ఉద్యోగం తర్వాతేనంది.  తర్వాత వెళ్ళి లక్నో లో ఎం బీ యే లో చేరిపోయింది. కాట్ రాస్తున్నట్లు కూడా ఇంట్లో చెప్పలేదు. ఆర్థికం గా ఆధారపడటం ముగిసిపోయాక అమ్మ కీ తనకీ మధ్యన చిక్కబడిన తెర. ఇవాళ వెళ్ళి దాన్ని తొలగించలేదు.

ఎందుకో ఉన్నట్లుండి వయసు వెనక్కి వెళ్ళినట్లైంది. ఆ గదిలో ఇదివరకు చిన్న పిల్లలు ఆడుకుని ఉంటారు కాబోలు. ఆడపిల్లలు కలలుగని ఉంటారు కాబోలు. వాళ్ళ కేం కావాలో పెద్దవాళ్ళు చేసిపెట్టేసేవాళ్ళేమో…ఏ నిర్ణయాలూ వాళ్ళు తీసుకోనక్కర్లేదేమో…ఆహ్. హాయిగా ఉండి ఉండును.

కాని తను చిన్న పిల్ల కాదు. ఇరవై ఎనిమిదేళ్ళు నిండిన నీలిమ. విజయవంతమైన ప్రాజెక్ట్ మానేజర్. ఏదో ఎప్పుడో అలా జరిగేదని – ఇవాళ తను పరాధీన కాలేదు.

కాస్త చందనపు ఆయిల్ రాసుకుని ,  వెడ్జ్ హీల్స్ వేసుకుని – అద్దం లోకి మళ్ళీ చూడకుండా బయటపడింది.

*****

ఇదివరకటి బాల్ రూమ్ ని ఇప్పటి భోజనాల గది గా చేశారు. నీలీ ఆకు పచ్చ స్టెయిన్ డ్ గాజు తో పైకప్పుదాకా కిటికీ. చీకటి రాత్రిలోంచి అక్కడికి మరకతాలూ ఇంద్రనీలాలూ కురుస్తున్నట్లుంది.

శరత్  నిదానం గా మాక్ టెయిల్ తాగుతూ మోమో లు కొరుకుతున్నాడు. రెస్టరాన్ట్ రద్దీగా ఉంది. మూడొంతుల టేబుల్స్ నిండిపోయాయి. బుఫే స్ప్రెడ్ బాగా ఎక్కువే ఉంది. సరాసరి ఫ్రైడ్ రైస్ తెచ్చుకుని తింటూ అంది –

” ఎప్పుడూ ఇలాగే ఉంటుందా ఇక్కడ ? వర్షాకాలం సీజన్ కాదేమోననుకున్నాను ”

” ఉన్నవే ఇరవై గదులు. నిండిపోతాయి. అయినా మాన్ సూన్ పాకేజ్ లకి పేరు ఇక్కడ. నేనున్నప్పుడే వర్క్ అవుట్ చేశాం అదంతా . ఎండాకాలం ఎలానూ వస్తారు. చలికాలం పాకేజ్ లూ తయారు చేయచ్చుగాని కావాలనే ఆగాం- అప్పుడు స్టాఫ్ ని తర్ఫీదు చేసే  తీరిక ఉంటుందని. సంక్రాంతి మాత్రం బాగా చేసేవాళ్ళం  ”

” అవును. ఇక్కడ సంక్రాంతి బావుంటుందనిపిస్తోంది ”

శరత్ కి ఆకలి తగ్గినట్లుంది.   బల్ల మీద మోచేతులు వాల్చి కాస్త ముందుకి జరిగి మెల్లిగా అన్నాడు –

” ఒక ఆట ఆడదామా ? ఇక్కడి వాళ్ళందరిలో , ఆ స్పెషల్ హనీమూన్ స్వీట్ ని ఎవరు బుక్ చేసి ఉంటారో గెస్ చేద్దామా ? ”

అతని కళ్ళు అల్లరిగా మెరుస్తున్నాయి. నీలిమ కి అంత సరదా ఏం వేయలేదు. చుట్టూ చూసింది యథాలాపం గా. పక్కనే బిలబిలమంటూ పిల్లా పెద్దా కలిపి పది మంది ఉన్నారు.. వాళ్ళలో ఇద్దరు విడిగా స్వీట్ తీసుకోవటం ఉండదేమో.  ఆ మూల కూర్చున్న కుర్ర జంట ? ఊహూ. మరీ అంత డబ్బున్నవాళ్ళలా లేరు . తమలాగే డిస్కౌంట్ లో వచ్చి ఉండచ్చు. ఈ పక్కని మధ్యవయస్కులు ? ఆవిడెక్కడో శూన్యం లోకి చూస్తోంది కిటికీ లోంచి, ఆయనేమో  మెనూ ని శ్రద్ధగా చదువుకుంటున్నాడు.  ఆవిడ మొహం లో ఉత్సాహం లేదు, ఆయన మొహం లో ఆసక్తి లేదు. వాళ్ళిద్దరికీ పెళ్ళైందనుకోవటమే నీలిమ కి విడ్డూరం గా ఉంది – ఈ వయసులో హనీమూన్ కూడానా.. ఆ చివార్న ఎవరో విదేశీయులు కూర్చున్నారు – హుషారుగానే ఉన్నారు – వాళ్ళా ? విదేశీయులలో  చిన్న వయసు వాళ్ళు ఇండియా లో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టరని విని ఉంది. వాళ్ళకి పరమావధులు వేరే దేశాల్లో ఉంటాయి, ఇక్కడ కాదు.

” ఊహూ. నాకు తెలియట్లేదు ”

అతను కొద్దిగా చేయి కదిలించి చెప్పాడు – ” ఆ ఫైర్ ప్లేస్ పక్కన కూర్చున్నారే, వాళ్ళు ”

కొద్దిగా సర్దుకుని వెనక్కి చూసింది. తన అమ్మా నాన్నల వయసుంటుందా వాళ్ళకి ? కాదు, తాతా అమ్మమ్మా. ఆవిడ జుట్టు పూర్తిగా తెల్లబడింది. పాత హిందీ సినిమాలలోలాగా ముడిపెట్టుకుంది. సన్నంచు జరీ చీర. మైసూర్ సిల్క్ అవచ్చు గాని కొత్త మెరుపేమీ లేదు. ఆయన కాస్త బొద్దుగా, బట్టతలతో. ఇన్ షర్ట్ చేసుకుని పైన అర చేతుల స్వెటర్ వేసుకున్నాడు. మామూలు వృద్ధ దంపతులు అంతే. వీళ్ళకీ హనీమూన్ స్వీట్   కీ ఏమిటి సంబంధం ?

ఉందా ?. ఇద్దరి చూపూ అవతలి వాళ్ళ మొహం మీద మాత్రమే ఉంది. నవ్వుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు…

ఏమైనా నీలిమ కి నమ్మబుద్ధి కాలేదు.

” నిజమేనా ? ”

” అక్షరాలా. శ్యాం ప్రసాద్ , సరస్వతి . హనీమూన్ స్వీట్ ”

” అంటే వీళ్ళిద్దరూ ఇప్పుడే పెళ్ళి చేసుకున్నారంటావా ఏమిటి ? ”

” అయిఉండాలి. అంతే కదా మరి ”

నిదానం గా తలతిప్పి మళ్ళీ వాళ్ళ వైపుకి చూసింది. ఆవిడ ఏదో చెబుతోంది. ఆయన వింటున్నాడు. ఏదో జోక్ కాబోలు – ఫెళ్ళుమని నవ్వుతున్నాడు. భలే ఉంది చూసేందుకు.

” అది కాదూ- వాళ్ళిద్దరూ చిన్నప్పుడు ప్రేమికులేమో ? ఆయన భార్యా ఈవిడ భర్తా పోయాక ఇప్పుడు స్వేచ్ఛ దొరికి పెళ్ళి చేసుకున్నారేమో ? ”

” కావచ్చు ”

” అసలావిడ పెళ్ళే చేసుకోలేదేమో ? ఆయన ఆవిడని ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాడేమో ? భార్య పోయాక అప్పుడు వెళ్ళి చెప్పాడేమో ? ”

” కావచ్చు ”

” లేదంటే ఏదో గ్రూప్ హాలీడే లో ఒకరికొకరు తెలిశారేమో ? ఇద్దరికీ ఒకే ఆట బాగా వచ్చేమో ? ”

” ఏమో”

” తెలుసుకురాలేవూ నువ్వు ? నాకు చాలా కుతూహలం గా ఉంది ”

” ఏమో. తెలిశాక నీకు నచ్చుతారో లేదో ‘’

చూస్తూనే ఉంది. ఒకరిలోంచి ఒకరికి ఎంత ఆనందం వస్తోందో తెలిసిపోతూనే ఉంది.

” నీలిమా ” – శరత్ అడిగాడు  కొంచెం జంకుగా. కొంచెం ఆశగా. ” వాళ్ళని చూస్తూంటే నీకేమనిపిస్తోంది ? మన – మన సంగతి ఏమైనా…తేల్చాలని ? ”

నీలిమ చూపు ప్లేట్ మీద నిలిచిపోయింది. అదొక మహత్కార్యం లాగా పనీర్ ముక్కలు ఫోర్క్ కి గుచ్చి వదిలేస్తోంది.

” మాటిచ్చావు శరత్. తప్పద్దు ”

డిసర్ట్ తెచ్చుకున్నారు ఇద్దరూ. తలెత్తి చూసింది. తననే చూస్తున్నాడు. ” ఇతనంటే నాకిష్టం ” – నీలిమ అనుకుంది. నాకు ఇతని మీద నమ్మకం ఉంది. నా మీద నాకెందుకు లేదు ?

*****

తెల్లారి ఆలస్యం గా లేచి , బ్రంచ్ తినేసి బయటపడ్డారు. అలా ఊరికే నడక. సన్నగా జల్లు పడుతోంది. జీన్స్ మీద టీ షర్ట్ వేసుకుని  పసుపు రంగు పుల్ ఓవర్ తొడుక్కుంది. ఆ ఆకుపచ్చ మధ్యన ఆమె ఇంపుగా ఉంది అతని కళ్ళకి. తోటంతా తిరిగారు. చెరువు దాకా నడిచారు. అక్కడి గడ్డి బాగా పొడవు గా దట్టం గా ఉంది. ఏవో పేరు తెలియని పువ్వులు. మాలతిపొదలు అల్లుకున్న గుబురు కింద ని నేల మీద పడుకుండిపోయారు. ఆకుల సందుల్లోంచి మెత్తటి సూర్యకాంతి. ఉండీ ఉండీ తగిలే దక్షిణపు గాలి. ఏం మాటలు లేవు . కదలికలు లేవు. కొలనులో రెండు హంసలు. ఇక్కడ వీళ్ళిద్దరూ.

” ఇదంతా సొంతమవటం ఎంత బావుండి ఉండాలి ” – చాలాసేపటి తర్వాత అంది. ” ఇక్కడ చిన్నతనం గడవటం, ఎదిగాక దీనికంతా యజమాని కావటం…”

 

” బాధ్యతలూ ఉండేవి కదా. మన కోసం పనిచేసే మనుషులు. మరింక పని చేయలేనప్పుడు వాళ్ళని మనం చూసుకోవటం. … ”

” ఆ కుటుంబం ఇక్కడ చాలా తృప్తి గా గడిపి ఉంటారు. పాసిటివ్  వైబ్స్ తెలుస్తున్నాయనిపిస్తోంది. నీకూ అలాగే అనిపించేదా ? ఇక్కడ పనిచేశావు కదా ? ”

” బావుండేది. కొన్నాళ్ళకి ఇంకేదో కావాలనిపించింది. తర్వాత నువ్వు కనిపించావు ”

” మనం – మనం పెళ్ళి  చేసుకుంటే కొన్నాళ్ళకి అప్పుడూ   ఇంకేదో కావాలనిపిస్తుందా ? ”

శరత్ తలెత్తాడు.  విస్మయం. ” మనం ఆ విషయం మాట్లాడకూడదు కదా ”

” మనం దాని గురించే మాట్లాడుతున్నామనిపిస్తోంది, సూటి గా ఏమీ అనకపోయినా. మన వాగ్దానాలు మర్చిపోయి మాట్లాడేసుకుంటేనే నయమేమో. వాదించుకోవద్దు , కాకపోతే ”

” మనమేం వాదించుకోం. వాదించేందుకేమీ లేదు  కూడా. నాకు పెళ్ళి చేసుకోవాలని ఉంది, నీకు లేదు. అంతకన్నా ఏముంది ? ”

” నన్నొక బండరాయిలాగా చెప్తున్నావు ”

” నువ్వు రాయివి కాదు. నాకు తెలుసు.

చూడు నీలిమా- మనం చిన్న పిల్లలం కాదు. రెండేళ్ళ బట్టీ ఒకరికొకరం  చాలా ఇష్టం. ఇంకేమీ గుర్తు రావు  నీతో ఉంటే. నీకూ అంతే. నాకు తెలుసు. ఇప్పుడేదో పెళ్ళైనంత మాత్రాన అంతా చెదిరిపోతుందా ? ఎందుకుట ? ”

” కాని – నేను పొరబాటు చెయ్యకూడదని ఉంది …”

” మా అమ్మా నాన్నా లాగానా ? ” – అడిగాడు.

శరత్ కి పదిహేనేళ్ళప్పుడు అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఇద్దరి మధ్యా మాటలు కూడా లేవు. శరత్ ఎప్పుడూ ఆ సంగతి ఎత్తడు. నీలిమ వాళ్ళని కలుసుకోనేలేదు.

” ఏ పెళ్ళీ పర్ ఫెక్ట్ కాదు. తప్పులు వంశపారంపర్యం గా జరగవు. అయినా మీ అమ్మా నాన్నా బాగానే ఉన్నారు కదా ? ”

” ఆ. వాళ్ళు బావుండేవాళ్ళు ” – పరధ్యానం గా గడ్డిపరకలు లాగుతోంది – ” కాని- నాన్న పోయేప్పటికి అమ్మ కి  నలభై ఐదు నిండలేదు ”

శరత్ ఆమె బుజం మీద చేయి వేసి తన వైపుకి తిప్పుకున్నాడు . ” ఎల్లకాలం ఉంటానని మాటివ్వలేను. నా శాయశక్తులా  కృషి ఐతే చేస్తాను ”

అతనంతే. ఎలాంటప్పుడూ హాస్యమే.

నీలిమ నవ్వింది. ” అవును. చేస్తావు ”

” సరే ఐతే. మాట్లాడేసుకున్నాం, ఐపోయిందిగా. ” వాచ్ చూసుకున్నాడు. ” వెళదాం రా. కాస్త కాఫీ తాగుదాం. ”

*****

ఆ రోజు ఆదివారం. గోల్ఫ్ ఆడేందుకు తోడెవరైనా దొరుకుతారా అని వెతుక్కుందుకు బయల్దేరాడు శరత్. నీలిమ నీ రమ్మన్నాడు. బద్ధకమేసి ఉండి పోయింది – ఫ్రెష్ గా బ్రూ చేసిన కాఫీ రెండు మూడు కప్పులు తాగి ఆ సువాసనల మధ్యన  ఆదివారం పేపర్ లు చదువుతూ . . పదకొండయాక లేచి తయారై కిందికి వెళ్ళింది. ఆ రోజు వాన లేదు . కొంచెం ఎండ. చలిగాలి మాత్రం వీస్తోంది. గోల్ఫ్ కోర్స్ వైపుకి వెళదామా అనుకుని బయల్దేరి , మధ్యలో దారి తెలియక – ఏం చేద్దామా అనుకుంటూంటే –

వెనక నుంచి – ” గుడ్ మార్నింగ్ ”

వరండాలో ఆ పక్కన కూర్చుని ఉంది ఆవిడ – సరస్వతి గారు. కోరా రంగు జరీచీర,   గోధుమ రంగు శాలువా. వెచ్చగా ముడుచుకుని కూర్చుంది.

నీలిమ కి హాయిగా అనిపించింది. దగ్గరికి వెళ్ళింది.

” గోల్ఫ్ కోర్స్ కి వెళ్దామనీ…దారి తెలియలేదు- ”

” మా ఆయన కూడా అక్కడే . ఆ ఎండలో కంటే ఇక్కడ కూర్చోవటమే బావుందిలే, మీరూ ఉండిపొండి . మీ ఆయన వెళ్ళి ఎంతసేపైంది ? ”

” రెండు గంటలు. అతను నా భర్త కాదు. ”

” అయ్యో. ఏమనుకోకమ్మా. మీరిద్దరూ పెళ్ళి చేసుకుని హనీమూన్ కి వచ్చారేమో అనుకున్నాం. ”

వాళ్ళిద్దరూ నీలిమా వాళ్ళ గురించి మాట్లాడుకున్నారన్నమాట , వీళ్ళు మాట్లాడుకున్నట్లే.

కాస్త తటపటాయిస్తూ అనేసింది – ” మీరూ హనీమూన్ కి వచ్చారని మేము అనుకున్నాం. అంటే – శరత్ ఇదివరకు ఇక్కడ పని చేశాడు, అలా మీరు – ”

” ఓ. హనీ మూన్ స్వీట్ లో ఉన్నామని తెలిసిందా ? ” – ఆవిడ గలగలా నవ్వింది.

” మా పెళ్ళై యాభై యేళ్ళమ్మా. ఎప్పుడో ఇది కొత్తగా పెట్టినప్పుడు వచ్చాం ఇక్కడికి – ఒక్క రోజు ఉండగలిగాం అంతే. మళ్ళీ రావాలని అనుకునేవాళ్ళం- ఇప్పటికి కుదిరింది. మా యానివర్సరీ – అదే , స్వర్ణోత్సవం కదా – వాళ్ళనీ వీళ్ళనీ పిలిచి పార్టీ లు ఎందుకులెమ్మని – ఇప్పటికి, ఇలా. ఇంత ముసలాళ్ళకి మాకిక్కడేం పని అనుకుని ఉంటారు మీరు…”

” లేదు. అస్సలు అలా అనుకోలేదు. మిమ్మల్ని చూస్తే కొత్తగా ప్రేమలో పడిన వాళ్ళలాగే ఉన్నారు ”

” చాలా మంచి కాంప్లిమెంట్. థాంక్ యూ. రాత్రి మేమిద్దరం అనుకున్నాం, మీ జంట చూడ ముచ్చటగా ఉందని ”

కాసేపాగి ఆవిడే, ” మీకిద్దరికీ బాగా పరిచయం ఉందామ్మా ? ”

” అవును. రెండేళ్ళకి పైగా ”

” వూ. చాలా రోజులే. ఇవాళా రేపూ అబ్బాయిలు తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదేమో – బాధ్యతలూ అవీ వద్దనీ..”

” లేదు. అతను చేసుకుందామనే అంటాడు. నేనే – ఆగుతున్నది ”

సరస్వతి ఆపేక్ష గా నవ్వింది. ” అతనికి నువ్వంటే చాలా ఇష్టం ”

” అవును ”

లేత ఎండ పొడల మధ్యని, దయగల మొహం తో ,వాత్సల్యపు కన్నుల తో కూర్చున్న ఆ వృద్ధురాలు ఆ క్షణం లో నీలిమ కి దగ్గరగా తోచింది. చెప్పుకోవచ్చనిపించింది.

” నాకు- నాకేం చేయాలో తెలియట్లేదండీ ”

” అతను వద్దనటానికి ఏమైనా కారణం ఉందా ? ”

” ఏం లేదండీ. ఇద్దరికీ ఏ బరువు బాధ్యతలూ లేవు. వేరే ప్రేమవ్యవహారాలు లేవు. ఇద్దరికీ మంచి ఉద్యోగాలు ”

” నీ ఉద్యోగం నీకు చాలా ముఖ్యమా ? ”

” ముఖ్యమే. కాని పెళ్ళయాకా చేయచ్చు కదా. పిల్లలు పుడితే – కొన్నాళ్ళు బ్రేక్ తీసుకోవచ్చేమో, నాకేం పర్వాలేదు అది ”

” నీ తక్కిన జీవితం మొత్తం అతనితో గడపబోవటం నచ్చట్లేదా ? ”

” లేదు లేదు. నచ్చుతోంది. అందుకే భయం. మరొక మనిషిలో భాగమయిపోవటం గురించి భయమేస్తోంది. నన్ను పోగొట్టుకోవటం గురించి. శరత్ అమ్మా నాన్నా విడాకులు తీసుకున్నారు. మా అమ్మా నాన్నా చాలా బావుండేవాళ్ళు. ఒకరిని విడిచి ఇంకొకళ్ళుండేవాళ్ళు కాదు. ఉన్నట్లుండి నాన్న హార్ట్ అటాక్ తో పోయారు. అమ్మ .అప్పటిదాకా ఎంతో నిబ్బరం గా   నిలబడి ఉండేది, ఎవరికేం కష్టం వచ్చినా కూడా. ముక్కలైపోయింది. ఏదోక రోజు తన బాధ తగ్గి మామూల వుతుందనుకున్నాం – కాని ఆమె వెనక్కి రాలేదు. ఆమె జీవితం అక్కడ ఆగిపోయింది. నాకు అమ్మంటే ఇష్టం. చాలా ఇష్టం . కాని తనతోబాటు శాశ్వతం గా విషాదం లో మునిగిపోలేను – కదా  ? ”

” శరత్ ని ఆవిడ చూశారా ? నచ్చాడా ? ”

” ఆ. మొదట్లో హోటల్ లో పనిచేస్తాడని కాస్త చిన్నచూపు ఉండేదనుకుంటా. ఒకసారి మేం వెళ్ళినప్పుడు అమ్మకి జ్వరం. శరత్ చక్కగా వండిపెట్టాడు. ఆమె ఉక్కిరిబిక్కిరై పోయింది. సంతోషించింది కూడా లెండి . తర్వాత అంటుందీ – ‘ మీ నాన్న కి వంట అస్సలు వచ్చేది కాదు ‘ -ఏ విషయమైనా నాన్న దగ్గరికే వెళ్ళి ఆగుతుంది ”

” నాకు అర్థమవుతోందమ్మా ఆవిడ బాధ. నీ కష్టం కూడా. కాని ఎప్పుడోకప్పుడు తప్పదు కదా. నాకు డెబ్భై, ఆయనకి డెబ్భై ఐదు. ఇంకెన్నేళ్ళో ఉంటాయనుకోలేం – ఎవరు ముందో ఎవరు వెనకో. ఒకవేళ – ఒకవేళ ఆయనే ముందు వెళ్ళిపోతే – వెళ్ళిపోయినా – నేనుంటాను. నాకు భయం వేయదు. చాలా చాలా గొప్ప జ్ఞాపకాలు కూడా నాతో ఉంటాయి. ప్రసాద్ అంటే చాలా ప్రేమ నాకు – అయితే ఆయన వెనక వెనకే ఉండాలనేం ఉండదు . చూడు – అందుకేగదా, ఇక్కడ కూర్చున్నాను ”

” మీకు గోల్ఫ్ రాదా ? ”

” ఇంకా నయం. నాకు ఒక్కటంటే ఒక్క ఆట రాదు. కొన్నాళ్ళు వీణ నేర్చుకున్నాను. కచేరీలు చేసేంత కాదుగాని బాగానే పట్టుబడింది. నా కోసం నేను వాయించుకుంటాను – అది నా సొంతం. అలిసిపోయినా , ఆందోళనగా ఉన్నా – వీణ నాకు ఊరట. ఎప్పటికీ, బహుశా ”

” అమ్మ కి సంగీతం రాదు. తోట పని చేసేది. నాన్న పోయాక అదీ మానేసింది – ఇద్దరూ కలిసి చేయటాన్ని గుర్తు చేసుకుని ”

” నాకొక కళ లో ప్రవేశం ఉండటం నా అదృష్టం. కాని ఉండక్కర్లేదు చూడు – నా స్నేహితురాలొకామె కుక్కని పెంచుకుంటుంది. వానయేది ఎండయేది – రోజూ దాన్ని షికారు తీసుకెళ్ళాల్సిందే , తను మాత్రమే. అదే తనకి మతి పోకుండా కాపాడిందంటుంది ”

నీలిమ అంది – ” మా అమ్మ లాగా అవనని నాకు తెలిస్తే ఎంతబావుండు ! అలా ఐపోతానని నాకు భయమండీ ”

సరస్వతి చాలాసేపు నీలిమకేసి సూటిగా చూస్తుండిపోయింది.

” పెళ్ళి చేసుకోవాలనుందా అతన్ని ? ”

నీలిమ తల ఊపింది.

” అయితే చేసేసుకో. నువ్వేమంత పిచ్చిదానివి కాదు, పూర్తిగా అతని సొత్తు అయిపోవటానికి ! అతను అంత ప్రేమిస్తున్నా ఇంత గట్టిగా ఉన్నావు కదా, తెలియట్లేదూ ? ” – నీలిమ చేయి పట్టుకుంది .

” గుర్తు పెట్టుకో. నీ సొంత ప్రపంచాన్ని నువ్వు ఏర్పరచుకో. నీ స్వేచ్ఛని ఉత్సాహం గా నిలబెట్టుకో. అతను నిన్ను గౌరవిస్తాడు- అతని ప్రపంచాన్ని అతనికి వదిలినందుకు కృతజ్ఞతతో  కూడా ఉంటాడు. ఇద్దరి ప్రాణాలూ సుఖాన ఉంటాయి ”

” మీ ఇద్దరి లాగా ”

” మా గురించి నీకేం తెలుసమ్మా ? ”

” మీ పెళ్ళై యాభై ఏళ్ళైంది – ఇంకా మీరు కలిసి నవ్వుకోగలుగుతున్నారు కదా ”

” అదే కావాలా నీకు ? ”

ఒక్క క్షణం ఆగి అంది నీలిమ – ” అవును ”

” అయితే వెళ్ళి  దాన్ని  రెండు చేతులతో వాటేసుకోవెందుకు ? చూడు, శరత్ వస్తున్నాడు –  ”

దూరం గా ఇద్దరు మనుషులు ఇటే నడుస్తూ. వాళ్ళలో ఒకడు శరత్. నీలిమకి పిచ్చి సంతోషమేసింది ఒక్కసారిగా.

” వెళతా ”

లేచి నిలుచుంది. అడుగు వేయ బోయి, ఆగి – వెనక్కి. సరస్వతి బుజాల చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ” థాంక్ యూ అండీ ”

చర చరా మెట్లు దిగేసింది. శరత్ దూరం నుంచి చేయి ఊపాడు. నీలిమా ఊపింది.

ఇంక ఒక్క క్షణం వృధా వద్దు.

 

                                   [బ్రిటిష్ రచయిత్రి Rosamunde Pilcher 1980-90  ల లో రాసిన కథ Weekend  కి అనుసరణ ]

8 Comments

 1. ఈ కధ అనుసరణ అంటే కూడా నమ్మబుద్దేయటం లేదు .భలే ఉందండి కధనం…కమిట్మెంట్ ఫోబియా అమ్మాయి, బాగా ఇష్టపడే అబ్బాయి … కొన్ని చోట్ల, చిన్ని వాక్యాల్లో ఎంత చెప్పారు !! ఈ వాక్యం లో ఆ అమ్మాయి క్యారెక్టర్ ని , మానసిక పరిస్థితిని –> ” కాని – నేను పొరబాటు చెయ్యకూడదని ఉంది …”…. …. ముగింపు వాక్యం భలే నచ్చింది “అయితే వెళ్ళి దాన్ని రెండు చేతులతో వాటేసుకోవెందుకు ? ” ఎలాగో వెబ్సైటు ప్రారంభించారు కదా … మరిన్నీ కధలు రాయండి ప్లీజ్

  Liked by 1 person

  1. ధన్యవాదాలు సురేష్… రాయాలనే, ఇంక. ఇది బ్లాగ్ కీ పత్రిక కీ హైబ్రిడ్. నెలకోసారి అప్ డేట్ చేస్తాము..

   Liked by 1 person

 2. బావుంది..అస్తిత్వాన్ని నిలుపుకుంటూ,ఇష్టమైన companion తో జీవితం పంచుకుని,ట్రావెల్ చేయొచ్చు..space ఇవ్వడం ద్వారా తీసుకోవడం కూడా జరుగుతుంది

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s